Asianet News TeluguAsianet News Telugu

చదువుల తల్లి సావిత్రి భాయి పూలే

నేడు ( మార్చ్10 ) సావిత్రి భాయి పూలే వర్దంతి సందర్భంగా     హిస్టరి  అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్సింగు కోటయ్య రాసిన ప్రత్యేక వ్యాసం ఇక్కడ చదవండి

Savitri Bhai Phule is the mother of studies..ISR
Author
First Published Mar 10, 2024, 6:55 PM IST

ప్రసిద్ధి చెందిన పండితురాలు సామాజిక కార్యకర్త మహిళా హక్కుల ఉద్యమకారిని పండిత రమాబాయి పుట్టుకకు పదేళ్ల ముందుగానే శూద్ర  కులంలో జన్మించిన సావిత్రిబాయి పూలే మొదటి మహిళా టీచర్ గా తన కృషిని ప్రారంభించింది.

అట్టడుగు వర్గాలలో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆనాటి సమాజం కట్టుబాట్లను ధిక్కరించి భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు.  దేశంలో బహుజనులకు మొట్టమొదటి పాఠశాలను ప్రారంభించిన సావిత్రిబాయి పూలే మహారాష్ట్ర సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 03-01-1831 న లక్ష్మి , ఖండోజి నేవసే పాటిల్ దంపతులకు జన్మించారు.  వాళ్ళ కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉన్నది. బోధన్ ప్రాంతం మున్నూరు కాపులు చట్టాలు.  తన తొమ్మిదో ఏటనే 13 ఏళ్ల జ్యోతిరావు పూలేను 1840లో వివాహమాడారు.  నిరక్షరాస్యులైన ఆమెకు భర్త జ్యోతి బాపూలే మొదటి గురువు.
పండిత వర్గాలలో చాలామందికి సావిత్రిబాయి పూలే కేవలం జ్యోతిరావు బాపులే భార్యగా మాత్రమే తెలుసు.  ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా, పేద ప్రజల విద్యాభివృద్ధికి కృషి చేసిన ఉద్యమకారినిగా  స్త్రీ విముక్తి పోరాట నాయకురాలుగా, కులం -  పితృస్వామ్యం అనే శక్తులపై యుద్ధానికి పూనుకున్న సాహసిగా సావిత్రిబాయి ఒక స్వతంత్ర అస్తిత్వాన్ని నిర్మించుకున్న వ్యక్తి, సామాజిక విప్లవకారిని , సత్యాన్వేషి , క్రాంతి జ్యోతి, ఆధునిక విద్యాప్రదాయిని ,  సంస్కరణల కెరటం, సమధర్మ వేగుచుక్క , అణగారిన కులాల అక్షరమూర్తి , ప్రధమ స్త్రీ వాద సంస్కర్త.  స్త్రీలు అంటే అన్ని కులాల మహిళలు. శూద్రులు అంటే ఉత్పత్తిలో పాల్గొనే కులాల వారనీ , అతిశూద్రులు అంటే కుల వ్యవస్థకు వెలుపల శూద్రుల కన్నా కింది స్థానంలో ఉండే అస్పృశ్యులు అని అర్థం.  ప్రస్తుత కాలంలో శూద్రులను వెనుకబడిన కులాలని ,అతిశూద్రులను దళితులని వ్యవహరిస్తున్నారు.

సావిత్రిబాయి చదువుకోలేదు. జ్యోతి బా ప్రాథమిక విద్య నేర్పారు. ఆయన మిత్రులు సఖారాం యశ్వంత్ , పరాంజపే , కేశవ శ్రీరామ్ , బావల్కర్  ఉన్నత చదువులు చెప్పారు. తర్వాత రెండు ఉపాధ్యాయ శిక్షణలు పొందారు. శిక్షణ తర్వాత విప్లవోద్యమకారిని, జ్యోతిబా మార్గదర్శకురాలు సగునాబాయ్ , ఫాతిమా షేక్ లతో కలిసి ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు.  జ్యోతిబా ఆధ్వర్యంలో కలిసి భిదేవాడలో సొంతబడి ప్రారంభించారు. పూలే దంపతులు పూణేలో మూడు బాలిక పాఠశాలలు స్థాపించారు. బ్రాహ్మణ సాంప్రదాయవాదులు వీరిని అడ్డుకున్నారు.

పూణేలోని బుధవార్ పేటలో తాత్యాసాహెబ్ భిడే   ఇంట్లోనే  మొదటి బాలిక పాఠశాలను 1848 లో పూలే దంపతులు ప్రారంభించారు. 1848 లో పూణేలోని ఒక ఇంట్లో బాలిక పాఠశాల ప్రారంభమైంది .  9 మంది విద్యార్థునిలు అందులో చేరారు.   పాఠశాలకు వెళ్లే దారి పొడుగునా సావిత్రిబాయికి ప్రతిరోజు వేధింపులు ఎదురయ్యేవి.  వీధిలో నడిచి వెళ్తున్న ఆమె మీద జనం  రాళ్ళు , బురద , మట్టి విసిరేవారు. వ్యతిరేకులైన ఛాందస పురుషులు గుంపులుగా నిలబడి ఆమెను అసభ్య పదజాలంతో దూషించేవారు.  ఎన్నో వారాలపాటు ఆమె ఈ వేధింపులకు తట్టుకొని ధైర్యంగా నిలబడింది. బడికి వెళ్ళేటప్పుడు పాత చీర కట్టుకొని వెళ్లి దుమ్ము మురికి పడిన చీరను పాఠశాలలో మార్చుకొని  మళ్లీ ఇంటికి వచ్చేటప్పుడు అదే పాత చీర ధరించి రావచ్చని భర్త సలహా పాటించి బురదను, మట్టిని భరించింది. నా ధర్మాన్ని నేను నెరవేర్చుతున్నాను.   భగవంతుడు మిమ్మల్ని క్షమించి ఆశీర్వదిస్తాడు.   అని సహనంతో పలికేదామే. భర్తతోపాటు విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె తొలి యవ్వనంలోని బాలిక .  ఆ వయసులోనే ఆమె సంప్రదాయవాదులను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి స్త్రీలకు, దళితులకు పాఠశాలలు నడిపింది. ఆధిపత్య కులాల బెదిరింపులకు భయపడిన జ్యోతిరావు పూలే తండ్రి ఈ దంపతులను ఇంటి నుండి వెళ్లగొట్టే నాటికి సావిత్రిబాయి పూలేకు 18 ఏళ్లు ,  జ్యోతిరావుకు 22 ఏళ్లు మాత్రమే.

దేశంలో బహుజనులకు మొదటి పాఠశాలను ప్రారంభించిన నాలుగు సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. అస్పృశ్యుల కోసం పూలే దంపతులు ప్రారంభించిన మొదటి పాఠశాల అహిల్యాశ్రమ్. దళితుల ,  స్త్రీల విద్యావ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే.  ఆమె జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో అనేక దాడులు, అవమానాలు ఎదుర్కోవడమే గాక 1849లో పూలే సావిత్రిబాయి దంపతులు గృహ బహిష్కరానికి గురయ్యారు. ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్త్రీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవా మండల్ పేరున మహిళా సంఘాన్ని స్థాపించింది. 1853 లో మానభంగ బాధితుల పిల్లల కోసం బాలహత్య ప్రతిబంధక గృహాన్ని స్థాపించింది. 1870 లో దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు పూలే దంపతులు చేసిన కృషి సాటిలేనిది. కరువువాత బడిన కుటుంబాల్లోని అనాధ బాలల కోసం వాళ్లు 52  పాఠశాలలను నిర్వహించారు.

1873 సెప్టెంబర్ 24 సత్యశోధక సమాజమనే సామాజిక ఆధ్యాత్మిక సంస్థను జ్యోతిరావు పూలే  ప్రారంభించగా ఈ సంస్థ మహిళా విభాగం సావిత్రిబాయి ఆధ్వర్యంలో నడిచేది. వివాహాల వంటి శుభకార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబర్ 25 న భార్యను కోల్పోయిన ఒక యువకుడికి సావిత్రిబాయి స్నేహితురాలు కూతురితో సత్యశోధక సమాజం ఆధ్వర్యంలో వివాహం జరిపించింది.  బ్రాహ్మణ పురోహితులు లేకుండా ఒక హిందూ వివాహం జరగడం అనేది చరిత్రలో అదే మొదటిసారి. అంతే కాదు ఒక వివాహ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి న్యాయ వ్యవస్థ ముందుకు రావడం అదే మొదటిసారి. అంటే మన దేశంలో భారతీయులైన వధూవరుల మొట్టమొదటి సామాజిక వివాహం ఇదే అన్నమాట. ఈ సంస్థ ద్వారా భర్త పూలేతో కలిసి బాల్యవివాహాలకు, మూఢనమ్మకాలకు,  సతీ సహగమనానికి వ్యతిరేకంగా బలమైన  ఉద్యమాన్ని నడిపి వితంతు పునర్విహాల కోసం కృషి చేసింది. బాల్యంలోనే వైధవ్యాని అనుభవించే ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించింది. గర్భవతులైన వారికి పురుడు పోసి వారి కళ్ళల్లో వెలుగు చూసింది. వితంతు స్త్రీలకు  శిరోముండనాన్ని తీవ్రంగా ఖండించి వాటిని నిరోధించింది.

గర్భవతి నైనానన్న భయంతో బ్రాహ్మణ వితంతువు ఆత్మహత్యకు పాల్పడుతూ ఉండగా పూలే దంపతులు ఆమెను రక్షించి తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. ఆమెకు కలగబోయే బిడ్డను తాము పెంచుతామని భరోసా ఇచ్చారు. ఈ విధంగా ఒక బ్రాహ్మణ వితంతువుకు పుట్టిన పిల్లవాడిని 1874 లో పూలే దంపతులు దత్తపుత్రుడుగా స్వీకరించారు. పూలే దంపతులు పెంచిన ఈ దత్తపుత్రుడు  యశ్వంత్ వాళ్ళ కుమారుడుగానే  పెరిగి పెద్దవాడై డాక్టర్ అయ్యాడు. వితంతువులపై వివక్షకు,  అక్రమ సంతానమైన శిశువుల హత్యలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని చేపట్టింది. వితంతు పునర్వివాహల అవసరాన్ని గురించి చాటి చెప్పడమే గాక ఎంతో ప్రోత్సాహాన్ని అందించింది. అనాధలుగా మారుతున్న శిశువుల కోసం శరణాలయాన్ని స్థాపించింది. దిక్కులేని స్త్రీలకు , పిల్లలకు సావిత్రిబాయి ఇల్లే ఒక పునరావాస కేంద్రంగా మారింది. వితంతువులకు శిరోముండనం చేసే ఆచారానికి సహకరించబోమంటూ క్షురకులు తిరుగుబాటు చేసేటట్టుగా ప్రోత్సహించింది .  ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులన్నింటినీ ఆమె  నిర్వహించింది.  మహారాష్ట్రకు చెందిన మహిళా ఉద్యమ నాయకులు డాక్టర్ ఆనంది భాయ్ గోపాల్ జోషి , పండిత రమాబాయి, తారాబాయి షిండే, రమాబాయి రనడే వంటి ఎంతోమంది సావిత్రిబాయి నుండి స్ఫూర్తి పొందినవారే.

1890 నవంబర్ 28న మహాత్మా ఫూలే మరణించాడు. ఆయన అంత్యక్రియల సమయంలోనూ సావిత్రిబాయి స్థిరచితంతో వ్యవహరించింది.   పూలేకి సోదరుడి వరుసయ్యే ఒక వ్యక్తి ఆయన ఆస్తికి తానే వారసుడినంటు అంత్యక్రియలను నిర్వహించేందుకు ప్రయత్నించగా పూలే దత్త పుత్రుడు యశ్వంత్ అడ్డుకున్నాడు.  ఈ వివాదాన్ని ఆపడానికి సావిత్రిబాయి ముందుకు వచ్చి తానే చితికి నిప్పు పెట్టింది.   భర్త చితికి భార్య నిప్పు పెట్టడం అనేది భారతదేశ చరిత్రలో అతి అరుదైన సంఘటన.

ఆధునిక మరాఠీ సాహిత్యంలో సావిత్రిబాయి కవిత్వం వేగుచుక్కగా నిలుస్తుంది.  ఆమె చేసిన మేధో కృషి మొత్తం కుల వ్యవస్థ, పితృస్వామ్యం అనే రెండు సమస్యల చుట్టూ కేంద్రీకృతమై ఉంది.  ఉన్నత లక్ష్యాలు గల వ్యక్తులు ఇతరులను ఎంత గాఢంగా ప్రభావితం చేయగలరు చెప్పడానికి ఆమె రచనలు సాక్ష్యంగా నిలుస్తాయి.
సావిత్రిబాయి పూలే రచనలు 1.కావ్య పూలే( కవితా సంపుటి)
2.పవన్ కాశి సుబోధ్ రత్నాకర్ ( కవితా సంపుటి) 3.జ్యోతిబా భాషణే (నాలుగు సంపుటాలు సావిత్రిబాయి సంపాదకత్వంలో)
4.సావిత్రిబాయి భాషణే వాగని( సావిత్రిబాయి ఉపన్యాసాలు, పాటల సంపుటి) మొదలైనవి ఉన్నాయి.

పేదలకు సాధికార కల్పన, జాతి నిర్మాణం వంటి పేర్లతో జరుగుతున్న సంపదల సమీకరణ అభివృద్ధి ప్రక్రియలు పేదలను మరింత పరాధీనులుగా మార్చి సమాజం అంచుల్లోకి నెట్టివేస్తున్నాయి. ఆ ప్రజలు ఈనాటికి ఆహారం,  తాగునీరు, ఆరోగ్యం, విద్య వంటి  కనీస అవసరాల కోసం కటకట లాడుతున్న స్థితిలో ఉన్నారు. ఇంతకీ ఈ ప్రజలందరూ నూటికి 90 శాతం మంది ఆదివాసీలు దళితులు, ఓ బీసీలు, ముస్లింలు.  ఇలా వెనుకబడి ఉన్న వర్గాలను అభివృద్ధి పథంలోకి తీసుకోవడంలో సావిత్రిబాయి పూలే  కృషి ఎంతో ఉంది. ఆధునిక భారతదేశంలో మొట్టమొదట కులతత్వ సంస్కృతి,  మతవ్యవస్థలపై యుద్ధం ప్రకటించిన వ్యక్తులు జ్యోతిరావు బాపూలే , ఆయన భార్య శ్రీమతి సావిత్రిబాయి. ఈ దంపతులు మొదటిసారిగా సమగ్రమైన కుల వ్యతిరేక సిద్ధాంతానికి రూపకల్పన చేసి ఆధిపత్య విలువలకు వ్యతిరేకంగా గొప్ప ప్రజా ఉద్యమాలను నిర్మించారు. వారి సామాజిక సాంస్కృతిక దృక్పథంలోని మౌలిక అంశం పీడితులందరినీ ఐక్యం చేయడమే. స్త్రీలు ,శూద్రులు, అతిశూద్రులు అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడం ఈ దంపతుల ఉద్యమ లక్ష్యం.

1890 లో  ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం ఆమె వైద్య శిబిరాలను నిర్వహించింది. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో కూడా రోజుకు 2,000 మంది పిల్లలకు ఆమె భోజన వసతులను సమకూర్చింది.  చివరికి 1897 మార్చి 10న ప్లేగు వ్యాధి సోకిన పిల్లవాడికి (పాండురంగా గైక్వాడ్ కొడుకు) సేవ చేస్తుండగా ఆమెకు కూడా వ్యాధి సోకి మరణించడం అతి విషాదకరమైన సంఘటన. సావిత్రిబాయి పూలే  జ్ఞాపకార్థం 1997లో భారత ప్రభుత్వం తపాలా స్టాంపు విడుదల చేసింది.  2015లో ఈమె జ్ఞాపకార్థం పూణే విశ్వవిద్యాలయానికి Savithribai Phule Pune University పేరు పెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios