పెద్దపల్లిలో శివారులో ఘోరం... రైలు పట్టాలపై తెగిపడ్డ యువకుడి రెండు కాళ్లు
పెద్దపల్లి : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు.
పెద్దపల్లి : కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే యువకుడి రెండు కాళ్లు రైలు పట్టాలపై తెగిపడి వికలాంగుడిగా మారిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పెద్దపల్లి పట్టణానికి చెందిన చిగురు ఓదేలు మద్యానికి బానిసై నిత్యం కుటుంబసభ్యులతో గొడవపడుతుండేవాడు. ఇలా మద్యంమత్తులో ఇంట్లోవారితో గొడవపడ్డ యువకుడు ఆవేశంలో రైలుకిందపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే పెద్దపల్లి శివారులోని కూనారం రైల్వే గేట్ సమీపంలో పట్టాలపైకి చేరుకున్న ఓదేలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే అతడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డా రెండు కాళ్లు మాత్రం రైలుకింద చిక్కుకుని తెగిపడ్డాయి. అతడి ఆర్థనాదాలు విన్న స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు 108 అంబులెన్స్ లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమచికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఓదేలు పరిస్థితి మెరుగ్గానే వున్న రెండు కాళ్లు తెగిపడి వికలాంగుడిగా మారినట్లు డాక్టర్లు తెలిపారు.