హైదరాబాద్ లో పర్యావరణ హిత వినాయక నవరాత్రులు... మంత్రి తలసాని మట్టి విగ్రహాల పంపిణీ
హైదరాబాద్ : పర్యావరణానికి హాని కల్గించకుండానే ఆ ఆదిదేవుడు వినాయకున్ని పూజించుకునే సదవకాశాన్ని హైదరాబాద్ వాసులకు కల్పిస్తోంది జిహెచ్ఎంసి.
హైదరాబాద్ : పర్యావరణానికి హాని కల్గించకుండానే ఆ ఆదిదేవుడు వినాయకున్ని పూజించుకునే సదవకాశాన్ని హైదరాబాద్ వాసులకు కల్పిస్తోంది జిహెచ్ఎంసి. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రమాదకర పెయింట్స్, రసాయనాలతో తయారుచేసే వినాయక విగ్రహాలతో కాకుండా సహజసిద్దమైన మట్టి గణపతులనే పూజించాలంటూ జిహెచ్ఎంసి క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. ఇలా కేవలం ప్రచారమే కాదు స్వయంగా మట్టి గణపతి విగ్రహాలను తయారుచేసి హైదరాబాదీలకు ఉచితంగా అందించే అద్భుత కార్యక్రమాన్ని చేపట్టింది జిహెచ్ఎంసి. ఇలా జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో మట్టిగణపతుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్ పార్క్ లో మంత్రి మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణలో మన వంతుగా మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దామని నగరవాసులకు సూచించారు. ఇందుకోసం జిహెచ్ఎంసి 6 లక్షల మట్టి గణపతి విగ్రహాల పంపిణీకి సిద్దంగా వుందన్నారు. ఈ విగ్రహాల పంపిణీ కోసం నగరంలోని సర్కిల్స్ వారిగా అధికారులను నియమించినట్లు మంత్రి తలసాని తెలిపారు.