Asianet News TeluguAsianet News Telugu

కాలిక స్పృహ కలిగిన కవి డా. ఉదారి నారాయణ

అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్ర స్థాయి సాహిత్య పురస్కారం-2022 ను అస్తిత్వవాద కవి, డాక్టర్ ఉదారి నారాయణ స్వీకరిస్తున్న శుభ సందర్భంగా  కూకట్ల తిరుపతి రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.

Kukatla tirupati on Alisetty Prabhakar award winner Udari narayana
Author
Karimnagar, First Published Jan 12, 2022, 1:47 PM IST

దక్షిణ కాశ్మీరంగా ఖ్యాతిగాంచిన  దట్టమైన అడవుల పచ్చపచ్చని సోయగాల చెలికాడు.  అడవి బిడ్డలను నిద్ర లేపడానికి, నిద్రలేని పంక్తులను సృష్టిస్తున్న సృజనకారుడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి తెలుగు సాహిత్యంలో పి.హెచ్.డి. పట్టా పొందిన మొట్ట మొదటి పరిశోధకుడు. బలమైన అభివ్యక్తితో కవిత్వం రాస్తున్న గొప్ప భావుకుడు.  దేవరాజు మహారాజు, తెలిదేవర భానుమూర్తి, టి. కృష్ణమూర్తి యాదవ్ ల సాహితీ వారసుడు. తెలంగాణ పల్లెల్లోని ఆర్తిని, ఆర్ద్రతను స్పృశించిన ఆత్మీయుడు. మైదాన ప్రాంత, గిరిజన సంస్కృతులకు వెలుగులు పంచే వన్నెకాడు. కొమరం భీమ్, రాంజీగోండుల పోరు వారసుడు. ఆదివాసీల తుడుం మోతల మేలుకొలుపు రాగమతడు. గలగలపారే ఉపన్యాస ఝరీ గీతమతడు. కొండకోనల హొయల రాగమతడు. జలజలపారే కవితా జలపాతహోరతడు. దగా పడ్డ కోట్లాది గొంతుకల ఆర్తనాదం. ఆదివాసీల ఆత్మ గౌరవ పతాకం. తెలంగాణ మట్టి పొరల్లోంచి వచ్చే నిశ్వాస బాసకు సాహిత్య దశను కల్పించిన మట్టికవి డా. ఉదారి నారాయణ.

"ఆదిలాబాద్ మిత్రులంటే/అరుదైన ఆనందం నాకు/కుంటాల జలపాతమున్నందుకే కాదు/అది కంటతడిని ప్రతిబింబిస్తున్నందుకు/అక్కడి కవులు/ఆకులు దూసినంత సహజంగా/కవిత్వం రాస్తారు/ఉదారి నారాయణ/అక్షరాల్లో ఆకుపచ్చని అడవిని నడుపుతాడు/ఆదిలాబాద్ వెళ్లి వచ్చినప్పుడల్లా/నాకు అంతరంగంలోకి/వెళ్లి వచ్చినట్లుగా ఉంటుంది". అంటారు ఆచార్య ఎన్. గోపి.  ఈ వాక్యాలు సమాజోపకారి ఉదారి ఉదార స్వభావాన్ని తెలుపుతాయి. ఆదిలాబాద్ అడవి అందాలను కళ్ళముందుంచుతాయి. అడవి కూనల ఆత్మీయతానురాగాలను పలుకుతాయి. ఆకుపచ్చదనం, పచ్చితనం ఉట్టిపడే మూలవాసుల సోపతి గొప్పతనాన్ని ఆరబోస్తాయి.

2001లో డా. ఉదారి నారాయణ "ఆకుపచ్చని ఎడారి" కవితాసంపుటాన్ని 27కవితలతో ముద్రించారు. రచయిత తన అమ్మ భూదేవికి ఈ గ్రంథాన్ని అంకితం చేశారు. దీనిలో 17చిమ్నీలు కూడా వెలిగించారు. "కాకి ఇల్లు మీద వాలింది/ పొయ్యికి దిగులు జ్వరం".  ఇలా అన్నీ ఆలోచింపజేసేలా, హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. రెండు పంక్తుల చిమ్నీలు మెరుపుల్లాంటి చరుపులను కలిగి ఆచార్య ఎన్. గోపి నానీలను గుర్తుకుతెస్తాయి.

"మరణిస్తూ చేసిన/నీ చిరునవ్వు వీడ్కోలు/జనం భరించడం కష్టమవుతున్నది" లాంటి కవితా పాదాలు పాఠకుని మదిని తొలిచివేస్తాయి. కవి ఆకాంక్షను వెల్లడి చేస్తాయి. ఈ వయ్యికి ప్రజాకవి కాళోజి నారాయణరావు అందించిన ముందుమాటలో  "తెలంగాణ యాసలో, అందులో ఆదిలాబాద్ జిల్లా పదాలతో కూడుకున్న గేయాలు ఎంతో సజీవంగా ఉన్నాయి. తెలంగాణ వారికి తెలియని యాసలో, బాసలో అస్పష్టంగా క్లిష్టంగా రచనలు చేస్తున్న రచయితలకు ఈ పొత్తం కనువిప్పుగా ఉంటుందని ఆశిస్తున్నాను". అని పుస్తక ఔన్నత్యాన్ని చెప్పారు.  కఠినంగా జటిలంగా రాసిన కవిత్వం పఠితులను చేరుకోదు. దాని లక్ష్యం నరవేరదు. అందరికీ అర్థమయ్యే రీతిలో కవనం చేయాల్సిన అవసరాన్ని కవులు గుర్తెరుగాలి.  ఆకుపచ్చని ఏడారి సంపుటిలో పల్లెటూరు, బాల్యం, రైతుల ఆత్మహత్యలు, గిరిజనుల వెతలు, దళిత సామాజిక చైతన్యం మొదలైన అంశాలతో రాసిన కవితలతో పాటు తెలంగాణ భాష గొప్పను విప్పి చెప్పుతూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిన కవితలున్నాయి.

బుక్ టైటిలైన "ఆకుపచ్చని ఎడారి" శీర్షికతో రాసిన కవితలో... "ఇక్కడో గూడెముండాలి/ఏవీ చూరుకింద చుట్టల వెలుగులూ?/ఇక్కడో జీవకళ పచ్చగా మెరిసేది/ఏవీ అలికిడి ఆనవాలు?/గుర్తుపట్టడానికి ఎప్పుడైనా/ఒక్క విషాద చుక్కను రాల్చామా!/దేవులాడడానికి ఎన్నడైనా/కళ్ళ రంజాన్లు/కరిగి కాలువలయ్యాయా!/నవ్వుతూ, నడకలోనే నర్తిస్తూ/తూనీగల్లా తేలియాడే రేలరేలలు/నిద్రలోనే గాలిలేని బెలూన్లవ్వడం/చూపుల సంచులు విప్పకుండానే/ఛాతి బాదుకోవడం తప్పంటామా!/కొన్ని జీవితాలు/వడ్డన నిండిన విస్తర్లు కావచ్చు/కొన్ని జీవితాలు/పురుగులు మేసిన పుండు కావచ్చు/కానీ.../ఆకుపచ్చని ఎడారిని/ బహుశా.../ఏ కళ్ళ కెమెరాలు పీల్చక పోవచ్చు/మనిషి మీద/నాగరికం మీద/ఎదురుచూపులు పరిచినపుడల్లా/ ఎడారి శవంమీది అగరొత్తవుతున్నది/అడవి మీద/భూమి మీద/పరుచుకున్న/భరోసా కాగితాలు/ఒక్క లిప్తపాటులోనే ఛిద్రమవ్వడమా!/పాలునీళ్లతో/ఒళ్ళు కడుక్కుంటున్న/నూనె మోటార్లను/ఏ నీటి సూర్యుడూ ఆపడం లేదు/బేషరంగా/దునియ మీద వలేసిన చేతుల్ని/ఏ మలేరియా క్రిమి కాటేయ్యడం లేదు/అతిసార ఎవరి సారాన్ని పీల్చడం లేదు/ఎడారి ఇప్పుడు/నిశ్శబ్దంగా నిద్రపోతున్నది/శవాల కుప్పల పక్కన/సేద దీర్చుకుంటున్నది/రాలిపోగా/మిగిలిన కలల్ని/కన్నీటి మూటలో దాచుకున్నది/భూమ్యాకాశాలు తప్ప/ఎడారికి/అభయ హృదయమేది లేదు/కారణాలడగొద్దు/కంటి చూపు కాంతిపుంజం కావద్దు/ఏడ్చి ఏడ్చి/నెర్రెలు బారిన ముఖానికింత/చిరునవ్వు అతికించుకుని/నిర్మల చిత్తుడిలా ఉండి పోవాలి/కనురెప్పల తలపుల్నీ/దోసిట్లోని భవిష్యత్తునీ/పిడికిట్లోని పట్టుదలనీ/ సుందర స్వప్నాలనీ గుండెల్నీ/చంకలో కేరింతలు కొడ్తున్న/నెలవంకల్నీ/కళ్ళముందే తన్నుకొని పోయినా/నొసటికింత/ సుజలాం, సుఫలాం, గంధాన్ని అద్దుకుంటూ/ఎడారి నిద్రపోతున్నది/ఒక మహాస్వప్నం కోసం/పెనుగులాడుతూ/ఎడారి నిద్రపోతున్నది". అంటూ ఆకుపచ్చని ఎడారి జీవితాన్ని ఆవిష్కరించారు. అంతులేని బాధను, ఆశ్రోశాన్ని,  ఆక్రందనను గర్భీకరించుకున్న కవిత ఇది. మానవార్తి నులివెచ్చగా తగిలే వాక్యాలివి. కళ్ళ రంజన్లు కరిగి కాలువలవడం. చూపుల సంచులు విప్పకుండానే ఛాతి బాదుకోవడం. ఆదిలాబాద్ జిల్లాలో వందలాది మంది గిరిజనులు అతిసారా, మలేరియాలకు బలైపోయినపుడు ఉదారి నారాయణ చలించి రాసిన కవిత ఇది. దీంతో పాలకుల పట్టింపులేనితనాన్ని అర్థం చేసుకోవచ్చు. తరతరాలుగా అంటురోగాల బారినపడుతున్న తండాల దీనత్వాన్ని చూపించారు. వారి బతుకులను బాగుపరిచే నాథుడు ఇంత వరకు కానరాకపోవడం విషాదకరం.

"ఇక్కడి మూలవాసుల్లో వర్గభేదం, లింగ అసమానతలు, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు లేవు, విధవా వివాహాన్ని నిరోధించని ఒక ఆదర్శ సమాజం చక్కగా నిలిచి ఉన్నది... ఇటువంటి స్థితిలో మిగతా భారతీయ గ్రామీణ సమాజంలో ఇంకా కొనసాగుతున్న సామాజిక రుగ్మతలేవీ మూలవాసులకు వ్యాపించకుండా రక్షించటం దేశంలోని ప్రగతివాదుల గురుతరమైన బాధ్యత" అని బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త, ఆదివాసీల ఆశాజ్యోతి క్రిస్టోఫ్ వాన్ ఫ్యూరర్ హైమండార్ఫ్ విధాన నిర్ణేతలకు, సామాజిక కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఇంత వరకు ఆదివాసీలకు అనువైన విద్య, సాగుభూమి భద్రత, స్థిరమైన నివాసం, మౌలిక వసతుల కల్పన, జీవనగతులపై సానుకూలతలను కల్పించలేకపోవడం విడ్డూరం. ఇంకా ఎడతెగని చొరబాట్లు, అన్యాక్రాంతమైన అటవీ భూములు, ఆంక్షలు, దోపిడీ, హేళన కొనసాగుతుండడం, అటవీ ఖనిజ సంపదను కొల్లగొడుతుండడం అమానవీయం. ఈ పీడనలన్ని ఏనాడు తొలగేనో? అడవిలో ప్రశాంతత ఇంకెప్పుడు కలిగేనో ఎదురు చూడాల్సిందే.

యక్షగానాలు, వీధి నాటకాలు, మొదలైన జానపద కళారూపాలు ఏనాడో కనుమరుగైపోయాయి. గత కొన్ని దశాబ్దాలుగా రేడియో నాటికలే ఆ లోటును పూడ్చుతున్నాయి. డా. ఉదారి నారాయణ "పెండ్లి సంబరాలు, హాస్టల్ చదువులు, మహిళలు-అత్యాచారాలు, చేనేత పరిశ్రమ, తీర్థయాత్రలు, రైతు జీవితంలో పశువుల పాత్ర, బొడ్డెమ్మ పండుగు, మొహమాటం, పొలాల పండుగు, పత్తి రైతుల అవస్థలు, ప్రియ భాషణం మొదలైన 11 లఘు నాటికలను "అరుగు మీది ముచ్చట్లు" పేరుతో పుస్తకంగా కూర్చినారు. ఈ నాటికలలో బాబాయి, వెంకన్న, లతమ్మ అనే ముచ్చెటగా మూడు పాత్రలుంటాయి. బాబాయి చదువుకున్న పెద్దమనిషి, లోకం పోకడ తెలిసినవాడు. వెంకన్న, లతమ్మల మధ్య సమన్వయకర్తగా ఉంటాడు. లతమ్మ పల్లె తనానికి ప్రతీక. సంసారాన్ని చక్కదిద్దుకోవడంలో దిట్ట. ప్రేమ, దయ, సహకార భావాలు గల ఉత్తమ ఇల్లాలు. వెంకన్న వట్టి అమాయకుడు. తెలిసీ తెలియని తనంతో మాట్లాడుతాడు. ఈ నాటికల ద్వారా రచయిత ఉదారి నారాయణ వినోదంతోపాటు గొప్ప విజ్ఞానాన్ని అందించారు. ఆదిలాబాద్ ఆకాశవాణి శ్రోతలను ఈ నాటికలు ఎంతగానో అలరించాయి. హాస్యంతో ఉర్రూతలూగించాయి. పల్లీయులకు కనువిప్పును కలిగించాయి. నేటి సమాజానికి నాటికల అవసరాన్ని తెలియజేశాయి. స్థానీయత ఉట్టిపడేటట్టు రచనలు చేసిన ఉదారి నారాయణ అభినందనీయులు.

"జాడ చెదిరిన ఊరు/దేహం నిండా పులిపిర్లు మొలచిన ఊరు/భూంబట్టుకుని లేస్తున్న ఊరు/ఊతం లేని ముసలవ్వ తీరు నడుస్తున్న ఊరు/ముసురుకున్న కందిరీగల కాటుకు గురవుతున్న ఊరు/ఊపిరి గొట్టాలు సైతం ఉరికొయ్యలను ఏడిపిస్తున్న ఊరు/పీడకలల్తో ఉలిక్కిపడి లేచి కూర్చుంటున్న ఊరు"... ఇట్లా శిథిలమవుతున్న ఊరును మనకు దర్శింపచేస్తాడు కవి. ఊరు మారుతున్నది. ప్రపంచీకరణ పడగనీడలో కునారిల్లుతున్నది పల్లె. ఊరు ఎలా మారుతున్నదో! మార్పు ఎందుకు సంభవిస్తున్నదో! కవి సునిశిత పరిశీలనకు, కవితా రచన ప్రతిభకూ, కవిత్వ పటిమకు ఈ కవిత అద్దం పడుతుంది. దినదినం వల్లకాడులా మారుతున్న పల్లెల దైన్యాన్ని తెలుపుతుంది. "ఇపుడు తెలంగాణా/పరుగు పందేనికి సన్నద్ధమైన/వీరుని చూపులా ఉంది/వదలడానికి గుంజిపట్టిన/బాణంలా ఉంది/నదులు, వాగులు, చెరువులు/లోలోనే ఉద్యమాన్ని/ రిహార్సల్స్ చేస్తున్నాయి/కొండలు అడవులు సిగలు ముడిచి/విజయాన్ని కడసారి బేరీజు వేస్తున్నాయి/ఇపుడు కాలం/ చివరి గీత దగ్గరే ఆగి ఉంది/ఇపుడు చివరి నిమిషం/చివరి మాట కోసం ఎదురు చూస్తున్నది". డిసెంబరు 9న తెలంగాణను ఇచ్చినట్టే ఇచ్చి, మల్లా డిసెంబరు 31ననే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నపుడు కవి కలత చెంది రాసిన కవిత ఇది. నరంలేని నాలుక ఎన్నైనా మాట్లాడుతది అన్నట్లు నాయకుల రెండు నాల్కల ధోరణిని తేటతెల్లం చేసిన రచన ఇది. అలాగే తెలంగాణ ఏర్పాటు అవసరాన్ని తెగేసి చెప్పింది. తెగించి కొట్లాడాల్సిన ఆవశ్యకతను అక్షరీకరించింది. ఆరుపదుల సహజీవనంలో ఎంతకీ ఎండని గాయాలే మిగిలాయని ఉదారి వాపోతారు.

