Pahalgam Attack: దేశ భద్రతను దెబ్బతీయాలని చూసేవారి ఆటలు సాగవు: CM చంద్రబాబు

Share this Video

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత-భద్రత విషయంలో ఏకతాటిపైకి రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్ని విశాఖపట్నం వెళ్లి సందర్శించిన సీఎం చంద్రబాబు... నివాళులు అర్పించారు. చంద్రమౌళి మృతదేహంపై జాతీయ జెండా కప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందన్నారు. విహారయాత్రకు వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడులు జరిపారని.. మన రాష్ట్రానికి చెందిన SBI రిటైర్డ్ ఉద్యోగి చంద్రమౌళి, ఐటీ ఉద్యోగి మధుసూధన్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దేశ సమగ్రత, భద్రతను దెబ్బతీయాలని చూసే వారి ఆటలు సాగవని హెచ్చరించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జమ్మూ ఉగ్రదాడి నేపథ్యంలో విశాలమైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్ర భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. మేధావులు, ప్రజలు, వివిధ వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని... క్లిష్ట సమయంలో కేంద్రానికి పూర్తిగా సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు.

Related Video