Union Budget 2023: ప్రపంచంలో టాప్ 5 ఆర్థిక వ్యవస్థగా భారత్.. తలసరి ఆదాయం రెండు రెట్లు: నిర్మలా సీతారామన్

By Mahesh K  |  First Published Feb 1, 2023, 1:13 PM IST

ప్రపంచంలో భారత్ పదో ఆర్థిక వ్యవస్థ నుంచి ఐదో ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో వెల్లడించారు. గడిచిన తొమ్మిదేళ్లలో పౌరుల తలసరి ఆదాయం రెండు రెట్లు పెరిగిందని వివరించారు. ఈ రోజు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెడుతూ ప్రసంగించారు.
 


న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ప్రభుత్వం చివరి బడ్జెట్‌ను ఈ రోజు ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె పార్లమెంటులో మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 10వ స్థానం నుంచి 5వ స్థానానికి పెరిగిందని వివరించారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఇది సాధ్యం అయిందని తెలిపారు. అంతేకాదు, ఈ కాలంలో పౌరుల తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందని, రెండు రెట్లు పెరిగిందని వివరించారు.

భారత ఆర్థిక వ్యవస్థ సరైన దారిలో పురోభివృద్ధి చెందుతున్నదని, ఉజ్వల భవిత వైపు వడిగా సాగుతున్నదని నిర్మలా సీతారామన్ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను ఒక ఉజ్వల ద్వీపంగా ప్రపంచం గుర్తించిందని ప్రస్తావించారు. 

Latest Videos

undefined

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7 శాతంగా అంచనా వేశారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలో ఇదే గరిష్టం. అంతేకాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధానాల్లో భారత పాత్రను మరింత బలోపేతం చేయడానికి జీ20 సదస్సుకు అధ్యక్షత వహించడం ఒక సదవకాశాన్ని అందిస్తున్నది.

Also Read: వేతన జీవులకు ఊరట.. ఆదాయపు పన్ను పరిమితి రూ. 7 లక్షలకు పెంపు.. వారికి మాత్రమే..

బడ్జెట్ ప్రసంగం మొదలు పెడుతూ ఇది అమృత కాలంలో మొదటి బడ్జెట్ అని కేంద్ర ఆర్థిక మంత్రి అన్నారు. మోడీ ప్రభుత్వం చెప్పే న్యూ ఇండియా సూత్రాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సాగు రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి అగ్రికల్చర్ యాక్సిలేటర్ నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాగే, రైతు కేంద్రంగా పంట ప్రణాళిక, నిల్వలకు సహాయపడేలా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మిస్తామని తెలిపారు. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో తమ ప్రభుత్వం ఏడు అంశాలకు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. అవి.. సంఘటిత అభివృద్ధి, అంతిమ స్థానంలోని వారి వరకు అందుబాటులో ఉండటం, వ్యవసాయం- పెట్టుబడి, సంపూర్ణంగా శక్తి సామర్థ్యాలను వినియోగించడం, హరిత వృద్ధి, యువ శక్తి, ఆర్థిక రంగం అని ఆమె తెలిపారు.

click me!