ఈ "యాల్లైంది" పుస్తకంలో మొత్తం 46 కవితా ఖండికలున్నాయి. ఇందులో పది వరకు యాది కైతలున్నాయి. కాళోజీ, బాలగోపాల్, సద్దాం హుస్సేన్, పాగల్ ఆదిలాబాదీ, గజానన్, విద్యార్థి చావు, గిరిజనుల మరణాలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు మొదలైన విషాద సంఘటనలను, విపత్కర సన్నివేశాలను కవి అశ్రుబిందువులను సిరాచుక్కలుగా మలుకొని లిఖించాడు. "మీరు వోతే ఇంటి ఆడదానికి ఎనగర్ర ఇరిగినట్టయితది/మొగులు మీద పడ్డట్టయితది/ఇల్లు జాగిడిసిన అంగడైతది/గువ్విడిసిన గూడైతది/మీరెందుకు సావాలి/సావును చెండు తీరు ఎగిరెయ్యాలి/బతుకు బండిని మెడ మీద కాయలు గాసేట్టు గుంజుకు పోవాలి/కాలంతో లడాయి జేసి గెలవాలి". చచ్చేదాక పోరాడాలి. గెలువక పోయినా ఫరవా లేదు. పోరాడానన్న ఆత్మవిశ్వాసం మిగులుతుంది. కానీ చావు సమస్యకు పరిష్కారం కాదంటాడు ఉదారి. "పోరాడితే పోయేదేం లేదు. బానిస సంకెళ్ళు తప్ప" అన్న శ్రీశ్రీ మాటలను గుర్తుకు తెచ్చారు. ఇలా యాల్లైంది పుస్తకంలోని ప్రతి కవితా ఆణిముత్యమే. అస్తిత్వ గుబాళింపును కలిగిందే. పాఠకున్ని ఆద్యంతం చదివించేదే.

"ఒక ఫలం రుచి తెలుసుకోవాలంటే, ఆ ఫలాన్ని తినాలి. అలాగే విప్లవ సిద్ధాంతాన్ని, దాని క్రమాన్ని, అనుగతాన్ని, పద్ధతులను తెలుసుకోవాలంటే, దానిలో భాగస్వామి కావాలి. సరైన జ్ఞానం ప్రత్యక్ష కార్యాచరణతోనే లభ్యమౌతుంది". అని మావో జెడాంగ్ సెలవిచ్చారు. అలానే తెలంగాణ ఉద్యమంలో ఉదారి నారాయణ చైతన్యవంతమైన పాత్రను పోషించారు. ఉద్యమ సందర్భంలో జరిగిన ప్రతి సంఘటనకూ కవిగా కదిలిపోయారు. తెలంగాణ రచయితల వేదికలో క్రియా శీలకంగా వ్యవహరించారు. రాష్ట్రం రాగానే సొంతిల్లు కవిత రాశారు. "గంగా తల్లిపాల ధారని/తనివి తీరా చప్పరిస్తాను/ఈ రోజు మంచి రోజే కాదు/ముంచినోడి చేతి నుంచి/పగ్గాలు అందిన రోజు/ముగ్గుల ముంగిళ్లు/ముసిముసిగా నవ్విన రోజు/ఆ ముగ్గుల బుగ్గల మీద/లంగా ఓణీల చిలుకలు ఎగిరిన రోజు/అమరులారా!వీరులారా!ఈ నేలతల్లి దుఃఖ విముక్తి కోసం/ పోయిన ప్రాణాలు ఇంటింటా/వెలుగులీనుతున్నాయి/నోరెండిన పైరుకు తల్లుల శోకం/పచ్చదనాన్ని అద్దుతున్నది". తెలంగాణ ప్రజల కల సాకారమైన సందర్భం. ఎన్నో బలిదానాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుంది. ఆ ఆనంద ఘడియలను ఇలా అక్షరాల్లోకి ఒంపాడు. ఈ ప్రత్యేక ఫలాలు అన్ని వర్గాల ప్రజలకు అందేదాకా కవులు రచయితలు పోరాడాలన్నారు ఆచార్య కొత్తపల్లి జయశంకర్.

