Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో విషాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పద మృతి.. అసలేం జరిగిందంటే..?

అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన  ఇద్దరు తెలుగు విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందారు. అసలేం జరిగిందంటే..?

Telangana student among 2 found dead mysteriously in US KRJ
Author
First Published Jan 16, 2024, 6:42 AM IST

అమెరికాలో విషాదం నెలకొంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. వీరిలో ఒకరు తెలంగాణలోని వనపర్తికి చెందిన విద్యార్థి కాగా.. మరొకరు ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందివారు.

వివరాల్లోకి వెళితే.. వనపర్తి పట్టణంలోని రాంనగర్‌కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వారి కుమారుడు దినేశ్‌(23) బీటెక్‌ చదివారు. అమెరికాలోని కనెక్టికట్‌ రాష్ట్రం ఫెయిర్‌ ఫీల్డ్‌లోని సేక్రెడ్‌ హార్ట్‌ విశ్వవిద్యాలయం(ఎస్‌హెచ్‌యూ)లో ఎంఎస్‌ చదివేందుకు గతేడాది డిసెంబరు 28న అమెరికా వెళ్లారు. వెళ్లిన 17 రోజులకే కొడుకు మృతి చెందడంతో దినేశ్ ఇంట్లో తీరని శోకం మిగిలింది.  దినేశ్‌తో పాటు శ్రీకాకుళం జిల్లా విద్యార్థి కూడా చనిపోయాడని తెలిసిందన్నారు.

TOI నివేదించిన ప్రకారం..జనవరి 14 ఆదివారం నాడు యునైటెడ్ స్టేట్స్‌లోని కనెక్టికట్‌లోని వారి నివాసంలో ఇద్దరు విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. వారిద్దరూ నిద్రలోనే మరణించినట్లు తెలుస్తోంది. మరణించిన విద్యార్థులను తెలంగాణకు చెందిన దినేష్, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన నికేష్‌గా గుర్తించారు. ఇద్దరూ యూనివర్శిటీ ఆఫ్ సేక్రేడ్ హార్ట్‌లో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతున్నారు.

స్థానిక స్నేహితులు వారి నివాసానికి వెళ్లినా స్పందన కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం పోలీసులకు, ఆసుపత్రికి సమాచారం అందించగా, ఆసుపత్రికి చేరుకోగా, వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. వీరి మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నారు. మరణాలకు గల కారణాలను పోలీసులు ధృవీకరించనప్పటికీ.. గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ మరణానికి కారణమని అనుమానిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios