అమరావతి: విశాఖపట్నంలో ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ రాజధానిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేస్తోంది. విశాఖకు రాజధాని రావడం వల్ల నగర జనసామర్థ్యం కూడా పెరుగుతుంది కాబట్టి అందుకు తగినట్లు ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగా విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కొత్త డీపీఆర్ ల రూపకల్పనకు సిద్దమైంది. 

డిపిఆర్ ల కోసం ప్రతిపాదనల్ని పిలవాల్సిందిగా వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోటేషన్లను పిలించేందుకు అమరావతి మెట్రోరైల్ ఎండీకి ఆదేశాలు ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. విశాఖలో మొత్తం 79.9 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ నిర్మాణం కోసం కొత్త డీపీఆర్ లను రూపోందించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటోంది. 

read more  స్థానిక సంస్ధల ఎన్నికలకు సిద్దంకండి...: కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమీషనర్

గతంలో డీపీఆర్ రూపకల్పన కోసం ఎస్సెల్ ఇన్‌ఫ్రా కన్సార్షియంకు ఇచ్చిన ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రతిపాదనల రూపకల్పన కోసం ఢిల్లీ మెట్రోరైల్ కార్పోరేషన్, రైట్స్, యూఎంటీసీ తదితర సంస్థలను సంప్రదించాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. 

మూడు కారిడార్లలో మెట్రో రైల్ నిర్మాణం కోసం డీపీఆర్ ల రూపకల్పనతో పాటు 60 కిలోమీటర్ల మేర మోడర్న్ ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు మరో డీపీఆర్ ను కూడా సిద్ధం చేసేందుకు ప్రతిపాదనల్ని స్వీకరించాలని  ప్రభుత్వం సూచించింది.