సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగానే యువకుడి ఆత్మహత్యాయత్నం...పెద్దపల్లి సభలో కలకలం
పెద్దపల్లి : అధికార టీఆర్ఎస్ పార్టీ సోమవారం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.
పెద్దపల్లి : అధికార టీఆర్ఎస్ పార్టీ సోమవారం పెద్దపల్లి జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఓ యువకుడి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో వెంటతెచ్చుకున్న కిరోసిన్ ను అందరూ చూస్తుండగానే ఒంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడో యువకుడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడు నిప్పంటించుకోకుండా అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట గ్రామానికి చెందిన పెరుమాండ్ల రమేష్ బిఈడి పూర్తిచేసినా ఉద్యోగం రాకపోవడంతో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇటీవల కళాకారుడైన అతడి తండ్రి మల్లయ్య మృతిచెందగా ఇది తట్టుకోలేక తల్లికి పక్షపాతం వచ్చింది. దీంతో తన కుటుంబం రోడ్డున పడిందని రమేష్ వాపోయాడు. తనకు సీఎం సహాయనిధి కింద ఆర్థిక సాయం చేయడంతో పాటు ప్రభుత్వం తరపున ఏదయినా చిన్న ఉద్యోగం కల్పించాలంటూ కేసీఆర్ కు వినతిపత్రం ఇచ్చేందుకు రమేష్ ప్రయత్నించాడు. అయితే సీఎంను కలిసే అవకాశం రాకపోవడంతో సీఎం ప్రసంగ సమయంలో రమేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.