Asianet News TeluguAsianet News Telugu

మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..

బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి ఎన్నికలకు వెళ్తోందని ఇటీవల కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఈసీని కోరింది.

Match -fixing comments. BJP files complaint with EC against Rahul Gandhi..ISR
Author
First Published Apr 2, 2024, 9:56 AM IST

బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి ఎన్నికలకు వెళ్తోందని ఇండియా కూటమి ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మండిపడింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం రాహుల్ గాంధీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

ఎన్నికల సంఘం అధికారులతో సమావేశం అనంతరం పూరీ మీడియాతో మాట్లాడారు. బహిరంగ సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమని అన్నారు. అవి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో ఫిక్స్ డ్ మ్యాచ్ జరిగిందని, ఎన్నికల సంఘం విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారని, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనుమానాలు రేకెత్తించారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఎత్తిచూపారు. 

లోక్ సభ ఎన్నికలు ఫిక్స్ డ్ మ్యాచ్ అని, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘంలో తన సిబ్బందిని నియమించిందని రాహుల్ గాంధీ ఆరోపించారని పూరీ చెప్పారు. ఈవీఎంల విశ్వసనీయతపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారని, ఎన్నికల తర్వాత రాజ్యాంగాన్ని రద్దు బీజేపీ రద్దు చేస్తుందని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. 

ఇలాంటి వ్యాఖ్యల తీవ్రతను నొక్కిచెప్పిన పూరీ.. రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్, ప్రతిపక్షంలోని ఇండియా కూటమి సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. రాహుల్ గాంధీ పదేపదే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానడం లేదని, ఆయన మాట్లాడకుండా ఎన్నికల కమిషన్ పరిశీలించాలని ఆయన అన్నారు. 

ఇంతకీ రాహుల్ గాంధీ ఏమన్నారంటే ? 
అధికార బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రెండు రోజుల కిందట ఢిల్లీలో నిర్వహించిన ఇండియా కూటమి ర్యాలీలో ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో 400 సీట్ల మార్కును దాటి బీజేపీని గెలిపించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అంపైర్లను నియమించారని ఆరోపించారు.

అంపైర్లు, కెప్టెన్లపై ఒత్తిడి తెస్తే ఆటగాళ్లను కొనుగోలు చేసి మ్యాచ్ గెలుస్తారని, క్రికెట్లో దీన్ని మ్యాచ్ ఫిక్సింగ్ అంటారని అన్నారు. ‘‘మన ముందు లోక్ సభ ఎన్నికలు ఉన్నాయి. అంపైర్లను ఎవరు ఎంపిక చేశారు? మ్యాచ్ ప్రారంభానికి ముందే ఇద్దరు ఆటగాళ్లను అరెస్టు (ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం సొరెన్ ను ఉద్దేశించి) చేశారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నారు. బీజేపీ 400 సీట్లు వస్తాయని నినాదం చేస్తోంది. కానీ ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, మీడియాపై ఒత్తిడి తెచ్చి కొనుగోలు చేయకపోతే 180 సీట్లు కూడా చేరుకోలేదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios