Asianet News TeluguAsianet News Telugu

సమాజాన్ని ప్రతిబింబించేదే సాహిత్యం - నగ్నముని

మువ్వా శ్రీనివాసరావు  కవిత్వం పై 366 మంది విమర్శకులు రాసిన వ్యాస సంపుటి "అనితరుడు" నిన్న అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయం సమావేశ మందిరంలో ఆవిష్కరించారు.  ఆ వివరాలు ఇక్కడ చదవండి : 
 

nagnamuni unveils muvva srinivasa rao book ksp
Author
First Published Mar 3, 2024, 8:41 PM IST

జిల్లా రచయితల సంఘం, స్పందన అనంత కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్ర గ్రంథాలయం సమావేశ మందిరంలో నిన్న జరిగిన  మువ్వా శ్రీనివాసరావు కవితాంతరంగ విశ్లేషణల సంపుటి "అనితరుడు" పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ దిగంబర కవి నగ్నముని సమాజాన్ని ప్రతిబింబించేదే ఉత్తమ సాహిత్యం అని అభిప్రాయపడ్డారు. సభకు అధ్యక్షత వహించిన డా.శాంతి నారాయణ కమ్యూనిస్టు పార్టీ  భూమికగా ఎదిగి వచ్చిన మువ్వా శ్రీనివాసరావు ఖమ్మంకు చెందిన అనితరమైన కవి అని కొనియాడారు.

కవిని సమాజమే నిర్మించుకుంటుందని, ప్రపంచాన్ని హృదయంలో ముంచి రంగులద్దిన సృజనాత్మకతే  మువ్వా శ్రీనివాసరావు కవిత్వమని, ప్రేక్షకుల దగ్గరికి సాహిత్యాన్ని తీసుకువెళ్లిన సాహసి మువ్వా శ్రీనివాసరావు అని కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత  బండి నారాయణస్వామి తెలియజేశారు. మానవ అంతస్సంఘర్షణను ఒక అద్దాల సంచిగా మలచిన శ్రీనివాసరావు  కవిత్వం పై 366 మంది విమర్శకులు రాసిన వ్యాస సంపుటి "అనితరుడు" ఒక బృహత్తర వ్యాస సంపుటి అని కర్నూలుకు చెందిన విశిష్ట అతిథి వేణుగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అనితరుడు పుస్తకాన్ని చదవడం అంటే కవి మువ్వా శ్రీనివాస్ ను లోతుగా అధ్యయనం చేసినట్లేనని సత్యసాయి జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జాబిలి జయచంద్ర తెలియజేశారు. 

విశిష్ట అతిథిగా పాల్గొన్న తూముచర్ల రాజారామ్ మాట్లాడుతూ కాలుస్తున్నప్పుడు కాగితం కూడా కాళ్లు, చేతులను కొట్టుకుంటుంది అని రాయగలిగిన విశిష్టమైన కవి అయిన మువ్వా శ్రీనివాసరావు కవిత్వ కాంతకు తొడిగిన ఒక వజ్రపు హారము "అనితరుడు" అన్నారు. తన కవిత్వం మీద వచ్చిన 366 విమర్శ వ్యాసాలను ఒక సంపుటిగా తెచ్చుకున్న మువ్వా శ్రీనివాసరావు నిజంగా అనితరుడైన కవి అని వక్తలు సిద్ధగిరి శ్రీనివాస్, కె. లక్ష్మీనారాయణ కవికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ పుస్తకాన్ని అధ్యయనం చేస్తే యువ కవులకు విజ్ఞానం వికసిస్తుందని ఆత్మీయ అతిథి జి.ర.సం అధ్యక్షుడు జెన్నే ఆనంద్ సూచించారు. నేను రాయాల్సిన వాక్యమే నన్ను వెతుక్కుంటూ వస్తుందని ధీమాగా చెప్పుకున్న మువ్వా శ్రీనివాసరావు బృహత్ వ్యాస సంపుటిని విశ్లేషించడం అంటే సముద్రం ముందు బృందగానం చేసినట్లు ఉంటుందని "అనితరుడు" పుస్తకాన్ని సమీక్షిస్తూ జి.ర.సం ప్రధాన కార్యదర్శి సురేశ్ అభిప్రాయపడ్డారు.

"నేను" అని అర్థం వచ్చేలా అనితరుడు అని నామకరణం చేసిన ఈ సంపుటి వాక్య నిర్మాణం, వ్యాస నిర్మాణం ఎలా ఉండాలో తెలియజేయడంతో పాటూ చక్కని పేరు పెట్టే విధానమును కూడా తెలియజేస్తోందని ఆప్త వాక్యం పలికిన "స్పందన" అనంత కవుల వేదిక ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరశాస్త్రి అభిప్రాయపడ్డారు. డా. బత్తల అశోక్ కుమార్ , డా. ఎ. ఎ నాగేంద్ర , కంబదూరు షేక్ నబీ రసూల్ ఆప్త వాక్యాలను పలుకుతూ రచయిత కృషిని, అతని కవిత్వ విశిష్టతను కొనియాడారు.

తన పుస్తకాన్ని విశిష్టమైన సాహితీవేత్తలు ఉన్న అనంతపురంలో ఆవిష్కరించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని "అనితరుడు" వ్యాస సంపుటి ముద్రించుకున్న కవి మువ్వా శ్రీనివాసరావు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సభలో సాహితీవేత్తలు జెట్టి జైరాం, ఉప్పరపాటి వెంకటేశులు, గోవిందరాజులు, గుడిపల్లి విద్యావతి, గోసల నారాయణస్వామి, వన్నప్ప,చెగువేర హరి, వలస రమేష్, శీర్పి చంద్రశేఖర్ పలువురు యువ కవులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios