Lifestyle
యూపీలోని ఫతేపూర్‌కు చెందిన వికాస్ ద్వివేది నెలన్నరగా వార్తల్లో ఉన్నాడు. ఒకే పాము 9సార్లు కరవడంతో ఒక్కసారిగా వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు అతని గురించి ఓ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.
వికాస్‌ను 9 సార్లు పాము కరిచిందనే విషయాన్ని ఫతేపూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) తన నివేదికలో తోసిపుచ్చారు. అతణ్ని ఒకసారి మాత్రమే పాము కరిచిందని తెలిపారు.
నిజానికి, CMO రాజీవ్ నయన్ గిరి కలెక్టర్‌కు పంపిన నివేదికలో వికాస్‌ను ఒకసారి మాత్రమే పాము కరిచిందని తెలిపారు. ఆ తర్వాత అతను స్నేక్ ఫోబియా బారినపడినట్లు వెల్లడించారు.
వికాస్‌కు ప్రతిసారీ పాము కరిచినట్లు భ్రమ కలుగుతోందని CMO తెలిపారు. అతనికి సైకియాట్రిస్టుతో చికిత్స అవసరమన్నారు.
వైద్యుల నివేదికను వికాస్ ద్వివేది వ్యతిరేకించాడు. తనను డాక్టర్ ఎగతాళి చేశాడని ఆరోపించాడు. తన వైద్య నివేదికపై హైకోర్టుకు వెళ్లి CMOపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమయ్యాడు.
డాక్టర్లు తన రక్త నమూనాలను కూడా తీసుకోకుండానే నివేదిక ఇచ్చారని వికాస్ ఆరోపిస్తున్నాడు. అయితే, పాము కాటుకు సంబంధించిన ఈ వార్త మీడియాలో వైరల్ అయింది.