Asianet News TeluguAsianet News Telugu

వైమానిక దాడుల ఎఫెక్ట్ .. ఇరాన్ రాయబారిని బహిష్కరించిన పాకిస్తాన్, ఆయన వెనక్కి

తమ భూభాగంపై వైమానిక దాడులు నిర్వహించిన ఇరాన్‌పై పాకిస్తాన్ రగిలిపోతోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్.. ప్రతీకార చర్యలకు దిగింది. తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.

Pakistan recalls its envoy in Iran, warns Tehran of 'right to respond' ksp
Author
First Published Jan 17, 2024, 8:03 PM IST

తమ భూభాగంపై వైమానిక దాడులు నిర్వహించిన ఇరాన్‌పై పాకిస్తాన్ రగిలిపోతోంది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన పాకిస్తాన్.. ప్రతీకార చర్యలకు దిగింది. తమ దేశంలోని ఇరాన్ రాయబారిని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే ఇరాన్‌లోని పాక్ రాయబారిని వెనక్కి పిలిచింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జాహ్రా బలోచ్ మీడియాకు వివరించారు. ఇరాన్ వైమానిక దాడులు.. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలకు ఆజ్యం పోసినట్లయ్యింది. 

ఇరాన్ చర్య.. అంతర్జాతీయ చట్టాలను, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను ఉల్లంఘించడమేనని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. సార్వభౌమాధికార ఉల్లంఘనను ఎత్తిచూపుతూ తమకు స్పందించే హక్కు వుందని ఆ దేశం వెల్లడించింది. ఇరాన్ ఎయిర్ స్ట్రైక్స్ కారణంగా ఇద్దరు పిల్లలు మరణించగా.. మరో ముగ్గురు గాయపడ్డారని పాక్ తెలిపింది. ఇలాంటి ఏకపక్ష చర్యలు ద్వైపాక్షిక విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని పొరుగు దేశాలతో సంబంధాలకు విరుద్ధంగా వున్నాయని వ్యాఖ్యానించింది.

ఈ పరిణామాలకు ఇరాన్ పూర్తిగా బాధ్యత తీసుకోవాలని తేల్చిచెప్పింది. పాకిస్తాన్ సెనేట్ రక్షణ కమిటీ ఛైర్మన్ ముషాహిద్ హుస్సేన్ సయ్యద్.. ఇరాన్, పాక్ రెండింటిలోనూ మిలిటెంట్ల ద్వారా దోపిడీకి గురయ్యే ప్రభుత్వాలేనని పేర్కొన్నారు. సమస్య మూల కారణాలను పరిష్కరించడానికి దౌత్యపరమైన చర్చలు జరపాలని సూచించారు. 

కాగా.. స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతోన్న జైష్ అల్ అదిల్ స్థావరాలను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ (ఐఆర్‌జీసీ) లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ తన చర్యలను సమర్ధించుకుంది. జైష్ అల్ అదిల్‌ సభ్యులతో సంబంధం వున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడింది. అయితే ఇరాన్ వైమానిక దాడులు.. అంతర్జాతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇరుదేశాలు సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించాల్సిన అవసరం వుందని పునరుద్ఘాటించింది. 

ఇకపోతే.. జైష్ ఆల్ ఆదిల్ అనే సంస్థను   2012లో  స్థాపించారు. ఇది సున్నీ మిలిటెంట్ గ్రూప్. ఈ గ్రూప్ పాకిస్తాన్ సరిహద్దులో  పనిచేస్తుంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సరిహద్దు ప్రాంతాల్లో  ఇరాన్ పోరాటం చేసింది. ఇరాన్ సరిహద్దుల్లో పనిచేసే  పోలీసులను  ఉగ్రవాదులు కిడ్నాప్ లకు పాల్పడ్డారు.పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని పర్వత ప్రాంతాల్లో   బలూచ్ జాతీయవాదులు  మొదట్లో  ప్రాంతీయ వనరుల వాటాను  కోరుకున్నారు. ఆ తర్వాత స్వాతంత్ర్యం కోసం తిరుగుబాటును ప్రారంభించారు. సున్నీ మెజారిటీ పాకిస్తాన్  తిరుగుబాటు దారులకు  ఆతిథ్యమిస్తుందని  ఇరాన్ చాలా కాలంగా అనుమానిస్తుంది
 

Follow Us:
Download App:
  • android
  • ios