ఈ మూన్నేళ్లు దాన్ని దూరంపెట్టి కష్టపడండి... ప్రభుత్వ ఉద్యోగం మీదే: యువతకు కేటీఆర్ సలహా
సిరిసిల్ల: ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలంటే వచ్చే మూడు నాలుగు నెలలు మొబైల్ ఫోన్ ను దూరం పెట్టాలని ఐటీ మంత్రి కేటీఆర్ నిరుద్యోగ యువతకు సూచించారు.
సిరిసిల్ల: ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందాలంటే వచ్చే మూడు నాలుగు నెలలు మొబైల్ ఫోన్ ను దూరం పెట్టాలని ఐటీ మంత్రి కేటీఆర్ నిరుద్యోగ యువతకు సూచించారు. మూడు నెలలు ప్రణాళిక బద్దంగా కష్టపడి చదివితే ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చని సూచించారు. కొత్తగా 80 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియ కొనసాగుతోందని... ఈ అద్భుత అవకాశాన్ని వదిలిపెట్టకూడదని యువతీ యువకులకు కేటీఆర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా సొంత నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంత్రి పరిశీలించారు. ఈ క్రమంలోనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... స్వరాష్ట్రం ఏర్పాటైన నుంచి ఇప్పటి వరకూ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలలో 1 లక్షా 32 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఇప్పుడు ఒకేసారి భారీ ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామన్నారు. అపజయం ఎదురైతే బేజారు కావొద్దు... జీవితం చాలా పెద్దదన్నారు. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకుంటే ప్రైవేట్ రంగంలో ఎన్నో అవకాశాలు లభిస్తాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.