తల్లి పాలలోనూ ప్లాస్టిక్ | The Hidden Danger of Forever Chemicals (PFAS) on Human Health

Galam Venkata Rao  | Published: Jan 24, 2025, 2:59 PM IST

హానికరమైన ప్లాస్టిక్ రసాయనాలతో నిండిపోతున్న మనిషి శరీరం అవును... ఇందు కలదు, అందు లేదు అన్న సందేహమే లేదు. అంతటా ప్లాస్టిక్ ఆక్రమించేస్తోంది. చివరికి తల్లి పాలతో సహా..... PFAS- అని పిలిచే "పెర్ అండ్ పాలీఫ్లోరోఅల్కైల్ సబ్ స్టాన్స్ అనేహానికరమైన పదార్థం మానవ శరీరంలోకి ప్రవేశిస్తోంది. 1950ల నుండి ఈ PFAS పారిశ్రామిక ఉత్పత్తుల్లో విస్తృతంగా వినియోగంలోకి వచ్చింది. వాస్తవానికి ఇది వేలాది సింథటిక్ రసాయనాల సమూహం. ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఆహారం, తాగునీటిని కలుషితం చేస్తున్నాయి. తద్వారా మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కార్బన్ ఫ్లోరిన్ బంధం చాలా బలమైనది. PFAS కూడా ఇలాంటి రసాయన నిర్మాణాన్నే కలిగి ఉంది. ఈ బలమైన బంధం ఈ రసాయనాలు నీరు, వేడి వంటి వాటికి కూడా ప్రభావితం కాకుండా చేస్తుంది. దీంతో ఈ రసాయనాలు వాతావరణంలో చాలాకాలం అలాగే ఉంటాయి. అందుకే వీటిని "ఫరెవర్ కెమికల్స్" అని పిలుస్తారు. ఫరెవర్ కెమికల్స్ కి ఉన్న ఈ లక్షణాల కారణంగా ఫుడ్ ప్యాకేజింగ్, నాన్-స్టిక్ వంట సామాగ్రి, సౌందర్య సాధనాలు, వాటర్ ప్రూఫ్ దుస్తులు, అగ్నిమాపక పదార్థాలు, శీతలకరణి, పురుగుమందులు లాంటి అనేక రకాల ఉత్పత్తుల తయారీలో వినియోగిస్తున్నారు. ఈ రసాయనాలు ఆర్కిటిక్ నుంచి అంటార్కిటిక్ వరకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటి వల్ల పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం, గుడ్లు లాంటి అహార పదార్థాలతో పాటు తాగునీరు కూడా కలుషితం అవుతోంది. ఈ కెమికల్స్ మనిషి రక్త నమూనాలలో కూడా చేరాయి. ఇవి తల్లి ద్వారా కడుపులోని పిండానికి, తల్లిపాల ద్వారా సంతానానికి చేరుతున్నాయి. PFAS రసాయనాల కారణంగా క్యాన్సర్, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు... తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, వంధ్యత్వం పెరిగే అవకాశం ఉందని శాస్త్రీయ అధ్యయనాలు సూచించాయి. ఇంత హానికరమైన ఈ PFASలపై అవగాహన పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సౌందర్య సాధనాలు, అగ్నిమాపక ఫోమ్‌లు లాంటి కొన్ని ఉత్పత్తులలో ప్రత్యామ్నాయాలు ప్రవేశపెడుతున్నారు. ప్రభుత్వాలు కూడా PFSAల ఉత్పత్తిని నిషేధిస్తున్నాయి.