వివాహం ఆలస్యం కావడం ఒకటే కాదు. జాతకాదుల్లో దోషాలు కనపడినప్పుడు ఆ దోషాలు వైవాహిక జీవన ఆనందానికి కూడా లోపం అవుతాయి. వాటిని ముందుగానే గమనించి తగిన నివారణ చర్యలు చిన్నప్పటి నుంచే చేసుకోవడం మంచిది.
వివాహమనేది జీవితంలో అతిముఖ్యమైన ఘట్టం. ఆధ్యాత్మిక శాస్త్రాలనుసరించి అది ఒక సంస్కారం. వ్యక్తిని సంస్కరించడానికి ఉపకరించే ఈ ప్రక్రియ ఆనందప్రదంగానూ, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేదిగాను ఉండాలి.
లగ్నంలో తాను, సప్తమంలో సామాజిక సంబంధాలు ఉంటాయి. చంద్రుడు మనఃకారకుడు కావడం వలన చంద్రుడు ఉన్న స్థానాన్ని పరిశీలించడం జరుగుతుంది. రవి ఆత్మశక్తికి లగ్నం శరీర శక్తికి ప్రాధాన్యం వహించడం వలన ఆ రెండింటిని కూడా పరిశీలించాల్సిన అవసరం కనిపిస్తుంది. కళత్రకారకుడైన శుక్రగ్రహ స్థితి పరిశీలించడం ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఇక ఏ శుభకార్యానికైనా గురుబలం కావాలి కాబట్టి గురుదృష్టి వీక్షణం గమనించాలి. వివాహ విషయంలో ప్రధానంగా కుజ, శని, రాహు గ్రహ స్థానాలను పరిశీలించాలి. వాటితో పాటుగా జాతకంలో ద్వితీయస్థానం కుటుంబస్థానం, సప్తమం- కళత్రస్థానం, వ్యయస్థానం, పంచమస్థానాలను, గ్రహదృష్టులు గ్రహ యుతులు గమనించాలి. అష్టమం సౌభాగ్యస్థానం, సప్తమం భర్తృస్థానం చూడాలి.
ఆలస్య వివాహాలు సూత్రాలు :
1. లగ్నాధిపతి మరియు సప్తమాధిపతి కలిసి లేదా విడివిడిగా 6,8,12 స్థానాల్లో ఉంటే ఆలస్య వివాహం.
2. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నా, అష్టమాధిపతి నక్షత్రంలో ఉన్నా, అష్టమాధిపతి సప్తమంలో ఉన్నా వివాహం ఆలస్యం.
3. సప్తమాధిపతి రాహు, కేతు నక్షత్రాల్లో ఉన్నా వివాహం ఆలస్యం.
4. సహజ సప్తమమైన తులలో నైసర్గిక పాప గ్రహాలుంటే దానికి అనుబంధ రాశులైన కన్య, వృశ్చికాలలో పాప గ్రహాలుంటే వైవాహిక జీవితంలో లోపం.
5. లగ్నం నుండి లేదా చంద్రుడి నుండి సప్తమస్థానాన్ని బలమైన పాప గ్రహాలు చూస్తున్న వివాహం జరుగదు, లేదా ఆలస్యమౌతుంది.
6. శుక్రుడు ఉన్న రాశ్యాధిపతి నీచలో ఉన్నా లేదా 6,8,12 స్థానాల్లో ఉన్నా ఆలస్య వివాహం.
7. శుక్రుడి నుండి సప్తమంలో కుజ, శనులు ఉంటే లేదా కుజ, శనులు పరస్పరం ఎదురెదురుగా ఉంటే ఆలస్య వివాహం.
8. శుక్ర, చంద్ర, గురు, రవి గ్రహాలు నీచలో ఉంటే వివాహం ఆలస్యమౌతుంది.
9 పాపకర్తరీ మధ్యలో గ్రహాలుంటే దోషం, ఆలస్య వివాహం.
10. రవి, శనులు కలిసి సప్తమ స్థానంలో ఉంటే వివాహం ఆలస్యం.
వివాహం ఆలస్యం కావడం ఒకటే కాదు. జాతకాదుల్లో దోషాలు కనపడినప్పుడు ఆ దోషాలు వైవాహిక జీవన ఆనందానికి కూడా లోపం అవుతాయి. వాటిని ముందుగానే గమనించి తగిన నివారణ చర్యలు చిన్నప్పటి నుంచే చేసుకోవడం మంచిది. శ్లోక పఠనాలు, పారాయణదులతో పాటు, దానం చేయడం అత్యావశ్యకం. వివాహం కావడానికి, వైవాహిక జీవితం ఆనందంగా ఉండడానికి వివాహితులకు కాని అవసరమైన వారికి కాని అలంకరణ వస్తువులు దానం చేయడం, నిమ్మకాయ పులిహోర పంచడం, డ్రైఫ్రూట్స్ పంచడం లాంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఈ నివారణ చర్యలు చేపట్టి సరియైన సమయంలో వివాహం జరిగి ఆనందప్రద జీవితానికి ప్రయత్నం చేయవచ్చు.
డా|| ఎస్. ప్రతిభ
ఇవి కూడా చదవండి..
ఈ వారం( 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి
17 ఆగస్టు 2018 శుక్రవారం రాశిఫలాలు