విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డలను ఓ కసాయి తల్లి అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన బయటపడింది.  ఇద్దరు చిన్నారులను చంపిన మహిళ ప్రస్తుతం పరారీలో వుంది.  

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఇద్దరు ఆడబిడ్డలను(ఒకరు 4, మరొకరు 3 సంవత్సరాలు) ఇంటిబయట నీటికోసం నిర్మించిన తొట్టిలో వేసి చంపింది. ఇంట్లో కుటుంబసభ్యులెవ్వరూ లేని సమయంలో ఈ దారుణానికి పాల్పడి ఇంటినుండి పరారయ్యింది. 

దారుణం..అమ్మవారి సాక్షిగా..బండరాయితో తలపై మోది...

అయితే ఈ ఘటన జరిగిన కొద్దిసేపటి తర్వాత చిన్నారుల తాతయ్య ఇంటికి వచ్చి తొట్టిలో చూడగా చిన్నారులు అందులో విగతజీవులుగా పడివున్నారు. తన కోడలి కోసం వెతకగా ఆమె ఇంట్లో కనిపించలేదు. దీంతో అతడు చుట్టుపక్కల వారికి ఈ విషయం తెలియజేసి వారి సాయంతో పోలీసులకు సమాచారం అందించాడు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని నీటితొట్టిలో నుండి చిన్నారుల మృతదేహాలను బయటకు తీయించారు. వెంటనే రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

మృతిచెందిన చిన్నారుల తాతయ్య ఇచ్చిన పిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో వున్న చిన్నారుల తల్లికోసం గాలిస్తున్నారు. కన్న కూతుళ్లను ఇంత దారుణంగా చంపడం వెనకున్న కారణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.