Asianet News TeluguAsianet News Telugu

డా. ఉదారి నారాయణ కవిత : జింకల దూప

అందరూ ఒక్కసారిగా నిద్ర మత్తు రెప్పల్ని దులిపి 
కొత్త దారిపై ఉత్తేజపు చూపులు నాటుతూ అంటూ ఆదిలాబాద్ నుండి డా. ఉదారి నారాయణ రాసిన కవిత ' జింకల దూప ' ఇక్కడ చదవండి : 

telugu poet doctor udhari narayana of jinkala dhoopa kms
Author
First Published Mar 4, 2024, 3:18 PM IST

సముద్రాలు ఎడారులై
ఎడారులు సముద్రాలయ్యే కాలం
ఇసిరి కొడుతున్న వానలా వస్తుందని
వేపచేట్టుకింద తాత చెప్పిన కథ సత్య మైంది.

నరాలు తెగేట్టు నినాదాలిచ్చి 
నెత్తురు చిమ్మేట్టు గాయాల
వాగులై పోరాడితే
ఇప్పుడేం మిగిలింది 
కళ్ళముందు కుక్కలు నాకినంక 
మిగిలిన విస్తరాకులు.

కొడుకు జైలుకెళ్ళినా
పాచి బువ్వతిన్నా 
బతుకు బంగార మౌతదని, 
పెయ్యి మీద లాఠీ ముద్రలు వెక్కిరిస్తున్నా 
కండ్ల గిన్నెల్లోనే దుఃఖాన్ని దాసవెట్టి
ఎదురు సూస్తే
చేతికచ్చినయి సొంతింటి బేడీలు 

పాలబర్రెను, పుస్తెల తాడును 
మార్వాడి చేతులవెట్టి నీళ్ళారగిచ్చి 
కొడుకును కోచింగుకై 
పట్నం పంపించిన తల్లికి
నెత్తిమీద నిట్టాడి ఇరిగిపడ్డ  సప్పుడు.

రేపో మాపో అనే నానవ్వ
సావుదారిని సప్పరిస్తున్న  బాపుతండ్రి 
వేసవి చెరువులా నెర్రెలిచ్చిన
చెట్టంత మనుమని మొఖంచూసి 
దోతి శెంగులు నిండిన దుఃఖం
ఆరుపదుల  పురిటినొప్పులు భరించి
తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్రాన్ని  ప్రసవిస్తే 
ఈడ్చు కెళ్ళ ఎదురు చూసే
నక్కల మంద.

చారెడు మెతుకుల కోసం
బతుకంతా పరుగు పందెంలో
అందని ఎండమావులకై 
సొమ్మసిల్లిన అమాయక జింకల పరుగు 

గండుపిల్లి మహా నటనకు
పక్షి పిల్లలు మోసపోవడం .
జిత్తుల నక్క సుతి మెత్తని పొగడ్తలకు 
పిచ్చికాకి ముక్కను వదులుకోవడం 
పుట్టను వదులుకుంటున్న చీమల బతుకు
కళ్ళంను దళారుల చేతుల వెట్టి
గుడ్లప్పగిచ్చి చూస్తున్న నాగలి దైన్యం 

అందరూ ఒక్కసారిగా 
నిద్ర మత్తు రెప్పల్ని దులిపి 
కొత్త దారిపై ఉత్తేజపు చూపులు నాటుతూ 
ఎదురెదురుగా నడుస్తూ నడుస్తూ....
ఉరుకుతూ ఉరుకుతూ…..

Follow Us:
Download App:
  • android
  • ios