‘బొసిడికే’ ఏపీ రాజ‌కీయాల్లో ఈ ఏడాది మార్మోగిన ప‌దం..

By team telugu  |  First Published Dec 16, 2021, 7:41 PM IST

ఏపీ రాజకీయాల్లో ఓ బూతుపదం ఏడాది మారుమోగింది. అక్టోబర్ లో నాయకుడి వల్ల వెలుగులోకి వచ్చిన  ఈ పదం చుట్టు చాలా రచ్చ జరిగింది. ఈ పదం అర్థం ఏంటని చాలా మంది గూగుల్ లో సెర్చ్ చేశారు. 


AP POLITICS ROUNDUP 2021 : ‘బొసిడికే’ ఈ బూతు ప‌దం ప‌లక‌డానికే ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఈ ప‌దం ఈ ఏడాది ఏపీ రాజ‌కీయాల్లో మార్మోగింది. గ్రామాల్లో చ‌దువురాని వారు, బ‌య‌టి ప్ర‌పంచంలో పెద్ద‌గా తిర‌గ‌ని వారు ఇలాంటి ప‌దాలు వాడుతుంటారు. కానీ ఏపీ రాజ‌కీయాల్లో ముఖ్య స్థానాల్లో ఉన్న నాయ‌కులు ఈ ప‌దాన్ని వాడ‌టం ప‌ట్ల స‌మాజంలో బాగా చ‌ర్చ జ‌రిగింది. ఈ ఏడాది అక్టోబ‌ర్‌లో వెలుగులోకి వ‌చ్చిన ఈ ప‌దం చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. 

ఈ ర‌చ్చ ఎక్క‌డ మొద‌లైందంటే..? 
అస‌లు ఇంత‌గా ర‌చ్చ చేసిన ఈ ‘బొసిడికే’ ప‌దం మొదట వెలుగులోకి తీసుకొచ్చింది టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మరెడ్డి పట్టాభి. అంటే అంతకు ముందు ఈ పదం లేదని కాదు. కానీ ఇలా మీడియా స‌మ‌క్షంలో ఓ పెద్ద మ‌నిషి, మ‌రో పెద్ద మ‌నిషిని ఉద్దేశించి మాట్లాడ‌టం ఇదే మొద‌టిసారి. ఈ ప‌దాన్ని ప‌ల్లెటూర్ల‌లో చ‌దువుకోని వారు కూడా ఈ మ‌ధ్య వాడ‌టం లేదు. కానీ ఒక పార్టీలో ముఖ్య స్థానంలో ఉన్న ప‌ట్టాభి.. ఏపీ సీఎం జ‌గ‌న్ ను ఉద్దేశించి ఈ ప‌దం ఉప‌యోగించ‌డం ఈ ర‌చ్చ‌కు దారి తీసింది. కొమ్మ‌రెడ్డి ప‌ట్టాభి వ్యాఖ్య‌లు మీడియాలో, సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అయ్యాయి. త‌మ నాయ‌కుడిని అంత మాట అంటారా అంటూ  వైఎస్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌లు, జ‌గ‌న్ అభిమానులు టీడీపీ ఆఫీసుల మీద దాడులు చేశారు. ప‌ట్టాభి ఇంటిపైన కూడా దాడులు చేశారు. కారు అద్దాలు ప‌గల‌గొట్టి, ఫ‌ర్నీచ‌ర్ ధ్వ‌సం చేశారు. దీంతో ఏపీ టీడీపీ నాయ‌కులు జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. దీనిపై వైసీపీ నేత‌లు కూడా ప్ర‌తి విమ‌ర్శ‌లు చేశారు. 

Latest Videos

మ‌రో అర్థం చెప్పిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌..
బొసిడికే ప‌దంపై వైసీపీ, టీడీపీ నాయ‌కులు మ‌ధ్య మాట‌ల యుద్దం న‌డుస్తున్న స‌మ‌యంలోనే వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామకృష్ణ క‌లుగజేసుకొని ఈ ఇష్యూని మ‌రింత పెద్ద‌ది చేశారు. బొసిడికే అంటే వైసీపీ నాయ‌కులు ఎందుకు అంత‌లా రియాక్ట్ అవుతున్నార‌ని విమ‌ర్శించారు. తాను ఈ ప‌దం అర్థం ఏంటి అని చాలా మందిని అడిగాన‌ని, కానీ ఎవ‌రికీ ప‌దం ఎంటో కూడా తెలియ‌ద‌ని జ‌వాబు వ‌చ్చింద‌ని చెప్పారు. దీని అర్థం కేవ‌లం ‘సార్ బాగున్నారా’ అని గూగుల్ చెబుతోందని మ‌రో అర్థం చెప్పారు. దీనిపై ఆయ‌నపై వైసీపీ సోష‌ల్ మీడియా టీం దాడి చేసింది. ఆయ‌న మాట‌లు ఈ ఇష్యూని చ‌ల్లార్చ‌క‌పోగా.. మ‌రింత పెద్ద‌దిగా చేశాయి. 
ఈ ఇష్యూలో వైసీపీ నేత‌ల చ‌ర్య‌ల‌ను ఆ పార్టీ నాయ‌కుడు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణ రెడ్డి స‌మ‌ర్ధించాడు. త‌మ నాయ‌కుడిపై ఇలాంటి ప‌దాలు ఉప‌యోగిస్తే ప‌ట్టాభికి పట్టిన గ‌తే ప‌డుతుంద‌ని ప‌రోక్షంగా హెచ్చ‌రించారు. ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా ఎన్నికైన ఒక సీఎంను ఇలాంటి అస‌భ్య‌క‌ర‌మైన ప‌దాలు వాడ‌టం ఏంట‌ని టీడీపీ నేత‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

స‌భా వేదిక‌పై ఆ ప‌దం అర్థం చెప్పిన సీఎం జ‌గ‌న్‌..
ఈ  ప‌దంపై వైసీపీ, టీడీపీ నాయ‌కుల మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ స్పందించారు. ఓ స‌భా వేదిక‌లో ప్ర‌జ‌లంద‌రి ముందు ఈ ప‌దం వాడి దాని అర్థం ఏంటో కూడా చెప్పారు. ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్య‌క్తిని ఓ వ్య‌క్తి ‘బొసిడికే’ అనే దూషించాడని, దాని అర్థం ‘లంజా కొడుకు’ అని చెప్పారు. ఒక రాష్ట్రానికి రాజ్యాంగబద్దంగా సీఎంగా ఎన్నికైన త‌నపై ఇలాంటి ప‌దం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఈ ప‌దం వింటే స్వ‌త‌హాగానే కోపం వ‌స్తుంద‌ని, అలాగే త‌న‌ అభిమ‌నాల‌కు బీపీ పెరిగి, ఆవేశం ఆపుకోలేక దాడులు చేశార‌ని చెప్పారు. ప‌రోక్షంగా వైసీపీ నాయ‌కులు చేస్తున్న దాడుల‌ను స‌మ‌ర్థిస్తూనే, మ‌రో సారి ఎవ‌రూ ఇలాంటి సాహ‌సం చేయ‌కూడ‌ద‌ని హెచ్చ‌రించిన‌ట్లు మాట్లాడారు. 

సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌..
ఈ ప‌దం చుట్టూ ఏపీలో ర‌చ్చ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఈ ఇష్యూలో సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఈ ప‌దం అర్థం ఏంటో తెలిస్తే చెప్ప‌రూ ? అంటూ ప్ర‌శ్న‌లు వేసుకున్నారు. బొసిడికే పదం ఉప‌యోగించి యాష్‌ట్యాగ్స్ షేర్ చేశారు. క‌ర్టూన్స్ వేస్తూ రాజ‌కీయ నాయ‌కులపై ట్రోల్ చేశారు. ఇవేనా మీరు నెక్ట్స్ జ‌న‌రేష‌న్‌కు ఇచ్చే ప‌ద సంప‌ద అంటూ ప్ర‌శ్నించారు. బొసిడికే అంటూ బాగున్నారా అని అర్థం చెప్పిన ర‌ఘురామ కృష్ణ కామెంట్స్‌పై క‌ర్టూన్ వేసి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేశారు. అలాగే మందు బాట‌ళ్ల‌పై బొసిడికే అని రాసి ఉన్న స్టిక‌ర్స్ ఫొటోల‌ను షేర్ చేస్తూ.. అది టిట్టు కాదు బ్రాండ్ అంటూ కామెంట్స్ చేశారు.  అస‌లు ఈ ప‌దం మీనింగ్ ఏంటని గూగుల్ లో సెర్చ్ చేస్తూనే ఉన్నారు. అక్టోబ‌ర్‌లో వెలుగులోకి వ‌చ్చిన ఈ ప‌దం ఈ ఏడాది చివ‌రి వ‌ర‌కు ట్రెండింగ్‌లోనే ఉంది.

34 శాతం ఫిట్‌మెంట్ సాధ్యం కాదు.. సీఎం తో భేటీ తర్వాత సజ్జల కీలక వ్యాఖ్యలు

స‌భ్య స‌మాజానికి ఏం చెప్తున్న‌ట్టు..? 
ఏపీ రాజ‌కీయాలు రాజ‌కీయాలు ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటూ వార్త‌ల్లో నిలుస్తుంటాయి. గ‌తంలో టీడీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో కూడా ఏపీ ఎప్పుడు వార్త‌ల్లో నిలిచింది. వైసీపీ, టీడీపీ ఒక‌రిని ఒక‌రు దూషింటుకుంటూనే ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక కూడా ఇదే ట్రెండ్‌ను కొన‌సాగిస్తున్నాయి. ఇలాంటి బూతులు తిడుతూ స‌భ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇద్దామ‌నుకుంటున్నారో నాయ‌కులే ఆలోచించుకోవాలి. భావి పౌరులు మ‌న నాయ‌కుల నుంచి ఏం నేర్చుకోవాలో చెప్పే రోజులు పోయాయి. ఇప్పుడు వారి నుంచి ఏం నేర్చుకోకూడ‌దో చెప్పే రోజులు వ‌చ్చాయి. వాళ్లు ఇప్ప‌టికైనా మారాల్సిన అవ‌స‌రం ఉంది. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు చేసుకోవాలే త‌ప్ప వ్య‌క్తిగ‌తంగా దాడులు, ప‌రుష‌ప‌ద‌జాలాలు ఉప‌యోగించ‌కూడ‌దు. విమ‌ర్శ‌లు హుందాగా ఉండాలే త‌ప్ప.. చౌక‌బారుగా ఉండ‌కూడ‌దు. చిల్ల‌ర రాజకీయాలు చేయ‌కూడ‌దు. ప్ర‌జ‌ల‌కు ఉప‌యోప‌డే అంశాల‌పై విమ‌ర్శ‌లు చేస్తూ, పోరాడితే ప్ర‌తీ ఒక్క‌రూ గుర్తిస్తారు. రాజ‌కీయంలో ఉన్నప్పుడు అంద‌రూ త‌మ‌ని గ‌మ‌నిస్తూ ఉంటారన్న విష‌యాన్ని నాయ‌కులు గుర్తించాలి. ప్ర‌తీ మాట ఆచుతూచి మాట్లాడాలి. త‌మ మాట‌లు సమాజంలో శాంతిని నెల‌కొల్ప‌క‌పోయినా ప‌ర్వాలేదు గానీ అశాంతికి కార‌ణం కాకుడ‌ద‌ని గుర్తుంచుకోవాలి.

click me!