Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ టూ అమెరికా .. డైరెక్ట్ ఫ్లైట్ నడపండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎన్ఆర్ఐల విజ్ఞప్తి

హైద‌రాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి అమెరికాలో స్థిరపడిన తెలుగు ఎన్నారైలు వినతిపత్రం స‌మ‌ర్పించారు.  దీనిపై స్పందించిన ఆయన కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని హామీ ఇచ్చారు. 

telugu nris meets union minister kishan reddy and urges direct flight from hyderabad to usa ksp
Author
First Published Jul 16, 2023, 9:40 PM IST

హైద‌రాబాద్ నుంచి నేరుగా అమెరికాకు విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలంటూ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి అమెరికాలో స్థిరపడిన తెలుగు ఎన్నారైలు వినతిపత్రం స‌మ‌ర్పించారు. ప్రస్తుతం అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న కిష‌న్ రెడ్డిని ప్రవాస భారతీయులు కలిశారు. ఢిల్లీ , ముంబై వంటి అనేక భారతీయ నగరాలు ఇప్పటికే అమెరికాలోని ప్రధాన నగరాలతో నేరుగా విమాన కనెక్షన్‌లను కలిగి ఉన్నాయ‌ని ఎన్ఆర్ఐలు తెలిపారు. అమెరికా నుండి హైదరాబాద్‌కు నేరుగా విమానాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇతర పెద్ద పట్టణాలకు సమాంతర అభివృద్ది సాధ్యమౌతుందని ప్రవాసులు అన్నారు. 

వాణిజ్యం, పెట్టుబడులు, పర్యాటక రంగాలకు సంబంధించి ప్రపంచ గమ్యస్థానంగా హైదరాబాద్ ఆకర్షణను పెంచుతుంద‌న్నారు. అమెరికా నుండి హైదరాబాద్‌కు నేరుగా విమాన మార్గం ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, పర్యాటక శాఖ పరిగణనలోకి తీసుకోవాలని ఎన్ఆర్ఐలు కేంద్ర మంత్రిని విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి.. ఎయిర్ ఇండియా కొత్త ఫ్లైట్లను ఆర్డర్ చేయటంతో పాటు, కొత్త రూట్లలో విమాన సర్వీసులను తెచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. కేంద్ర అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా ప్రవాసుల కోరిక నెరవేరేలా చూస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. 

ALso Read: బీజేపీలో మూడు ముక్కలాట? నేనే సీఎం క్యాండిడేట్ అంటూ ఈటల, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం!

మరోవైపు.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డితో అమెరికాలో ఉన్న ప్రవాస తెలంగాణ వాసులు, తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నియమితులైనందుకు వారు కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రవాస తెలంగాణ వాసులు, ముఖ్యంగా టీడీఎఫ్ పోషించిన పాత్రను  కిషన్ రెడ్డి అభినందించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios