ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి కాదు అధర్మారెడ్డి..: వైఎస్ షర్మిల ఎద్దేవా
హన్మకొండ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహాప్రస్థాన యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు.
హన్మకొండ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మహాప్రస్థాన యాత్రలో భాగంగా హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా రోడ్ షోలో షర్మిల మాట్లాడుతూ స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మీ ఎమ్మెల్యే ధర్మారెడ్డా లేక అధర్మారెడ్డా? అంటూ స్థానికులను షర్మిల ప్రశ్నించారు. మీ ఎమ్మెల్యే అక్షరాల రూ.5వేల కోట్లు సంపాదించాడటగా... ఈయన ఎమ్మెల్యే ముసుగులో వున్న బడా కాంట్రాక్టర్ అని ఓ జర్నలిస్ట్ చెప్పాడని అన్నారు. చిన్నది పెద్దది, ప్రత్యక్షంగా పరోక్షంగా... ఎలాగయినా, ఎలాంటి కాంట్రాక్ట్ అయినా ధర్మారెడ్డికి దక్కాల్సిందేనటగా... ఆయనకే లాభాలన్ని కావాలటగా... ఇలా డబ్బులే కాదు అధికార పిచ్చి కూడా మీ ఎమ్మెల్యేకు వుందటగా అంటూ షర్మిల ప్రజలను అడిగారు.
ఇక ఏదయినా భూమి మీద కన్ను పడిందంటే లేని సమస్య ఈయనే సృష్టించి... సెటిల్ మెంట్ కూడా ఈయనే చేసి తక్కువధరకే పోందుతాడటగా... అంత ఘటికుడగా మీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి అని షర్మిల అన్నారు. భూకబ్జాలకు పాల్పడి భూబకాసురుడయ్యాడటగా... అలాంటి కబ్జా భూములకు కూడా రోడ్లు ప్రభుత్వ డబ్బులతోనే వేయించుకుంటాడటగా అని అడిగారు. తెలంగాణ మొదటి స్పీకర్ ఊరికి రోడ్డు దుస్థితిని చూస్తేనే ఈ పాలనలో పరిస్థితి ఎలా వుందో అర్థమవుతుందని షర్మిల అన్నారు.