Asianet News TeluguAsianet News Telugu

బళ్లారి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

బళ్లారిలో జరిగే చిన్న ఘటనైనా కర్ణాటకలో పెను ప్రభావం చూపుతుందనడంలో అతిశయోక్తి లేదు. రాయలసీమకు ఆనుకుని వుండే ఈ నగరం పేరుకు కర్ణాటకలో వున్నా 90 శాతం మంది తెలుగువారే. 1952 నుంచి కాంగ్రెస్ కంచుకోటగా వున్న బళ్లారిలో మొట్టమొదటి సారిగా కాషాయ జెండా రెపరెపలాడటానికి కారణం గాలి సోదరులు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్‌లు బళ్లారి నుంచి బరిలో దిగారు. గాలి జనార్థన రెడ్డి అనుచరుడు, సీనియర్ నేత బీ శ్రీరాములను ఎంపీ అభ్యర్ధిగా బరిలో దించింది బీజేపీ.  కాంగ్రెస్ విషయానికి వస్తే.. మాజీ మంత్రి తుకారాంను అభ్యర్ధిగా ప్రకటించింది. 

Bellary Lok Sabha elections result 2024 ksp
Author
First Published Apr 2, 2024, 3:33 PM IST

బళ్లారి ఈ పేరు చెప్పగానే.. మైనింగ్ కింగ్ , రాజకీయ నాయకుడు గాలి జనార్థన్ రెడ్డి, ఓబుళాపురం క్వారీలు గుర్తొస్తాయి. బళ్లారిలో జరిగే చిన్న ఘటనైనా కర్ణాటకలో పెను ప్రభావం చూపుతుందనడంలో అతిశయోక్తి లేదు. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతంలో బళ్లారి కీలక నగరం. విద్య, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో బళ్లారి ఎంతో అభివృద్ధి సాధించింది. రాయలసీమకు ఆనుకుని వుండే ఈ నగరం పేరుకు కర్ణాటకలో వున్నా 90 శాతం మంది తెలుగువారే. గాలి జనార్థన్ రెడ్డి బళ్లారి కేంద్రంగా కన్నడ సీమను శాసించారు. 

బళ్లారి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. గాలి జనార్థన్ రెడ్డి అడ్డా :

అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకు వెళ్లినప్పటికీ.. ఆయన తన సోదరులు, అనుచరులను ఎన్నికల బరిలో దించుతూ తెరవెనుక రాజకీయం నడిపించారు. 1952 నుంచి కాంగ్రెస్ కంచుకోటగా వున్న బళ్లారిలో మొట్టమొదటి సారిగా కాషాయ జెండా రెపరెపలాడటానికి కారణం గాలి సోదరులు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దివంగత కేంద్ర మంత్రి సుస్మా స్వరాజ్‌లు బళ్లారిలో హోరాహోరీగా తలపడటంతో అప్పట్లో ఈ నగరం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. 

1952లో ఏర్పడిన బళ్లారి లోక్‌సభ స్థానం ఎస్టీ రిజర్వ్‌డ్. ఈ సెగ్మెంట్ పరిధిలో నాలుగు ఎస్టీ రిజర్వ్‌డ్ అసెంబ్లీ స్థానాలున్నాయి. బళ్లారి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో హూవిన హడగాలి (ఎస్సీ), హగరి బొమ్మనహళ్లి (ఎస్సీ), విజయనగర, కంప్లి (ఎస్టీ), బళ్లారి (ఎస్టీ), బళ్లారి సిటీ , సండూర్ (ఎస్టీ) , కూడ్లిగి (ఎస్టీ) స్థానాలున్నాయి. ఈ శాసనసభ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు ఒక్కోచోట విజయం సాధించాయి. 1952 నుంచి 2000 వరకు కాంగ్రెస్ పార్టీదే బళ్లారిలో హవా. ఆ పార్టీ 15 సార్లు, బీజేపీ నాలుగు సార్లు ఇక్కడి నుంచి గెలిచాయి. 

బళ్లారి ఎంపీ (పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. సోనియాను ఢీకొట్టిన సుష్మా స్వరాజ్ :

1999 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బళ్లారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, బీజేపీ అగ్రనేత సుష్మా స్వరాజ్‌లు బళ్లారి నుంచి బరిలో దిగారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. సోనియా గాంధీకి 4,14,650 ఓట్లు.. సుష్మా స్వరాజ్‌కు 3,58,550 ఓట్లు పోలయ్యాయి. ఈ పోరులో సోనియా గాంధీ 56,100 ఓట్ల మెజారిటీతో బళ్లారితో విజయం సాధించారు. గాలి సోదరులు సుష్మ విజయం కోసం శ్రమించడంతో పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు. 2019 ఎన్నికల విషయానికి వస్తే.. బీజేపీ అభ్యర్ధి వై దేవంద్రప్పకు 6,01,388 ఓట్లు.. కాంగ్రెస్ అభ్యర్ధి వీఎస్ ఉగ్రప్పకు 5,75,681 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 25,707 ఓట్ల మెజారిటీతో బళ్లారిలో పట్టు నిలుపుకుంది. 

2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ .. గాలి జనార్థన రెడ్డి అనుచరుడు, సీనియర్ నేత బీ శ్రీరాములను ఎంపీ అభ్యర్ధిగా బరిలో దించింది. మోడీ ఛరిష్మాతో పాటు గాలి సోదరుల ప్రభావం, బోయ, కురుబ, వాల్మీకి సామాజికవర్గాల మద్ధతుతో తాను గెలుస్తానని శ్రీరాములు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే.. మాజీ మంత్రి తుకారాంను అభ్యర్ధిగా ప్రకటించింది. సండూర్, బళ్లారి ప్రాంతంలో ఆయనకు బలమైన అనుచరగణం వుంది. దీనికి తోడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటంతో తాను విజయం సాధిస్తానని తుకారాం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios