గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ వెలిగొండ పర్యటన చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని, ఆయన చేసిన సమీక్షలోనే  వెలిగొండ ఒకటో టన్నెల్  పనులు 90.96 శాతం పూర్తయ్యాయని, 17.78కిలోమీటర్ల వరకు టన్నెల్ బోరింగ్ పనులు పూర్తయ్యాయని మొత్తం 18.798 కి.మీటర్లలో 17.78కి.మీటర్ల వరకు పూర్తయినట్టు రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.

 శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆయనే స్వయంగా వెలిగొండ టన్నెల్ పూర్తిచేసినట్లుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. నిన్నటివరకు హోంమంత్రిగా పనిచేసిన సజ్జల ఉన్నట్టుండి సరికొత్తగా జలవనరులశాఖ మంత్రి అవతారం ఎప్పుడు ఎత్తాడో తెలియడంలేదని దేవినేని ఎద్దేవాచేశారు. 

ప్రతిపక్షంపై, ప్రశ్నించినవారిపై అక్రమకేసులు పెట్టేలా జగన్ ఆదేశిస్తుంటే, సజ్జల వాటిని తూచా తప్పకుండా అమలయ్యేలా చూస్తున్నాడన్నారు. శుక్రవారం సాయంత్రం బెంగుళూరుకు వెళ్లి సోమవారం ఉదయాన్నే తిరిగొచ్చేసే సజ్జల పలుమార్గాల్లో అందినకాడికి దండుకుంటున్నాడన్నారు. సజ్జల ఎవరినుంచి ఎంతెంత వసూలుచేస్తున్నాడో డమ్మీ మంత్రులను అడిగితే మొత్తం చెబుతారని, ఆ కలెక్షన్ పనులేవో సక్రమంగా చేసుకోకుండా టన్నెల్స్, ప్రాజెక్టులు అంటూ తెలియనివాటి గురించి సజ్జల మాట్లాడటం, జగన్ కామెడీ చేయడం చూస్తుంటే నవ్వోస్తోందని దేవినేని దెప్పిపొడిచారు. 

1989 మార్చిలో మహానుభావుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు తన ఓఎస్డీగా ఉన్న డాక్టర్ శ్రీరామకృష్ణయ్యను ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మెట్టప్రాంతాలన్నీ తిప్పి వెలిగొండ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. 1996లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగింపచేసి నిర్మాణం కొనసాగేలా పరిపాలనా ఉత్తర్వులిచ్చి పనులు మొదలయ్యేలా చూశారన్నారు.  

వెలిగొండ టన్నెల్ పనులు త్వరగా పూర్తయితే తన సొంత జిల్లాకు నీళ్లొస్తాయని తెలిసికూడా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్ట్ పనులు, కాలువల పనులకు గ్రహణం పట్టించాడన్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు రాజశేఖర్ రెడ్డి చేసిన అవినీతిని కడగటానికి భయపడి జీవోనెం 13ని తీసుకొచ్చికూడా ప్రాజెక్ట్ పనులను గాలికొదిలేశారన్నారు.  చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రయ్యాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాజెక్టుల పనులు తిరిగి కొనసాగించడం కోసం, సాగునీటి రంగనిపుణలతో ఒక కమిటీవేసి, జీవోనెం22, జీవోనెం63లు   తీసుకురావడం జరిగిందని దేవినేని తెలిపారు. 

read more  టిడిపి శ్రేణులపై వేధింపులు... ఆ అధికారులపై పేర్లు రాసిపెట్టుకోండి...: చంద్రబాబు హెచ్చరిక

రాజశేఖర్ రెడ్డి నిర్ణయాల కారణంగా సాగునీటి ప్రాజెక్ట్ లు ఆనాడు సాగునీటి ప్రాజెక్ట్ లు చేపట్టిన కంపెనీలన్నీ, ఐసీయూలోకి చేరాయన్నారు.  వెలిగొండ ప్రాజెక్ట్ లో  టన్నెల్ 1 లో 4.4 కిలోమీటర్ల పనులను గత ఐదేళ్లలోనే పూర్తి చేశామని, కొత్త ఏజెన్సీ వచ్చాక జరిగిన 2కిలోమీటర్ల పనుల గురించి మాట్లాడుతూ కేవలం 600 మీటర్ల పనులే టీడీపీ హాయాంలో జరిగాయని చెబుతూ వైసీపీప్రభుత్వం, సజ్జల వంటి నేతలు అబద్ధాలతోనే బతుకుతున్నారని దేవినేని దుయ్యబట్టారు. 

వెలిగొండ టన్నెల్ పనులు చేపట్టిన మొదటి ఏజెన్సీ నాలుగన్నరేళ్లలో 3.8కిలోమీటర్ల పనులు చేస్తే, రెండో ఏజెన్సీ పనులు చేపట్టాక 2 కిలోమీటర్ల పనులు చేసిందని ఈ వాస్తవాలు చెప్పకుండా, టీడీపీ ప్రభుత్వం కేవలం 600 మీటర్లే పనులు చేసిందని సజ్జల ట్వీట్లు పెట్టడం, ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనమన్నారు.  ఒకటో టన్నెల్ పనులను ఒక ప్రముఖ కంపెనీకి టీడీపీ ప్రభుత్వం అప్పగిస్తే, దాన్నెందుకు జగన్ సర్కారు రివర్స్ చేయలేదని దేవినేని నిలదీశారు. 

రెండుకిలోమీటర్ల టన్నెల్ ను ఆ కంపెనీనే పూర్తి చేసిందని, దానిలోనే రూ.414కోట్ల అవినీతి జరిగిందని, టీడీపీ కీలకనేత ఆ మొత్తం కాజేశాడని సాక్షి మీడియా గగ్గోలుపెడుతోందని, తవ్వింది వాస్తవమో, జరిగిన అవినీతి వాస్తవమో అదే మీడియా స్పష్టంచేయాలని మాజీమంత్రి డిమాండ్ చేశారు. తానే టన్నెల్ తవ్వినట్లు జగన్ జబ్బలు చరుచుకుంటుంటే, సాక్షి మీడియా రాసిన రాతల సంగతేంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం నిజంగా తప్పుచేసి ఉంటే, పనులు చేసిన కాంట్రాక్ట్ సంస్థపై, అధికారులపై చర్యలు తీసుకోవడానికి జగన్ సర్కారు ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు. 

తాముచేసింది తప్పయితే జగన్, తమను శిక్షించాలని, ఒకవేళ సాక్షి తప్పుడురాతలురాసి ఉంటే, ఆ పత్రికను నిలిపివేస్తారా అని దేవినేని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్ట్ పనుల్లో ఏడాదిలోనే చంద్రబాబు రెండుసార్లు అంచనా వ్యయాలు పెంచితే ఇప్పుడొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం గడ్డి పీకుతున్నాడన్నారు. ఎవరో చేసిన పనిని, సిగ్గులేకుండా తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్న జగన్ టన్నెల్ ను 1.4 కిలోమీటర్లు తవ్వినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

 పోలవరం పనులు ఆపేసి, రివర్స్ టెండరింగ్ కు వెళ్లిన జగన్ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్ట్ విషయంలో  ఆపని ఎందుకుచేయలేదని, ఇప్పడు సదరు పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థకు, జగన్ ప్రభుత్వానికి ఉన్న సంబంధమేంటో బయటపెట్టాలని ఉమా డిమాండ్ చేశారు. వెలిగొండ సొరంగాల పనుల్లో కాంట్రాక్టర్ల నిర్వాకంపై తాను కన్నెర్ర చేసినట్లు, తన ఆదేశాలతో అధికారులు అదనపు చెల్లించపులు చేసినట్లు సాక్షిలో చెప్పడం, గతప్రభుత్వంలో టన్నెల్ 1 పనుల్లో అవినీతి చేసిన కంపెనీకే, జగన్ ప్రభుత్వం టన్నెల్ 2 పనులు అప్పగించడం చూస్తుంటే, ముఖ్యమంత్రి లోగుట్టు ఏమిటో అర్థమవుతోందన్నారు.  

రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ లో జగన్ కొత్త సంప్రదాయాన్ని తీసుకొచ్చాడని, టెండర్లు వేసిన కంపెనీలన్నీ తమ డాక్యుమెంట్లను సంబంధిత పనులు చూసే ఎస్ఈలకో,  ఈఈలకో ఇవ్వాలని, ఎన్ని కంపెనీలు టెండర్లు వేశాయో, ఆ కంపెనీల వివరాలప్రకారం వారికి ఫోన్లు చేసి,టెక్నికల్ బిడ్ వేయకముందే సదరు కంపెనీలతో తాము చెప్పిన రేట్లకే టెండర్లు వేయిస్తూ రివర్స్ టెండరింగ్ కు వెళుతున్నారని దేవినేని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్న అధికారులంతా, భవిష్యత్ లో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. 

సాక్షి పత్రికలో రూ.300కోట్ల అవినీతి జరిగిందని చెబుతూనే మరోవైపు అవేఅవినీతి పనులు చేసిన కంపెనీకి టన్నెల్ 2 పనులు ఎలా అప్పగించారో సజ్జల సమాధానం చెప్పాలన్నారు. గుడ్డిగా ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నఅధికారులు, ఏదో ఒకరోజు సీబీఐ, ఈడీల ఎదుట దోషులుగా నిలబడాల్సి వస్తుందనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. 

9నెలల వైసీపీపాలనలో వెలిగొండలో అరంగుళంకూడా పనులుజరగలేదని, టీడీపీ హయాంలో జరిగిన పనులను దోపిడీ అనడం సిగ్గుచేట్టన్నారు. టన్నెల్ 1 పనుల్లో టీడీపీప్రభుత్వంగానీ, తానుగానీ, అధికారులు గానీ తప్పుచేసి ఉంటే వైసీపీప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందని దేవినేని నిలదీశారు. 

పట్టిసీమపై కట్టుకథలంటూ, రూ.376కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గగ్గోలు పెట్టిన జగన్, ఆయన మీడియా నేడు ఆ అవినీతిని ఎందుకు వెలికితీయడంలేదన్నారు. పట్టిసీమపై మాట్లాడుతూ పనులుచేసిన కంపెనీని జైల్లో పెడతానన్న బుగ్గన, ఇప్పుడెందుకు నోరెత్తడంలేదన్నారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలాడి కడపలో రెండే కంపెనీలు ప్రాజెక్ట్ ల  పనులు చేసేలా జగన్ చర్యలు తీసుకున్నాడని, అందులో ఒక కంపెనీ తన మేనమామదైతే, మరోటి తనకు సన్నిహితుడైన ఎంపీదని దేవినేని తెలిపారు.

జగన్ ఆడిన రివర్స్ డ్రామాలన్నింటిపై కచ్చితంగా సీబీఐ విచారణ జరిగి తీరుతుందని, తప్పుచేసిన అధికారులంతా శ్రీలక్ష్మి మాదిరిగా కోర్టుల చుట్టూ తిరగడం ఖాయమని ఉమా స్పష్టంచేశారు. 

జగన్మోహన్ రెడ్డి తనపార్టీ వారితో రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రి రాబోతున్నట్టు ట్వీట్ కూడా ఇప్పించాడని ఆమెవరో, ఎందుకొస్తుందో కాలమే సమాధానం చెబుతుందని దేవినేని తెలిపారు. 

read more  జగ్గు దాదా... పిల్లనిచ్చిన మామ చేయలేనిది దొంగమామ చేశాడుగా...: అచ్చెన్నాయుడు

టన్నెల్ లో టన్నుల కొద్దీ అవినీతి జరిగిందని, యంత్రాల్లో అవినీతి తంత్రముందని చెబుతున్న సాక్షి వచ్చేఏడాదికి వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణాజలాలు ఎలా వస్తున్నాయో చెప్పాలన్నారు. యంత్రాల్లో అవినీతి తంత్రముంటే  9నెలల్లోనే 1.4కిలోమీటర్ల పనులు ఎలా జరిగాయో సజ్జల చెప్పాలన్నారు. సాక్షిలో రాసిన అవినీతి రాతలు నిజమైతే, వెలిగొండ సమీక్షకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్ ఎందుకు సమీక్ష చేయలేదన్నారు. జగన్ , ఆయన బృందం తప్పుడుకూతలను, సాక్షి తప్పుడురాతలను తట్టుకొని పనులు చేయడంపైనే తెలుగుదేశం ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు వెలుగులాంటి వాడైన స్వర్గీయ కింజారపు ఎర్రన్నాయుడి కుటుంబం నుంచి వచ్చిన కింజారపు అచ్చెన్నాయుడన్నా, రామ్మోహన్ నాయుడన్నా జగన్ కు భయమని దేవినేని ఎద్దేవాచేశారు. ఆరడుగులు అచ్చెన్నాయుడి రూపం, పదేపదే జగన్ కలలోకి కూడా వస్తోందని, ఆ రూపాన్ని తట్టుకోలేకనే, ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. 

అసెంబ్లీలో అచ్చెన్నాయుడిని చూసి భయపడే, జగన్ పదేపదే అతని రూపం గురించి మాట్లాడుతుంటాడన్నారు. అసెంబ్లీలో బడుగు, బలహీనవర్గాల గురించి మాట్లాడుతున్నాడన్న అక్కసుతోనే అచ్చెన్నాయుడిపై అవినీతి బురద జల్లాలని చూస్తున్నారన్నారు. ప్రధానమంత్రి ఆదేశాలతో టెలీహెల్త్ సేవలను కొనసాగిస్తే, దాన్ని తప్పుపడుతూ, పవిత్రమైన శివరాత్రి పర్వదినాన అచ్చెన్నాయుడిపై బురదజల్లాలని చూడటం, వైసీపీప్రభుత్వానికే చెల్లిందన్నారు. 

తనపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు గాను అసెంబ్లీ సాక్షిగా అచ్చెన్నాయుడు, జగన్ ప్రభుత్వాన్ని ఒక ఆట అడుకుంటాడన్నారు. లోకేశ్ ఆస్తులు ప్రకటన చేసి, సవాల్ విసిరితే, జగన్మోహన్ రెడ్డి ఎప్పటిలానే తోకముడిచాడన్నారు.