Asianet News TeluguAsianet News Telugu

అయ్యో పరువుపోయిందే... ఇప్పుడెలా..: తెలంగాణ సీఎం రేవంత్ వీడియో వైరల్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఆయన ఇటీవల 'ఆప్ కి అదాలత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో ఆయనకు విచిత్రమైన అనుభవం ఎదురయ్యింది...

Telangana CM Revanth Reddy Interview in Aap ki Adalat Goes viral AKP
Author
First Published Apr 15, 2024, 10:09 AM IST

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేదు అనుభవం ఎదురయ్యింది. ఇటీవల ఆయన ప్రముఖ జాతీయ ఛానల్ లో ప్రసారమయ్యే 'ఆప్ కి అదాలత్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ రజత్ శర్మ సంధించిన ప్రశ్నలకు రేవంత్ తనదైన స్టైల్లో ఆసక్తికరంగా జవాబులు ఇచ్చారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. 

అసలేం జరిగింది : 

దేశప్రజలు మళ్ళీ బిజెపినే గెలిపించేందుకు సిద్దంగా వున్నారని     అన్ని సర్వేలు చెబుతున్నాయి. బిజెపి కూడా ఈసారి ఒంటరిగానే 370 కి పైగా, మిత్రపక్షాలతో కలిసి 400 కు పైగా లోక్ సభ స్థానాలను గెలుచుకుంటామని ప్రచారం చేస్తున్నాయి. అయితే అసలు ఏం చేసారని బిజెపిని మళ్ళీ గెలిపించాలి? ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని రేవంత్ సూచించారు.

దేశానికి స్వాతంత్య్రం వచ్చినతర్వాత 14 మంది ప్రధానమంత్రులు కలిసి కేవలం రూ.65 లక్షల కోట్లు మాత్రమే అప్పు చేసారని రేవంత్ తెలిపారు.  కానీ నరేంద్ర మోదీ ఒక్కరే ఈ పదేళ్లలో రూ.113 లక్షల కోట్ల అప్పులు చేసారని... ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. గత 67 ఏళ్లలో జరిగిన అభివృద్ది కంటే ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ది అంత గొప్పగా ఏమీ లేదన్నారు.    ఇలా ప్రశ్నించడం తన ఒక్కడి బాధ్యత మాత్రమే కాదు దేశ ప్రజలందరి బాధ్యత అన్నారు. ముఖ్యంగా విద్యావంతులైన యువత ఇలాంటి విషయాలన్నింటి గురించి ఆలోచించాలన్నారు. ముఖ్యంగా మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న యువత అన్నీ ఆలోచించి జాగ్రత్తగా ఓటు వేయాలని ఆప్ కి అదాలత్ కార్యక్రమం ద్వారా తెలంగాణ సీఎం కోరారు. 

దేశ భవిష్యత్ యువత చేతుల్లో వుంది... కాబట్టి వారి ఓటు చాలా ముఖ్యమైందని రేవంత్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కార్యక్రమంలో పాల్గోన్న యువతకు 'మీరు ఎవరికి ఓటేస్తారు' అని రేవంత్ ప్రశ్నించారు. దీంతో ఆడియన్స్ లోంచి ఎవరో మోదీకి ఓటేస్తామని సమాధానం చెప్పారు. ఇందుకు రేవంత్ 'వేయండి పరవాలేదు... కానీ ఓటేసే ముందు ఆలోచించండి' అని సూచించారు. 

సోషల్ మీడియాలో వైరల్ : 

కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే మోదీకే ఓటేస్తామని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. ''ప్రజలు ఎంతో ఆలోచించాకే మళ్లీ మోదీని ప్రధానిని చేయాలనుకుంటున్నారు... ఇప్పుడు ఆలోచించడానికి ఏం లేదు'' అని కొందరు  కామెంట్ చేస్తున్నారు. కాంగ్రెస్ కు మద్దతిచ్చేవారు మాత్రం రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఒక్కసారి దేశ పరిస్థితి గురించి ఆలోచించాలని ... అప్పుడు పరిస్థితి అర్థమవుతుందన్నారు. మత రాజకీయాలు తప్ప బిజెపికి అభివృద్ది, సంక్షేమం గురించి తెలియదని... ఆ పార్టీని గెలిపిస్తే దేశ పరిస్థితి మరింత దిగజారుతుందని అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios