Asianet News TeluguAsianet News Telugu

మూడు వందల బతుకమ్మ చీరతో... మూడు తరాల పాపాలను కప్పేస్తారా..: కేసీఆర్ పై షర్మిల ధ్వజం

నర్సాపూర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

నర్సాపూర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బతుకమ్మ పండగ కోసం తెలంగాణ ఆడపడుచులకు కేవలం మూడు వందల చీర ఇచ్చి మూడు తరాలకు చేసిన అన్యాయాన్ని కప్పేసుకోమంటున్నారని అన్నారు. మహిళలకు చీరలివ్వడం కాదు వారికిచ్చిన వాగ్దానాల్లో ఒక్కటయినా నిలబెట్టుకున్నారా? అని షర్మిల ప్రశ్నించారు. మహిళా సంఘాలకు ఇస్తానన్న సున్నా వడ్డీ రుణాల మోసాన్ని కప్పిపుచ్చుకోడానికే ఈ బతుకమ్మ చీరలు పంచుతున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఇచ్చే దొడ్డుబియ్యం కుక్కలు కూడా తినవని చాలామంది చెబుతున్నారు... ఆ పాపం కప్పేసుకోడానికే బతుకమ్మ చీరలు ఇస్తున్నారన్నారని షర్మిల అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొనసాగుతున్న వైఎస్ షర్మిల మహప్రస్థాన పాదయాత్ర నర్సాపూర్ నియోజకవర్గానికి చేరుకుంది. ఇక్కడ జరిగిన సభలో షర్మిల మాట్లాడుతూ... మహిళలపై అఘాయిత్యాల్లో తెలంగాణ దక్షిణాదిలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. ఇలాంటి పరిస్థితికి తెలంగాణను దిగజార్చిన కేసీఆర్ ఉరేసుకుని చనిపోవాలి కదా... కానీ ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోడానికే బతుకమ్మ చీరలు పంచుతున్నాడని అన్నారు. ఈ చీరలు చూసి మురిసిపోకండి... ఎన్నికల సమయంలో పట్టచీరలు కూడా ఇస్తాడు... ఇదంతా చేస్తుంది మీ డబ్బులతోనే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని షర్మిల సూచించారు.