Asianet News TeluguAsianet News Telugu

సీఏఏ, ఎన్ఆర్సీపై విషప్రచారం... మొదట గొంతెత్తేది నేనే..: పవన్ కల్యాణ్

కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ చేయడంతోనే అభివృద్ధి జరిగిపోదని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రణాళికలు కావాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.  

Pawan Kalyan Supports NRC And CAA
Author
Vijayawada, First Published Feb 7, 2020, 9:27 PM IST

అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని మాట్లాడిన తన దిష్టిబొమ్మను దగ్ధం చేసేంత కోపం ఉన్న కర్నూలు నాయకులకి... సుగాలీ ప్రీతిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే ఎందుకు కోపం రాలేదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కర్నూలుకు హైకోర్టు అడిగే ముందు సుగాలీ ప్రీతికి న్యాయం జరిగితే అప్పుడే నైతికంగా బలం చేకూరుతుందనే విషయాన్ని గుర్తించాలి అన్నారు. 

కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్ చేయడంతోనే అభివృద్ధి జరిగిపోదని, యువతకు ఉపాధి అవకాశాలు పెంచే ప్రణాళికలు కావాలని స్పష్టం చేశారు. పరిశ్రమలు, ఐటిహబ్ లాంటివి నెలకొల్పితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. 

శుక్రవారం సాయంత్రం శంషాబాద్ లో  కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల క్రియాశీలక కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కర్నూలు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులను తొలగిస్తున్న గ్రామ వాలంటీర్ల తీరు గురించి కార్యకర్తలు పవన్ కి తెలియచేశారు. 

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "రాయలసీమ ప్రాంతం కొన్ని కుటుంబాలు, గ్రూపుల చేతిలో చిక్కుకుపోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పాలకులు మారతారు తప్ప ప్రజల తలరాతలు మారవు. ఇప్పటి వరకు సీమ నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చినా పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి కల్పించలేకపోయారు. నాయకులు వేల కోట్లు సంపాదిస్తున్నారుగానీ ప్రజల జీవితాల్లో మార్పు మాత్రం రావడం లేదు. వాళ్ల మోచేతి నీళ్లు తాగే మనం బతకాలని వారు కోరుకుంటున్నారు'' అని అన్నారు.

read more  వివేకా హత్యకేసులో వెనక్కితగ్గిన జగన్... మా అనుమానాలివే..: వర్ల రామయ్య

''రాష్ట్రంలో ఏ వార్డుకు వెళ్లినా అయిదుగురు జనసైనికులు ఉంటే 500 మంది నా అభిమానులు ఉన్నారు. అభిమానులను జనసైనికులుగా మార్చలేకపోయాం. దీనికి కారణం స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవడం. స్థానికంగా బలంగా ఉండే నాయకులు నా దగ్గరకు రారు. అందుకు కారణం తొలి సమావేశంలోనే ప్రజలకు ఏం చేద్దాం అని అడుగుతాను. అందుకే నన్ను చూడగానే వాళ్లు చిరాకుపడతారు'' అని పవన్ తెలిపారు. 

''రాయలసీమ ముస్లింల జీవన ప్రమాణాలు ఎందుకు మెరుగుపడలేదు? భారతదేశం సెక్యులర్ దేశం. ఈ దేశంలో అన్ని మతాలు సమానమే. ఇస్లాం పాటిస్తున్న భారతీయుల్లో సీఏఏ, ఎన్ఆర్సీపై కొంతమంది కావాలనే విషప్రచారం చేశారు. ఈ దేశంలో పుట్టిన ముస్లింలకు సీఏఏ, ఎన్ఆర్సీ వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే భారతీయ జనతా పార్టీతో ఎందుకు జతకడతాను'' అంటూ వివరణ ఇచ్చారు. 

''కాంగ్రెస్ , వైసీపీ పార్టీలు సెక్యులర్ పార్టీలు అయితే రాయలసీమలో ముస్లింల జీవన ప్రమాణాలు ఎందుకు పెరగలేదు. కులం, మతం, వర్గం, వర్ణం పేరు చెప్పి నాయకులు ఎదుగుతున్నారు తప్ప సాటి మనిషి జీవితంలో ఎలాంటి మార్పు రావడం లేదు. భగవంతుడు, భగవత్ తత్వాన్ని అర్ధం చేసుకున్న ఎవరూ కూడా గొడవలు పడరు. నిజమైన హిందువులు, నిజమైన ముస్లింలు, నిజమైన క్రిస్టియన్లు సబ్ కా మాలిక్ ఏక్ హై అనే అంటారు. మతానికి ఇబ్బంది జరిగితే మొదట గొంతెత్తేది నేనే'' అని అన్నారు.

read more  ఎన్టీఆర్ పార్టీని వదిలేసి రా..: చంద్రబాబుకు మంత్రి అనిల్ సవాల్

''కర్నూలులో పార్టీ కార్యాలయం ఏర్పాటు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే చాలా మంది మైనార్టీలు నమ్మకం ద్రోహం చేశారని అంటున్నారు. కానీ దశాబ్దాలుగా సెక్యులర్ పార్టీలు అని చెప్పకుంటున్న ఏ పార్టీ కూడా రాయలసీమను అభివృద్ధి చేయలేకపోయింది. యువతకు ఉపాధి కల్పించలేకపోయింది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి, రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించాలనే లక్ష్యంతోనే బీజేపీతో జనసేన పార్టీ జతకట్టింది'' అని వెల్లడించారు. 

''మన జీవితం మారాలంటే పరిశ్రమలు రావాలి .. పరిశ్రమలు రావాలి అంటే పెట్టుబడుదారుల్లో విశ్వాసం రావాలి... పెట్టుబడుదారుల విశ్వాసం చూరగొనాలి అంటే రాజకీయ నాయకులు వాటాలు అడగటం మానేయాలి. అలాంటి పాలనను జనసేన పార్టీ తీసుకొస్తుంది. అతి తర్వలో జనసేన కర్నూలు పార్లమెంట్ కార్యాలయాన్ని కర్నూలు పట్టణంలో పెడతాం. స్థానిక సమస్యలను తెలుసుకోవడానికి ఈ నెల 12, 13 తేదీల్లో కర్నూలు జిల్లాలో పర్యటిస్తాన" అని పవన్ చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్,  ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ రేఖాగౌడ్ పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios