కేసీఆర్ హయాంలో... కొండా లక్ష్మణ్ బాపూజీ కల కలగానే మిగిలింది..: ఈటల రాజేందర్
నల్గొండ : తెలంగాణ ఉద్యమకారుడు, స్వరాష్ట్ర సాధనకై ఆనాడే మంత్రిపదవిని త్యాగం చేసిన నికార్సయిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజి జయంతి వేడుకలను నల్గొండ జిల్లాలో బిజెపి ఘనంగా నిర్వహించింది.
నల్గొండ : తెలంగాణ ఉద్యమకారుడు, స్వరాష్ట్ర సాధనకై ఆనాడే మంత్రిపదవిని త్యాగం చేసిన నికార్సయిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజి జయంతి వేడుకలను నల్గొండ జిల్లాలో బిజెపి ఘనంగా నిర్వహించింది. నల్గొండ పట్టణంలో స్థానిక బిజెపి శ్రేణులు చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. అనంతరం పద్మనగర్ కాలనీలో కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈటల. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... దోపిడీ, నిరంకుశత్వం లేని తెలంగాణ కోసం కొండా లక్ష్మణ్ బాపూజీ కల కన్నారని గుర్తుచేసారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ కేసీఆర్ హయాంలో బాపూజీ కల కలగానే మిగిలిందన్నారు. కేసిఆర్ పాలనలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని... ఈ ఎనిమిదేళ్లలో తాగి తాగి 6,80,000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజల బ్రతుకులు గొర్రె తోక బెత్తెడులా ఉన్నాయన్నారు. కాబట్టి ప్రజలంతా మరోసారి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధనకోసం పని చేయాల్సిన అవసరం వుందని ఎమ్మెల్యే ఈటల పేర్కొన్నారు.