Asianet News TeluguAsianet News Telugu

టిడీపీవాళ్లను కాల్చిపడేసి...పార్టీని ఏపి నుండి పంపించేయాలి...: వర్ల రామయ్య

తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై వైసిపి వాళ్ల దాడులు రోజురోజుకు మరీ ఎక్కువ అవుతున్నాయని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. 

TDP Leader Varla Ramaiah Fires on YS jagan
Author
Vijayawada, First Published Feb 6, 2020, 9:26 PM IST

అమరావతి: ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేయడంలో ఘోరంగా విఫలమైన జగన్‌ సర్కారు శాంతిభద్రతలను గాలికొదిలేసి ఏదో ఘనకార్యం చేసినట్లు చంకలు గుద్దుకుంటోందని టిడీపీ సీనియర్‌నేత, ఆపార్టీ పొలిట్‌బ్యూరోసభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీకేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 

గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో కక్షలు, కార్పణ్యాలు పెరిగాయని,  ఆప్రాంతంలో అశాంతిని, అలజడులను సృష్టించి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నందుకు వైసీపీ ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. ఆత్మకూరు నుంచి 200దళిత కుటుంబాలు గ్రామం విడిచిపోయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టుకూడా లేదన్నారు. జాతీయ మానవహక్కుల సంఘం పల్నాడులో పర్యటించి నివేదిక ద్వారా చీవాట్లు పెట్టినా ప్రభుత్వపెద్దల్లో స్పందనలేదన్నారు. 

ఆనాడు పల్నాడుప్రాంతం పర్యటనకు వెళ్లాలనుకున్న చంద్రబాబుని, టిడీపీ నేతల్ని అడ్డుకున్న ప్రభుత్వం అక్కడ 144సెక్షన్‌ అమల్లో ఉందంటూ కుంటిసాకులు చెప్పిందన్నారు. పిడుగురాళ్లలో వైద్యుడైన శేఖర్‌బాబుపై అమానుషంగా దాడిచేశారని, మెడికల్‌షాపులో తాగితందనాలాడుతుంటే  అడ్డుకున్నాడన్న అక్కసుతో  వైసీపీ నేతలు సదరు వైద్యుడిపై దాడికి పాల్పడ్డారని వర్ల తెలిపారు. 

read more  అలాంటి వారికే నా సపోర్ట్... పార్టీలోనూ సముచిత స్థానం...: చంద్రబాబు నాయుడు

సోషల్‌మీడియాలో ఆ వైద్యుడి పరిస్థితి చూస్తుంటే కళ్లు చెమ్మగిల్లాయన్నారు. ఇంతదారుణం జరిగితే ఇంకా శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయనే ప్రభుత్వం చెబితే ప్రజలు నమ్ముతారా అని వర్ల ప్రశ్నించారు. వైద్యుడిని కొట్టినవారంటూ ఇద్దరు అమాయకుల్ని అరెస్ట్‌చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారని, అసలైన దోషులను అరెస్ట్‌చేసి వారిపై తక్షణమే రౌడీషీట్లు తెరవాలని రామయ్య డిమాండ్‌చేశారు.

మాచర్ల నియోజకవర్గంలోని కంభంపాడు గ్రామంలోని యాదవబజారులో తెలుగుదేశం కార్యకర్తను, అతని కుటుంబాన్ని లక్ష్యంచేసుకొని దాడికి పాల్పడ్డారన్నారు.   బుధవారం సాయంత్రం 7గంటల సమయంలో యాదవకులానికి చెందిన దండు పెదవెంకయ్యని బెదిరించి రాత్రికిరాత్రి అతనికుటుంబంపై దాడికి యత్నించి, పెద్దవాడనికూడా చూడకుండా ఆయన తలపగలగొట్టారని వర్ల పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు యథేచ్ఛగా జరుగుతుంటే శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని ఏముఖం పెట్టుకొని చెబుతున్నారన్నారు. 

రాష్ట్రంలో అరాచక, రాక్షస, ఫ్యాక్షనిస్ట్‌ల, పాలెగాళ్ల పాలన సాగుతోందనడానికి ఇంతకంటే నిదర్శనమేముంటుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టిడీపీ తరుపున పోటీ చేయడానికి వీల్లేదంటూ వైసీపీశ్రేణులు ఆ కుటుంబంపై దాడి చేశాయన్నారు. వెంకయ్యకుటుంబం వేరేపార్టీలో ఉండకూడదా అని ప్రశ్నించిన రామయ్య, దాడిచేసినవారిని అరెస్ట్‌చేయకుండా మరలా ఇంటిమీదకు వచ్చి దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు, ప్రభుత్వం చోద్యం చూస్తున్నారన్నారు. 

కర్రలు, గొడ్డళ్లతో అమానుషంగా, కిరాతకంగా దాడిచేయడమే కాకుండా కుటుంబాలను ఊళ్లు వదిలివెళ్లిపోమని హెచ్చరించడం ఎలాంటి పాలనో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. కంభంపాడులో శాంతిభద్రతలు సక్రమంగానే ఉన్నాయని జగన్మోహన్‌రెడ్డి సమాధానం చెప్పగలడా అని వర్ల నిలదీశారు. ఇలాంటి దాడులుచేసేకంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్రం వదిలిపోవాలని జగన్‌ ఆదేశాలు జారీచేస్తే ఇంకా బాగుంటుందన్నారు. 

read more  చంద్రబాబు నేతృత్వంలో ఆ జాబితా రెడీ... అంతుచూస్తాం..: బుద్దా వెంకన్న సీరియస్

పోలీసులు, సీఆర్పీసీ, ఏపీ పోలీస్‌ మాన్యువల్‌ ప్రకారం నడుచుకోకుండా పార్టీలకు, ప్రభుత్వాలకు వత్తాసు పలికితే భవిష్యత్‌లో తగినమూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. వైద్యుడిని కొట్టిపడేసినా, రైతుని చంపడానికి యత్నించినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడంలేదన్నారు. జలియన్‌వాలాబాగ్‌ మాదిరి టిడీపీవాళ్లను కాల్చిపడేస్తే ఒక్కరోజుతో పోతుందికదా అని వర్ల మండిపడ్డారు. 

పెదవెంకయ్య, ఆయన కుటుంబసభ్యులు, కంభంపాడులోని టిడీపీఅభిమానులు అధైర్యపడాల్సిన పనిలేదని, వారందరికీ అన్నివేళలా అండగా ఉంటామని వర్లరామయ్య స్పష్టంచేశారు. ఎన్టీఆర్‌, చంద్రబాబుల హయాంలో ఏనాడు ప్రత్యర్థి పార్టీలపై ఎలాంటి దాడులు జరగలేదన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికైనా తనపంథాను మార్చుకొని పోలీసులు చట్టబద్ధంగా పనిచేసేలా చూడాలని వర్ల హితవుపలికారు. 

 
 

Follow Us:
Download App:
  • android
  • ios