Asianet News TeluguAsianet News Telugu

Omicron: ఒమిక్రాన్‌పై పోరాటంలో ఎదురుదెబ్బ.. 5 జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌ల మూసివేత!

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కరోనా కేసుల సంఖ్య రోజుకు మూడు లక్షల మార్క్‌ను దాటాయి. కేసులు లక్షల్లో రిపోర్ట్ అవుతున్నా.. జీనోమ్ సీక్వెన్సింగ్ మాత్రం చాలా స్వల్పంగా జరుగుతున్నాయి. గత నెల కంటే జీనోమ్ సీక్వెన్సింగ్‌ల సంఖ్య తగ్గడమే కాదు.. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయి. ఇందుకు కారణంగా వెల్లడైంది. మన దేశంలో జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే 38 ల్యాబ్‌లలో ఐదు ల్యాబ్‌లు మూతపడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అవసరమయ్యే కెమికల్ రీఏజెంట్ పదార్థాల కొరత ఉన్నదని, వీటి కోసం నిధుల్లేకనే ల్యాబ్‌లు మూతపడినట్టు తెలిపాయి.
 

five insacog labs shuts which confirms omicron variant of coronavirus
Author
New Delhi, First Published Jan 20, 2022, 5:17 PM IST

న్యూఢిల్లీ: మన దేశంలో కరోనా కేసులు(Corona Cases) భయంకరంగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 24 గంటల్లో కరోనా కేసులు మూడు లక్షలను దాటడం అందరిలోనూ ఆందోళనలు రేపింది. ఈ కేసులు కొత్త వేరియంట్ ఒమిక్రాన్(Omicron Variant) మూలంగానే పెరుగుతున్నాయి. అయితే, కరోనా వైరస్ వేరియంట్‌ను గుర్తిస్తే.. అందుకు తగిన చికిత్స అందించడానికి వీలవుతుందని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు అవసరమని చెబుతున్నారు. కానీ, పెరుగుతున్న కేసులకూ ఆ స్థాయిలో జీనోమ్ సీక్వెన్సింగ్(Genome Sequencing) చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీనికితోడు ఒమిక్రాన్ పై పోరాటంలో మరో ఇబ్బందికర వార్త వెలుగులోకి వచ్చింది. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ఐదు ల్యాబరేటరీలు(Lab) మూతపడినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 

జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టు ఫలితాలు ఈ మధ్య ఆలస్యంగా వస్తున్నాయి. ఇందుకు గల కారణం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించడానికి చేసే జీనోమ్ సీక్వెన్సింగ్‌‌కు అవసరం అయ్యే కెమికల్ రీఏజెంట్స్ కోసం నిధుల్లేక ఫలితాలు ఆలస్యం అవుతున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడానికి దేశవ్యాప్తంగా ఇండియన్ సార్స్‌కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం‌గా ఏర్పడ్డ 38 ల్యాబ్‌ల నెట్‌వర్క్ మన దేశంలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు చేస్తాయి. అయితే, ఈ 38 ల్యాబ్‌లలో 5 ల్యాబ్‌లు మూతపడినట్టు ఆ వర్గాలు తెలిపాయి. 

కేసులు భారీగా రిపోర్ట్ కావడంతో ఒమిక్రాన్ టెస్టుల సంఖ్యనూ పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, ఆ జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులకు అవసరం పడే కెమికల్ రీఏజెంట్ పదార్థం కొరత సమస్యగా మారింది. అయితే, ఈ కెమికల్ రీఏజెంట్ కోసం నిధులు లేవని తెలిసింది. ఈ కారణంగానే ఐదు జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ల్యాబ్‌లు మూతపడినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ఎన్ని కరోనా కేసులకు ఎన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇదే లిమిట్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. ఇవి మొత్తం కేసులతో పోల్చితే చాలా తక్కువే. దీనికితోడు.. గత నెలతో పోల్చితే.. జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టుల సంఖ్య 40 శాతం తగ్గినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఒమిక్రాన్ వేరియంట్ కోసం కేవలం 25వేల జీనోమ్ సీక్వెన్సింగ్‌లు చేసినట్టు తెలిసింది. మన దేశంలో తొలి ఒమిక్రాన్ వేరియంట్ కేసు గతేడాది నవంబర్‌లో రిపోర్ట్ అయింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. సైంటిఫక్ రీసెర్చ్ ఎప్పుడూ సాగుతూ ఉండాలని, వైరస్ పరిణామాన్ని క్షుణ్ణంగా పరిశీలించడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ సహా ఇతర పరిశోధనలూ అవసరం అని వివరించారు. ఇదే విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మన్సుఖ్ మాండవీయా, ఇతర ఉన్నత అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు.

ఇదే విషయాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎత్తిచూపాయి. జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. తద్వార సదరు పేషెంట్‌కు ఎలాంటి చికిత్స అందించాలనే విషయంపై నిర్దారణ వస్తుందని వివరించారు. కాగా, నేషనల్ కొవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్టర్ వీకే పాల్ ఇది సాధ్యపడదని స్పష్టం చేశారు. దేశంలో నమోదయ్యే ప్రతి కేసును జీనోమ్ సీక్వెన్సింగ్ చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios