Asianet News TeluguAsianet News Telugu

Konajeti Rosaiah death: వివాదరహితుడు, వాదనలో దిట్ట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య మరణంతో రాజకీయాలు ఆదర్శప్రాయుడైన నేతను కోల్పోయింది. రోశయ్య మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు.

Konajeti Rosaih death: Good orator, non controversial
Author
Hyderabad, First Published Dec 4, 2021, 9:42 AM IST

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణజేటి రోశయ్య మాస్ లీడర్ కారు. అయినప్పటికీ అంచెలంచెలుగా ఆయన రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చారు. కాంగ్రెసు పార్టీకి ఆయన విధేయంగా ఉంటూ వచ్చారు. ఎన్జీ రంగా స్వతంత్ర పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన Konajeti Rosaiah ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. వివాదరహితుడిగా, వాదనలో దిట్టగా ఆయన పేరు గాంచారు. కొణజేటి రోశయ్య శనివారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. 

పాత తరం రాజకీయ నేతగా రోశయ్య ఎక్కడా నోరు జారిన సూచనలు లేవు. ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో తన వాదననే ఆయుధంగా చేసుకున్నారు. విషయం పట్ల పూర్తి అవగాహనతో ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. ఆ సమయంలో Marri Chenna Reddyకి ఓ వైపు సమరసింహా రెడ్డి, మరో వైపు రోశయ్య అండగా నిలుస్తూ ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన తీరు అనన్య సామాన్యమైంది. రాజకీయాలు బూతుల స్థాయికి దిగజారిన ప్రస్తుత తరుణంలో ఆయన వ్యక్తిత్వం ఆదర్శంగా నిలుస్తుంది. 

కొణజేటి రోశయ్య 1978 నుంచి వివిధ ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేస్తూ వచ్చారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆయన పనిచేశారు. ముఖ్యమంత్రుల మన్ననలను పొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక మంత్రిగా రోశయ్య పనిచేసి తీరు అందరి మన్ననలను అందుకుంది. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 

Also Read: Konijeti Rosaiah Death: మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూత

బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థిక మంత్రిగా రోశయ్య ఘనాపాటిగా ప్రసిద్ధి పొందారు. ఆయన 16 సార్లు శాసనసభలో బడ్జెట్ ను ప్రతిపాదించారు. వరుసగా ఏడుసార్లు Budget ప్రతిపాదించిన ఆర్థిక మంత్రిగా దేశంలోనే రికార్డు సాధించారు. విషయం పట్ల పూర్తి అవగాహనతో ప్రతిపక్షాల విమర్శలను తన వాక్పటిమతో తిప్పికొట్టేవారు. వ్యంగ్యాస్త్రాలు విసరడంలో కూడా ఆయన పేరెన్నిక గన్నారు. ఆయన వాదనాపటిమకు ప్రతిపక్షాలు తలొంచే పరిస్థితి ఉండేది. అయితే, ఆయన ఎవరినీ వ్యక్తిగతంగా నొప్పించేవారు కారు. 

వివాదాలకు పేరు మోసిన జయలలిత ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో రోశయ్య తమిళనాడు గవర్నర్ గా పనిచేశారు. సున్నిత మనస్కుడైన రోశయ్య జయలలిత ధాటికి తట్టుకుంటారా అనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే, అత్యంత చాతుర్యంతో వ్యవహరిస్తూ జయలలితతో ఏ విధమైన వివాదాలు ఏర్పడకుండా పనిచేశారు. కాంగ్రెసు ప్రభుత్వం పడిపోయి ఎన్డీఎ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన తమిళనాడు గవర్నర్ గా కొనసాగారు. ఆయన వివాదరహితుడు కావడమే అందుకు కారణం. గవర్నర్ గా ఆయన రాజకీయ తటస్థతతో పనిచేశారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కున్నారు. తెలంగాణ ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి ఆయన ప్రయత్నించారు. 

సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో ఆయన మచ్చలేని రాజకీయ నేతగా నిలిచారు. పలు శాఖలను ఆయన నిర్వహించినప్పటికీ ఆయనకు అవినీతి అంటుకున్న సూచనలు కనిపించవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రధానంగా ఆదివారాలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇందులో మాత్రం ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరించేవారు. అప్పట్లో ప్రధాన ప్రసార సాధనం పత్రికా రంగమే. ఆదివారం సంఘటనలు, వార్తలు తక్కువగా ఉంటాయి. దాని వల్ల తన మీడియా సమావేశం ఆదివారం పెట్టుకోవడం వల్ల మంచి కవరేజీ వస్తుందని ఆయన భావించేవారు. రోశయ్య మరణంతో తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశం కూడా ఓ నిష్కలంక రాజకీయ నేతను కోల్పోయింది. 

Follow Us:
Download App:
  • android
  • ios