తెలంగాణ కవులు కలం కవాతు చెయ్యడానికి సిద్ధంగానే ఉంటారు. "అయ్యలారా! మన సిద్ధార్థుల మీద/సత్యకామా జాబాలి, అరుంధతి వారసుల మీద/నామాల నజరు పడకుండా/ కోరల నీడలు సోకకుండా/పదిలంగా దాచుకోండ్రి-పాణంగా సూసుకోండ్రి/ఆటలో మునిగినపుడు/ఆదమరిచి నిదురించేటపుడు/ఒక కన్నేసి ఉంచుండ్రి" అని మాగిపొద్దు సంపుటిలోని పులి సంచారం కవితలో గోముఖ వ్యాగ్రం వంటి హైందవం గురించి హెచ్చరిక జారీ చేశారు. ప్రశ్నించే గొంతులను ఉత్తరించే దుర్మార్గాలను ఖండించారు. నాల్గు పడగల హైందవ నాగరాజు కోరలను ఊడదీయాలన్న కాంక్షను వెలిబుచ్చారు. మను ధర్మశాలలో..."శంభూకుడు, ఏకలవ్యుడు/నీ తాత ముత్తాతలు/నాలుగు పడగల కోరలకు/నేలకొరిగిన వాళ్లే/తోడేలు చుట్టుముట్టినపుడు/ కడసారి అరుపులే తప్ప/భరోసా బతుకులెక్కడ". ఇందులో దారుణాలకు కారణమైన హైందవ వ్యవస్థ మీద ఆగ్రహం కనబడుతుంది. అగ్ర కులోన్మాదానికి రోహిత్ వేముల లాంటి మేథావులైన విద్యార్థులు బలైపోతున్నారు. మతం పేరిట మనుషుల్ని విభజించి పాలించే విధానాలు అంతమవ్వాలని కవి ఆశించారు. మనిషి సృష్టించుకున్న మతమే మనిషిని బుగ్గిజేయడం శోచనీయం.

మాగిపొద్దులో 46కవితలను వాసీలో రాశిగా పోశారు. వీటిలో ఇతివృత్త వైవిధ్యం, అభివ్యక్తిలో భిన్నత్వముంది. కవి అస్తిత్వ ఆకాంక్ష, జీవితంలోని ఆటుపోట్లు, అలజడులను బలమైన కవిత్వంగా తీర్చిదిద్దారు. భావనాబలంతో, బలమైన అభివ్యక్తితో రాశారు. మనిషి మనిషిగా మిగలడమే మానవజన్మకు సార్థకత. మంచి కోసం నిలబడడం, మనిషి కోసం కలబడడం ఈయన కవిత్వంలో కనిపిస్తుంది. ఈ కవిత్వం ఉదారి నారాయణ రచనా పరిణతికి, పరిపక్వతకు గీటురాయిగా నిలుస్తుంది.

"తవ్వితే కన్నీళ్ళు/దున్నితే తూటాలు/అమరుల నినాదాలు/ఇదే! తెలంగాణ" అంటాడు ఉదారి. "కండ్లలో జాలి/కడుపులో ఖాళీ/ఎవరండీ వీళ్లు/ఆదిలాబాదీయులు" అని అడవి బిడ్డల ఆకలి బాధను అక్షరాశ్రువులతో చిత్రించిన ఉపకారి.  "నా నేల/వేడెక్కుతోంది/సూర్యుడితో కొంత/ఉద్యమాలతో అంతా" అంటూ పోరాటాల గడ్డ ప్రత్యేకతను తెలిపారు. నారాయణ నానీల్లో స్థానీయత, సామాజికత, మానవీయత, కళాత్మకత ద్యోతకమవుతాయి. చురుకైన వ్యంగ్యం, సుకుమారమైన చమత్కారంతో పాఠకులను ఆకట్టుకుంటాయి. ఖలీల్ జిబ్రాన్ ప్రకారం "వ్యాఖ్యానమును అపేక్షించే రచన సృజన కాదు". రచనలోని విషయం ఎంత సుళువుగా ఉంటే, వినేవారికి, చదివేవారికి అంత సుళువుగా అర్థమవుతుంది. అపుడు రచయిత కృషి అంతకంతకూ సార్థకమౌతుంది. అలా పాఠకులకు, శ్రోతలకు అర్థమయ్యేలా సూటిగా, స్పష్టంగా, ఆకర్షణీయంగా రాసిన ఉదారి నారాయణ నానీల కవిత్వం సార్థకమైందని భావిస్తున్నాను. నాలుగు వందల నానీల సంపుటాలకు ఆదిలాబాద్ నానీలు నిండుతనాన్ని తెచ్చాయనడంలో సందేహం లేదు. నానీల నాయన ఆచార్య గోపి మెప్పును పొందడం హర్షదాయకం.

ఈతి బాధలను ఇంపైన వినసొంపైన తత్త్వాలుగా మలచిన ఉదారి నాగదాసు తత్త్వసాహిత్యంలో చిరస్మరణీయుడు. కులమతాలను, విగ్రహారాధనను నిరసించిన ఆదర్శప్రాయుడు. జీవుడే దేవుడు. ఆత్మనే పరమాత్మ. నిరాడంబరమే నిజమైన జీవన మార్గమని ప్రబోధించాడు. జనన మరణాలపై జనంలో నెలకొన్న భయాన్ని పోగొట్టి, స్వచ్ఛమైన జీవితం గడపడానికి తోడ్పడ్డాడు. సామాజిక సమస్యలను నిరసించడం. ప్రశ్నించడం, ఎదిరించడం వీరి తత్త్వం. 1962లో ఈయన రాసిన " శ్రీ శివరామ దీక్షితాచల గురు భజన తత్త్వ కీర్తనలు"  మరాఠీ, హిందీ భాషలలో పుస్తకాలుగా వచ్చాయి. దీనినే 1974లో తెలుగులో ముద్రించారు. ఈ వరకవి వారసత్వం నుంచి వచ్చిన వారే ఉదారి నారాయణ. తన తండ్రి సామాజిక చింతనను, సాహిత్య వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న  డాక్టర్ ఉదారి నారాయణ ఆదిలాబాద్ జిల్లా, తాంసి మండలంలోని బండల నాగాపురంలో ఫిబ్రవరి 3, 1964న జన్మించారు. తల్లిదండ్రులు ఉదారి భూదేవి, నాగదాసు. ఈయన ప్రాథమిక విద్య నుండి డిగ్రీ వరకు ఆదిలాబాద్ జిల్లాలోనే చదివారు. 1987-89లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు చదివారు. 1990లో తెలుగు పండిత శిక్షణను పొందారు. 1991లో "కె. శివారెడ్డి ఆసుపత్రి గీతం వస్తువు-సన్నిధానం" అనే అంశంపై ఎం.ఫిల్. పూర్తి చేశారు. 2001లో "ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత స్పృహ" అనే అంశంపై పరిశోధించి పి.హెచ్.డి. పట్టాను అందుకున్నారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలలో తెలుగు పండితులుగా ఉద్యోగిస్తున్నారు. 2001లో ఆకుపచ్చని ఎడారి, 2011లో యాల్లైంది, 2017 లో మాగిపొద్దు కవితా సంపుటాలను వెలువరించారు. 2018లో అరుగు మీది ముచ్చట్లు లఘు నాటికలను సంపుటీకరించారు. 2019లో తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో ఆదిలాబాద్ జిల్లా సాహిత్య చరిత్రను అచ్చేసారు. 2020లో ఆదిలాబాద్ నానీలు వెలువరించారు. 2012లో ఆదిలాబాద్ జిల్లా కవుల తెలంగాణ ఉద్యమ కవితలు, పాటలతో కూడుకున్న "ఎల్గడి" సంకలనానికి సంపాదకత్వం వహించారు.  ప్రజాశక్తి, సాక్షి దినపత్రికలలో "మా ఊరి ముచ్చట్లు" శీర్షికన తెలంగాణ భాషలో హాస్య, వ్యంగ్యాత్మక కథనాలు రాశారు. పలు పత్రికల్లో సాహితీ వ్యాసాలు, సమీక్షలు ప్రచురితమైనాయి.

