నిజామాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడి హత్యకు కుట్ర... జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి సీరియస్
హైదరాబాద్ : నిజామాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హత్యకు జరిగిన కుట్రను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు.
హైదరాబాద్ : నిజామాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హత్యకు జరిగిన కుట్రను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. ఇవాళ (బుధవారం) హైదరాబాద్ బంజారాహిల్స్ లోని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లిన మంత్రి ప్రశాంత్ ఎమ్మెల్యేను పరామర్శించారు. జీవన్ రెడ్డిని అడిగి హత్యకు జరిగిన కుట్ర గురించి మంత్రి తెలుసుకున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడవద్దంటూ ఎమ్మెల్యేకు మంత్రి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో యాక్టివ్ గా వుంటూ నిరంతరం ప్రజల్లో వుండే జీవన్ రెడ్డి హత్యాయత్నం హేయమైన చర్యగా మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటివద్ద మారణాయుధాలతో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. అతడి వద్ద ఓ పిస్టల్, మరో కత్తిని పోలీసులు గుర్తించారు. ఆర్మూర్ నియోజకవర్గానికే చెందిన కిల్లెడ గ్రామ సర్పంచ్ లావణ్యను ఇటీవల సస్పెన్షన్ కు గురయ్యారు. ఇందుకు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారణమని భావించిన ఆమె భర్త ప్రసాద్ గౌడ్ హత్యకు కుట్ర పన్నినట్లు సమాచారం.