Asianet News TeluguAsianet News Telugu

కందుకూరి శ్రీరాములు కవిత : పౌర్ణమి చంద్రుడు

కందుకూరి శ్రీరాములు కవిత : పౌర్ణమి చంద్రుడు కవితను ఇక్కడ చదవండి
 

kandukuri sriramulu powrnami chandruddu poem lns
Author
First Published Feb 24, 2024, 3:26 PM IST

ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కుతుంటే విణాతంత్రులై మీటుతున్నట్లు - అంటూ కందుకూరి శ్రీరాములు రాసిన కవిత ' పౌర్ణమి చంద్రుడు ' ఇక్కడ చదవండి : 
          

ఉస్మానియా !
నీలో ఎన్ని వేల నెలవంకలు రూపుదిద్దుకొని 
వెన్నెలలు విరజిమ్మే నిండు పున్నమలయ్యాయో ? 

ఉస్మానియా !
నీలో ఎన్ని వేల గాలి తరంగాలు హోరెత్తి 
కుళ్ళును పారదోలే తుఫానులయ్యాయో ! 

ఉస్మానియా !
నువ్వో ప్రేమ జలపాతానివి వందయేళ్లలో 
ఎన్ని వేల శిలలు నీలో తడిసి శిల్పాలయ్యాయో ! 

కదిలిపోయే పూల తోటలున్నట్టు -
ప్రేమ యుద్ధాలకు సైనిక గుడారాలున్నట్టు -

ఏ చెట్టు కిందనో 
పచ్చిక గడ్డిమీదనో 
కాలేజీ మెట్టు మీదనో 
రాతి గద్దె మీదనో 
సేద తీర్చుకుంటూ వాళ్లు 

ఆర్ట్స్ కాలేజ్ - ఒక కళ 
ఒక కల 
ఒక ఉత్సాహం 
ఒక ఉద్వేగం 

క్యాంపస్ రోడ్లమీద నడిచినప్పుడు తబలాలై మోగినట్లు -
ఆర్ట్స్ కాలేజ్ మెట్లెక్కుతుంటే 
విణాతంత్రులై మీటుతున్నట్లు -
లైబ్రరీలో మౌనంగా కూర్చుంటే
కొండల మధ్య 
తపస్సు చేస్తున్నట్లు -
క్లాసులో పాఠాలు వింటుంటే
గీతోపదేశం బోధపడుతున్నట్లు -

ఋషులు వేదాలన్నీ పునాదిలో దాచిపెట్టినట్టు 
ఉస్మానియా....ఉస్మానియా...
ఎన్నో దిక్కుల నుండి 
అక్షరాల పూలు దండలుదండలుగా
వచ్చిన విద్యార్థులు మేధావులైనట్టు

ఉస్మానియా.....ఉస్మానియా.... 
కవుల కల్పనా జగత్తులో 
వెలుగుల జ్ఞానుల నెలవంకలునిండు కొలువుదీరినట్లు

ఉస్మానియా.... ఉస్మానియా.... 
కదులుతున్న మేఘాలతో 
మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాలతో 
ఆర్ట్స్ కాలేజ్ ఆకాశం మీద
దివ్యంగా వెలుగుతున్న నిండు
పౌర్ణమి చంద్రుడు ఉస్మానియా 
 

Follow Us:
Download App:
  • android
  • ios