నన్ను పంజరంలో బంధించడం నీ తరం కాదు కేసీఆర్..: షర్మిల మాస్ వార్నింగ్
హైదరాబాద్ : తన పాదయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేయడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు.
హైదరాబాద్ : తన పాదయాత్రకు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేయడంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సీరియస్ అయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న షర్మిల బెడ్ పై నుండే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయకుండా కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ పాదయాత్రను అడ్డుకుంటున్నాడని అన్నారు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను టార్గెట్ చేశారన్నారు. తన పాదయాత్ర అనుమతి కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే లోటస్ పాండ్ చుట్టూ భారికేడ్లు, పోలీస్ బలగాలతో కర్ఫ్యూ విధించి సంఘీభావం తెలపడానికి వచ్చే నాయకులు, కార్యకర్తలను బందించి తీవ్రంగా కొట్టారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ఇవన్నీ భరిస్తూ తనకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణుల త్యాగాలను వైఎఎస్సార్ బిడ్డ ఎన్నటికీ మరువదు... ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానని షర్మిల అన్నారు. వైఎస్సార్ బిడ్డను పంజరంలో పెట్టి బందించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తోందని... ఇది కేసీఆర్ తరం కాదంటూ షర్మిల హెచ్చరించారు. ఎన్ని కుట్రలు చేసినా, నిర్బంధాలు సృష్టించినా వైఎస్సార్ సంక్షేమ పాలన తెలంగాణ ప్రజలకు అందించే వరకు తన పోరాటం ఆగదని షర్మిల అన్నారు.