
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు ధన్యవాదాలు
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదిలాబాద్ నుంచి విమాన సర్వీసులను ప్రారంభించేందుకు సానుకూలత వ్యక్తం చేయడం పట్ల హర్షం ప్రకటిస్తూ పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్ నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నిజాం కాలంలో సైనిక అవసరాల కోసం ఆదిలాబాద్ వద్ద ఎయిర్ స్ట్రిప్ నిర్మించడం జరిగింది. మామూనూరుతో పాటు ఆదిలాబాద్ నుంచి కూడా విమానాలను నడిపించాల్సిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో తన సహచర సభ్యులు కే.ఆర్.సురేష్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డిలతో పాటు పౌర విమానయాన మంత్రి రాంమోహన్ ను కలిసి వినతిపత్రమివ్వడం తెలిసిందే. ఆ తర్వాత ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో మాట్లాడుతూ, తెలంగాణలో ప్రస్తుతం శంషాబాద్ నుంచి మాత్రమే పౌర విమానాలు నడుస్తున్నాయని,మామూనూరులో పనులను మరింత వేగవంతం చేయాలని, కొత్తగూడెం, నిజామాబాద్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరడం తెలిసిందే.తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హయాంలో కూడా ఈ విమానాశ్రయాల ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరుతూ లేఖలు రాసిన విషయం విదితమే.బీఆర్ఎస్ ఎంపీలు నలుగురు తనను కలిసి విజ్ఞప్తి చేయడం, తర్వాత రవిచంద్ర సభలో మాట్లాడుతూ కోరడంతో మంత్రి నాయుడు సానుకూలంగా స్పందిస్తూ సంబంధిత అధికారులకు తగు ఆదేశాలిచ్చారు.దీంతో,ఆదిలాబాద్ నుంచి సర్వీసులు ప్రారంభించేందుకు భారత వాయుసేన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.పౌరవిమాన సేవలకు భారత వాయుసేన అనుమతినివ్వడంతో బీఆర్ఎస్ ఎంపీలు సంతోషం ప్రకటించారు.ఈ విమానాశ్రయాన్ని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ),భారత వాయుసేన (ఐఏఏఫ్)సంయుక్త ఉపయోగించుకుంటాయని సమాచారం.ఎయిర్‌పోర్ట్ రన్‌వే పునర్నిర్మాణాన్ని,టర్మినల్,మౌలిక వసతుల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టి ఆరు నెలలో పూర్తి చేయాల్సిందిగా మంత్రి రాంమోహన్ సంబంధిత అధికారులను ఆదేశించి సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల బీఆర్ఎస్ ఎంపీలు రవిచంద్ర, సురేష్ రెడ్డి, దామోదర్ రావు, పార్థసారథి రెడ్డిలు మంత్రి రాంమోహన్ నాయుడుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.