మనీ పర్స్ దొరికిందని ఆనందం... క్షణాల్లోనే ఆవిరి : సైబర్ నేరాలపై పోలీసుల సరికొత్త ప్రచారం
హైదరాబాద్ : రోడ్డుపై వెళుతున్నపుడు ఎవరైనా కరపత్రాలు(పాంప్లెట్స్) పంచుతుంటే పట్టించుకోకుండా వెళ్లిపోతాం...
హైదరాబాద్ : రోడ్డుపై వెళుతున్నపుడు ఎవరైనా కరపత్రాలు(పాంప్లెట్స్) పంచుతుంటే పట్టించుకోకుండా వెళ్లిపోతాం... తీసుకున్నా అందులో ఏముందో చూడకుండానే పడేస్తాం. కానీ తెలంగాణ పోలీసులు పంపిణీచేసే కరపత్రాలను కిందపడేసినా తీసుకుంటున్నారు. సైబర్ నేరాలు ఎక్కువ కావడంతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగా తెలంగాణ
సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం చేపట్టారు. అచ్చం మనీ పర్స్ మాదిరిగానే వుండే పాంప్లెట్స్ ముద్రించి సైబర్ నేరాలపై ఏర్పాటుచేసిన 1930 నంబర్ పై అవగాహన కల్పిస్తున్నారు. ఊరికే డబ్బులు ఎవరికీ రావు... ఈ పర్స్ లాగే ఏదో ఆశచూపించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని సందేశం ఇస్తున్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. అసలేదో, నకిలీ ఏదో గుర్తించి జాగ్రత్తగా వుండాలని ప్రజలకు సూచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో డబ్బులతో కూడిన మనీ పర్స్ పాంప్లెట్స్ వేసి ప్రజల స్పందనను తెలుసుకున్నారు పోలీసులు. నిజంగానే డబ్బులు దొరికాయని పర్స్ తీసుకుని తెరిచిచూస్తున్నవారి స్పందనను రికార్డ్ చేస్తున్నారు. ఈ వీడియోలు ఫన్నీగా వుండటంతో మీమర్స్ వాటిని వాడుకుంటున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.