Asianet News TeluguAsianet News Telugu

విశాఖపై కరోనా ఎఫెక్ట్... విమ్స్ క్వారంటైన్ లో 31 మంది: మంత్రి అవంతి వెల్లడి

విశాఖపట్నంపై  కరోనా వైరస్ ప్రభావం, వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న తీసుకుంటున్న జాగ్రత్తల గురించి మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు. 

minister avanthi srinivas reacts on corona effects in vizag
Author
Visakhapatnam, First Published Mar 23, 2020, 6:06 PM IST

విశాఖపట్నం: వివిధ దేశాల నుండి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారు స్వచ్చందంగా ముందుకు రావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. సోమవారం విమ్స్ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... విమ్స్ లో క్వారంటైన్ వార్డులో 31 మంది కజికిస్తాన్, దుబాయ్, ఖతార్, అబూదాబి తదితర దేశాల నుండి వచ్చిన వారు వైద్యుల పరిశీలనలో ఉన్నారని చెప్పారు.  ప్రోటోకాల్ ప్రకారం విదేశాల నుండి వచ్చినపుడు 14 రోజులు పరిశీలనలో ఉండాలని తెలిపారు. వారిలో కరోనా వైరస్ లక్షణాలు లేకపోతే అలాంటివారిని వారి గృహాలకు పంపనున్నట్లు చెప్పారు. 

సామాజిక బాధ్యతగా విదేశాల నుండి వచ్చిన వారు వాలంటీర్ గా సంబంధిత పోలీసు స్టేషన్ లో చెప్పాలని ఆయన వివరించారు. అందరూ స్వచ్చందంగా ముందుకు వచ్చి సహకరించాలని తెలిపారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన పిలుపునిచ్చారు.  

అల్లిపురంలో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి హైదరాబాద్ నుండి నేరుగా తమ ఇంటికే వెళ్లడంతో తన భార్యకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఐసోలేషన్ వార్డులు ఛాతీ, కెజిహెచ్, మెంటల్ ఆసుపత్రుల్లో ఉన్నాయని, కరోనా లక్షణాలు ఏమైనా ఉంటే ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి అలాంటి వారి నుండి శాంపిల్స్ సేకరించి వైరాలజీ ల్యాబ్ కు పంపిస్తున్నామని తెలిపారు. నెగిటివ్ రిపోర్టులు వచ్చిన వారిని ఇంటికి పంపేస్తున్నట్లు ఆయన వివరించారు.  

భవిష్యత్ లో విమ్స్ ఆసుపత్రిని ఐసోలేషన్ కోసం వాడుకోవచ్చునని తెలిపారు.  క్వారంటైన్ కోసం విమ్స్, ఆంధ్రా మెడికల్ కళాశాల, గాయత్రి, గీతం  తదితర వాటిని వినియోగించుకోవచ్చునని చెప్పారు. అవసరమైతే ఇంజనీరింగ్ కళాశాలలను వినియోగించుకోవచ్చునని సంబంధిత యాజమాన్యాలు ముందుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఉగాది పండుగను ఎవరి ఇళ్లల్లో వారు చేసుకోవాలని, నిత్యవసర సరుకులు అమ్మే షాపులు తెరిచే ఉంటాయని చెప్పారు.  ప్రజలు ఎక్కడా గుంపులుగా ఉండరాదన్నారు.   జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు వైద్యులు, పోలీసులు, అధికారులు చేస్తున్న కృషికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, విమ్స్ సంచాలకులు డా. సత్య వర ప్రసాద్, డా. భవాణి ప్రసాద్, తహసిల్థార్ నరసింహమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

అంతకు ముందు క్వారంటైన్ లో ఉన్నవారిని పరిశీలిస్తున్న వైద్యులతో ఆయన సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా క్వారంటైన్ వార్డులో ఉన్నవారికి టివి, బుక్స్ ఏర్పాటు చేయాలని విమ్స్ సంచాలకులను మంత్రి ఆదేశించారు.  

విమ్స్ సంచాలకులు డా. సత్య వరప్రసాద్ మాట్లాడుతూ... క్వారంటైన్ వార్డులో ఇప్పటికే టివి, వైఫై ఏర్పాటు చేయడమైనదని, సిమ్ లు సరఫరా చేసినట్లు ఆయన మంత్రికి వివరించారు.  క్వారంటైన్ లో ఉన్నవారికి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే అలాంటి వారిని కె.జి.హెచ్.కు తరలిస్తామని చెప్పారు.  

 

Follow Us:
Download App:
  • android
  • ios