Asianet News TeluguAsianet News Telugu

ఎస్సై వేధింపులే కారణమంటూ ... జగిత్యాల యువరైతు సెల్ఫీ సూసైడ్ అటెంప్ట్

జగిత్యాల : న్యాయం చేస్తాడని నమ్మి భారీగా లంచమిచ్చిన పోలీసే తనను మోసం చేసాడంటూ ఓ రైతు సెల్ఫీ వీడియో చిత్రీకరించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

First Published Nov 24, 2022, 12:07 PM IST | Last Updated Nov 24, 2022, 12:07 PM IST

జగిత్యాల : న్యాయం చేస్తాడని నమ్మి భారీగా లంచమిచ్చిన పోలీసే తనను మోసం చేసాడంటూ ఓ రైతు సెల్ఫీ వీడియో చిత్రీకరించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో యువ రైతు సూసైడ్ వీడియోను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆదారంగా ఆచూకీని గుర్తించి ప్రాణాలు కాపాడారు. ఆత్మహత్యకు గల కారణాలను బాధితుడు బయటపెట్టారు. ప్రభుత్వం పంపిణీ చేసిన 20గుంటల అసైన్డ్ భూమిని కొందరు కబ్జా చేసారని జగిత్యాల జిల్లా బలవంతపూర్ గ్రామానికి చెందిన నక్కా అనిల్ తెలిపాడు. దీంతో తనకు న్యాయం చేయాలని మాల్యాల ఎస్సై చిరంజీవిని సంప్రదించగా రూ.3లక్షలు ఇస్తే సమస్యను పరిష్కరించి భూమి దక్కేలా చేస్తానని హామీ ఇచ్చాడన్నాడు. అతడి మాటలు నమ్మి రూ.3లక్షలు ఇచ్చానని... అయినా తన భూమి దక్కకపోవడంతో ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని ఎస్సైని కోరానని అనిల్ అన్నాడు. ఇలా డబ్బులు తిరిగివ్వాలని అడిగానన్న కక్ష్యతో ఎస్సై తనపై అక్రమ కేసులు బనాయించి రౌడీ షీట్ ఓపెన్ చేసాడని... పిడి యాక్ట్ కూడా పెడతానని బెదిరించాడని బాధితుడు తెలిపాడు. ఈ వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రైతు అనిల్ వివరించారు. దయచేసి తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ తెలంగాణ డిజిపి, కరీంనగర్ సిపి, జగిత్యాల ఎస్పీని కోరాడు.