Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు చెప్పే బిజెపిలో చేరా: రేవూరి ప్రకాశ్ రెడ్డి

చంద్రబాబుతో చర్చించిన తర్వాతనే తాను టీడీపిని వీడి బిజెపిలో చేరినట్లు రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పారు. టీడీపిని తుడిచిపెట్టడంలో కేసీఆర్ విజయం సాధించారని ఆయన అన్నారు. అందుకే తాను బిజెపిలో చేరినట్లు తెలిపారు. 

Revuri Prakash Reddy says he joined BJP after discussing with Chandrababu
Author
Warangal, First Published Sep 7, 2019, 2:11 PM IST

వరంగల్: తన రాజకీయ భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో చర్చించిన తర్వాతనే తాను బిజెపిలో చేరానని రేవూరి ప్రకాశ్ రెడ్డి చెప్పారు. టీడిపీపై వ్యతిరేకతతోనో చంద్రబాబుపై ఆగ్రహంతోనో తాను పార్టీకి రాజీనామా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 

రేవూరి ప్రకాశ్ రెడ్డి టీడీపికి రాజీనామా చేసి ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని బిజెపిలో చేరినట్లు ఆయన తెలిపారు. కేసీఆర్ కు రాజకీయ జన్మ ఇచ్చిన టీడీపీని తెలంగాణలో కనిపించకుండా చేయడంలో ఆయన విజయం సాధించారని రేవూరి అన్నిారు. 

రాజకీయాల నుంచి తప్పుకోవాలా, పార్టీ మారాలా అనే విషయంపై తాను చంద్రబాబుతో సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన శనివారం వరంగల్ లో మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే రాజకీయ పునరేకీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. దానికి బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపించిందని చెప్పారు. 

బిజెపి నాయకత్వం జాతీయ స్థాయిలో గర్వపడే విధంగా ఉందని, అందువల్లనే తాను బిజెపిలో చేరానని ఆయన చెప్పారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో నిజమైన ఉద్యమకారులెవరూ ప్రశాంతంగా లేరని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెసు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అన్నారు అందుకే నాయకులంతా బిజెపి వైపు చూస్తున్నట్లు ఆయన తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios