ఇబ్రహీంపట్నం ఘటనపై మంత్రి హరీష్ సీరియస్... నిమ్స్ లో బాధిత మహిళలకు పరామర్శ
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ వికటించి ఇప్పటికే నలుగురు మహిళలు మృతిచెందడంతో అప్రమత్తమైన ప్రభుత్వం 30 మంది మహిళల్లో 17మందిని నిమ్స్ కు, 13 మందిని అపోలో హాస్పిటల్ కు తరలించారు. ఇలా నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. బాధిత మహిళల వద్దకు వెళ్లి వారికి అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే డాక్టర్లతో మహిళల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా తీసారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... ఇబ్రహీంపట్నం ఘటనలో చనిపోవడం దురదృష్టకరం, బాధాకరమని అన్నారు. ఈ సంఘటన తమ దృష్టికి రాగానే అన్ని చర్యలు తీసుకున్నామని... వెంటనే కొందరు మహిళలను అపోలోకు, మరికొందరిని నిమ్స్ కు తరలించి చికిత్స అందించామన్నారు. ప్రస్తుతం మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంతో వున్నారని... రెండు మూడు రోజుల్లో అందరూ డిశ్చార్జి అవుతారన్నారు. ఈ ఘటనపై తాము రాజకీయాలు చేయాలనుకోవడం లేదని... మహిళల ప్రాణాలు కాపాడటమై ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీష్ పేర్కొన్నారు.