Asianet News TeluguAsianet News Telugu

అందుబాటులోకి రైతు నేస్తం అప్లికేషన్: ప్రారంభించిన పెద్దిరెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల  కోసం  ఏపీ ప్రభుత్వం కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది. 

Andhra Pradesh Minister Peddireddy Ramachandra Reddy launches Rythu nestham Application lns
Author
First Published Nov 6, 2023, 3:57 PM IST

తిరుపతి: వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు.

నూతనంగా రూపొందించిన  రైతునేస్తం అప్లికేషన్లతోపాటు ఆధునీకరించిన ఏపీసీపీడీసీఎల్ వెబ్ సైట్ ను  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. సోమవారంనాడు  తిరుపతిలో  మంత్రి పెద్దిరెడ్డి రామచాంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.  విద్యుత్తు వినియోగదారులు సేవల్లో ఆలస్యాన్ని నివారించేందుకు వీలుగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తోందని తెలిపారు. 

ఈ సంస్కరణల్లో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మొట్టమొదట ఏపీసీపీడీసీఎల్ లో  బోట్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్టుగా ఆయన  చెప్పారు. వినియోగదారుల సౌలభ్యంకోసం వాట్సాప్ (91333 31912) సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయాన్ని మంత్రి ప్రకటించారు.

వీటిద్వారా వినియోగదారులు నేరుగా చాట్ చేసి తమ సమస్యలను అధికారులు,సిబ్బంది దృష్టికి తీసుకురావచ్చన్నారు.  రైతుల సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతులు అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయాలనే లక్ష్యంతో రైతునేస్తం అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టుగా  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.

 క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్ణీత సమయంలోగా దరఖాస్తును పరిశీలించనట్లయితే వెంటనే ఆ దరఖాస్తు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లాగిన్ కు వెళ్తుందన్నారు.

అక్కడి నుంచి నిర్ణీత సమయంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ లాగిన్లకు దరఖాస్తు చేరుతుందని మంత్రి వివరించారు. 

ఈ ప్రక్రియకు సంబంధించి ప్రతి స్థాయిలోనూ వినియోగదారులకు సంక్షిప్త సందేశాలను రిజిస్టర్డ్ మొబైల్ కు  చేరుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా సర్వీసును విడుదల చేయడంలో జాప్యాన్ని పూర్తి స్థాయిలో నివారించేందుకుఅవకాశం వుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగులో వున్న 1.15 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తమ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

 ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు 3.70లక్షల వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేశామని, 16వేల దరఖాస్తులు మాత్రమే ప్రస్తుతానికి పెండింగులో వున్నాయని మంత్రి వివరించారు. 

వ్యవసాయ సర్వీసులకోసం గత ప్రభుత్వం రూ. 1,478 కోట్ల వ్యయం చేయగా, తమ ప్రభుత్వం నాలుగన్నరేళ్ళ కాలంలోనే  రూ.2,400 కోట్ల వ్యయం చేసిన విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. 

ఏపిఎస్పిడిసిఎల్ చైర్మన్ కె. సంతోష రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, ఇంధనశాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిల ఆదేశాలకు అనుగుణంగా సంస్థ పరిధిలో అధికారులు, సిబ్బందిలో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు వీలుగా వివిధ అప్లికేషన్లను రూపొందించామని తెలిపారు.

 రైతులు వ్యవసాయ విద్యుత్తు సర్వీసుకు దరఖాస్తుచేసిన వెంటనే త్వరితగతిన సర్వీసును మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.  ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి, ఎపిఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు వి.ఎన్. బాబు, ఎన్.వి.ఎస్. సుబ్బరాజు, కె. శివప్రసాద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios