Pahalgam Attack: స్టాండ్ విత్ రఫా అన్నారు.. ఇప్పుడు అదే జరగాలి: పవన్ కళ్యాణ్

Share this Video

దేశ ప్రజలంతా ఉగ్రవాదంపై గళం విప్పాల్సిన సమయం వచ్చిందని, ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా కూకటివేళ్ళతో పెకిలించాల్సిన సమయం ఆసన్నం అయింద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాశ్మీర్ లో పరిస్థితులు చక్కబడుతున్న వేళ కావాలని కొన్ని మతవాద సంస్థలు అక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి రక్తపాతం సృష్టిస్తున్నాయన్నారు. కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన విశాఖపట్నం, పాండురంగాపురం వాసి చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... "పెహల్గాం ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దేశంలో ఎంతో ఐక్యమత్యంగా ఉన్న హిందువులు, ముస్లింల మధ్య గొడవలు రాజేసేందుకు ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. పెహల్గం ఘటన అత్యంత క్రూరమైనది. భార్య కళ్ళ ఎదురుగానే భర్తను కాల్చి చం*పుతుంటే వారి వేదన ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాధితుల కుటుంబాలతో మాట్లాడుతుంటే, వారి వేదన వింటే మాటలు రావడం లేదు. ఎన్నో ఆకాంక్షలు ఆశలతో జీవన ప్రయాణాన్ని సాగిస్తున్న వారి జీవితాల్లో ఈ ఘటన కల్లోలం రేపింది. కాశ్మీర్లో పర్యాటకుల మీద ఎప్పుడు ఇలాంటి దారుణమైన దుర్ఘటనలు జరగలేదు. దుశ్చర్యకు పాల్పడే సమయంలో ఉగ్రవాదులు బాధితుల మతం అడిగి హిందువా కాదా అని కాల్చి చంపడం అత్యంత హేయమైన చర్య. ఇలాంటి దారుణమైన సంఘటన జరిగిన సమయంలో దేశ ప్రజలందరూ ఒకే తాటి పైకి రావలసిన సమయం వచ్చింది. దేశ సమగ్రతను దెబ్బతీసేలా మతాల మధ్య గొడవలు పెట్టేలా ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్లు చేసిన, మాట్లాడినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని దేశ హోం మంత్రి అమిత్ షాని కోరుతున్నాను. దేశ విభజన సమయంలోను సుమారు మూడు లక్షల మంది హిందువులు మృతి చెందారు. అలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకూడదని కోరుకుంటున్నా. కాశ్మీర్లో ఉన్న మతవాద సంస్థలు పదేపదే అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. కాశ్మీర్ లో తెలుగు సినిమా షూటింగులు ఎక్కువగా జరిగేవి. నేను కూడా చాలాసార్లు అక్కడికి వెళ్లేవాడిని. చాలా అద్భుతమైన ప్రాంతం కాశ్మీర్. నేను అక్కడికి వెళ్లే సమయంలో కాశ్మీర్ పండిట్స్ పని చేసేవారు. వారు కూడా అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా మేమే ఇక్కడ ఉండలేకపోతున్నామని గోడు వెళ్ళబోసుకునేవారు. మీరు కూడా రావద్దు అని చెప్పేవారు. అయితే గత కొంతకాలంగా కాశ్మీర్లో పరిస్థితులు చక్కబడుతున్నాయి. అక్కడ పర్యాటకం కొత్త మెరుగులు దిద్దుకుంటుంది. ఇలాంటి సమయంలో కావాలనే కాశ్మీర్ పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు కొందరు ఉగ్రవాదులు ఇలా కుట్ర పన్నడం సహేతుకమైన చర్య కాదు. ఇలాంటి అమానవీయ పరిస్థితుల్లో దేశ ప్రజలంతా ఒకే మాటపై, ఒకే ఏకతాటి పైకి రావాలి" అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Related Video