"లోగిలి" తెలంగాణ భాష ముచ్చట్లు పేరుతో వందలాది రేడియో నాటికలు ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైనాయి. ఆదిలాబాద్ సాహితీ మిత్రమండలి కార్యదర్శిగా, దరకమే (దళిత కవులు రచయితలు కళాకారులు మేథావుల ఐక్యవేదిక) జిల్లా కార్యదర్శిగా, ఆవిర్భావం నుండి తెలంగాణ రచయితల వేదికలో కొనసాగుతున్నారు. 2000 సంవత్సరంలో తన తండ్రిగారైన ప్రముఖ తత్త్వకవి ఉదారి నాగదాసు పేరున స్మారక సాహితీ సంస్థను నెలకొల్పి, పల్లెల్లో కవిత్వ ప్రచారం, తత్త్వగీతాలు ఆలపించడం, ఉపన్యాసాలు ఇప్పించడం లాంటి అనేక రకాల సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈయన సాహితీ సేవకు గుర్తింపుగా తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ ఉత్తమ సాహితీ పురస్కారం, సోమ సీతారాములు సాహిత్య పురస్కారం, కలహంస సాహిత్య పురస్కారం, రామదాసి మహారాజ్ సాహిత్య పురస్కారాలను అందుకున్నారు. నవ తెలంగాణ దినపత్రిక, పాలపిట్ట మాసపత్రిక, నేటి నిజం మొదలైన పత్రికలు నిర్వహించిన కవితా పోటీలలో పలుమార్లు బహుమతులను గెలుచుకున్నారు. ఇప్పుడు అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ రాష్ట్రస్థాయి సాహిత్య పురస్కారం-2022ను అందుకుంటున్నారు. ఈ సందర్భంగా మట్టికవి డాక్టర్ ఉదారి నారాయణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు.

" ఒక పెద్ద దేశం. చిన్న దేశాన్ని అణచివేయాలని చూస్తే, నేను ఆ చిన్న దేశం వైపు నిలబడతాను. ఆ చిన్న దేశంలోని మెజారిటీ మతం, చిన్న మతాన్ని అణగద్రొక్కాలని చూస్తే, నేను చిన్న మతం వైపు నిలబడతాను. ఆ మైనారిటీ మతంలో కులాలుండీ, అందులో ఒక కులం, మరో కులాన్ని అణగద్రొక్కాలని చూస్తే, నేను అణచివేతకు గురయ్యే కులం వైపు నిలబడతాను. ఆ అణచివేతకు గురైన కులంలో, ఒక యజమాని తన నౌకరుని అణచివేస్తుంటే, నేను ఆ నౌకరి వైపు నిలబడతాను. ఆ నౌకరు తన ఇంట్లో తన భార్య హక్కుల్నీ కాలరాస్తుంటే, నేను ఆ నౌకరి భార్య వైపు నిలబడి, గొంతెత్తుతాను. చివరికి నేను చెప్పేదేమిటంటే, అణచివేత అనేది ఏ స్థాయిలో, ఏ స్థితిలో ఉన్నా అది నా శత్రువు" అని పెరియార్ ఈరోడ్ వేంకట రామస్వామి నాయకర్ చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. ఇలాగే డా. ఉదారి నారాయణ కూడా పీడితజన పక్షం వహిస్తున్నారు. సహజ వనరుల దోపిడీని నిరసిస్తున్నారు. ఆధిపత్యాలను, అణచివేతలను ధిక్కరిస్తున్నారు. సంఘ సంస్కరణ కొరకు సామాజిక పరివర్తన కొరకు కవిగా, రచయితగా పాటుపడుతున్నారు.  ప్రజాస్వామిక విలువలను పరిఢవిల్లజేయడానికే రచయితగా కృషి సల్పుతున్నారు. కవిగా, రచయితగా, పరిశోధకుడిగా, విమర్శకుడిగా, ఉపాధ్యాయుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా, సాహితీ సంస్థల నిర్వాహకుడిగా ఉదారి నారాయణ కృషి బహుముఖీనమైనది. మిత్రుడిగా, ఆప్తుడిగా, మనిషిగా ఉదారి స్థానం ఉన్నతమైనది. మహోన్నతమైనదిగా భావిస్తున్నాను. సెలవిప్పటికీ, స్నేహమెప్నటికీ...

(జనవరి12 అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్థంతి)

Follow Us:
Download App:
  • android
  • ios