Asianet News TeluguAsianet News Telugu

కుక్క కోసం సిగపట్లు: పక్కింటి వారిని కొట్టిన కాంగ్రెస్ నేత

కుక్క అపరిశుభ్రం చేస్తోందని పక్కింటి వ్యక్తి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సందీప్ పట్టించుకోలేదు. దీంతో వారు మంగళవారం ఉదయం సందీప్‌ను నిలదీశారు. తననే నిలదీస్తారా అంటూ సందీప్ పక్కింటి మహిళలను విచక్షణారహితంగా కొట్టాడు.

ఆస్తుల కోసమో, డబ్బు కోసమో , అమ్మాయి కోసమో కొట్టుకోవడం మనం చూశాం కానీ ఓ కుక్క కోసం రెండు కుటుంబాలు కొట్టుకోవడం మీరెప్పుడైనా చూశారా. వివరాల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సందీప్ పెంపుడు కుక్క పక్కింట్లోకి చొరబడి అపరిశుభ్రం చేస్తోంది.

తమ ఇంటి ముందు పరిసరాలను కుక్క అపరిశుభ్రం చేస్తోందని పక్కింట్లో ఉంటున్న పేరిక కల్పన, మేడిపల్లి లక్ష్మీకస్తూరిలు పలుమార్లు సందీప్ కుటుంబసభ్యులకు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వీరి విజ్ఞప్తిని సందీప్ కుటుంబం పట్టించుకోలేదు.

ఈ క్రమంలో సోమవారం సదరు కుక్క మరోసారి కల్పన ఇంట్లోకి ప్రవేశించి అపరిశుభ్రం చేసింది. దీంతో వారు మరోసారి సందీప్‌ను నిలదీశారు. తననే నిలదీస్తారా అంటూ సందీప్ మహిళలను విచక్షణారహితంగా కొట్టాడు.

మహిళలు కూడా ఒకరినొకరు జుట్టుపట్టుకుని కలబడ్డారు. స్ధానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వారు వినలేదు. ఈ గొడవను మహిళలకు చెందిన కుటుంబసభ్యుల్లో ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్ అయ్యింది.

కాగా, గాయపడిన మహిళలు స్థానికుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి సందీప్‌‌ను అదుపులోకి తీసుకున్నారు