వరంగల్: రెండేళ్లకోసారి దేశవ్యాప్తంగా వుండే గిరిజనులంతా తెలంగాణ బాట పడుతుంటారు. ఎందుకంటే వరంగల్ జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు దర్శించుకోడానికి. దేశవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన ఈ గిరిజన జాతర రెండు రోజుల క్రితం ప్రారంభమయ్యింది. దీంతో అమ్మవార్లను దర్శించుకునేందుకు సామాన్యులే కాదు రాజకీయ ప్రముఖులు కూడా మేడారంకు చేరుకుంటున్నారు. ఈ జాతరలో చివరిరోజయిన ఇవాళ కేంద్ర మంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులు దర్శించుకున్నారు. 

వనదేవతలు సమ్మక్క సారాలమ్మలను  దర్శించుకునేందుకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా మేడారంకు విచ్చేశారు. ఆయనకు రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ, పంచాయతీ రాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సీతక్క, అధికారులు సాదర స్వాగతం పలికారు. దగ్గరుండి అమ్మవార్ల  దర్శనం  జరిపించారు. 

అనంతరం కేంద్ర మంత్రి నిలువెత్తు బంగారాన్ని అమ్మవార్లకు సమర్పించుకున్నారు. అలాగే చీర, గాజులను కూడా వనదేవతలకు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నాడు. కేంద్రమంత్రితో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. 

మేడారం జాతర... వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రి అర్జున్ ముండా (ఫోటోలు)

అలాగే రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లు కూడా సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు. మేడారం జాతరను జాతీయ పండగగా గుర్తించాలని, మేడారం అభివృద్ధికి నిధులు, గురుకులాలు కేటాయించాలని కోరుతూ కేంద్రమంత్రికి కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యే సీతక్క కలిసి వినతి పత్రం ఇచ్చారు.  అనంతరం పోచంపల్లి కండువాలు, శాలువా కప్పి, జ్ఞాపికను అందించి సన్మానం చేశారు. 

శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు .హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్ట్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా శాసన మండలి చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులతో మేడారం జాతరకి వెళ్లారు.

గిరిజన సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖ మంత్రులు సత్యవతి రాథోడ్ ,ఇంద్రకరణ్ రెడ్డిలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి లకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. వీరు సమ్మక్క సారలమ్మ గద్దెలను, అక్కడే కొలువై ఉన్న గోవింద రాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు.

 Video: పోటెత్తిన మేడారం...తల్లుల గద్దెల వద్ద జనసంద్రం

మేడారం సమ్మక్క,సారలమ్మలకు గుత్తా నిలువెత్తు బంగారం( బెల్లం) సమర్పించారు. మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు అమ్మవార్ల ఫోటోలను శాసన మండలి ఛైర్మన్ కు అందజేశారు.