మునుగోడులో బిజెపి ఓటమి... కోమటిరెడ్డి రాజగోపాల్ ఇంటికి ఈటల రాజేందర్
నల్గొండ : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరి మునుగోడు ఉపఎన్నికలో పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమిని చవిచూసారు.
నల్గొండ : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరి మునుగోడు ఉపఎన్నికలో పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓటమిని చవిచూసారు. ఈ ఉపఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అధికార టీఆర్ఎస్ పార్టీని దీటుగా ఎదుర్కొన్నా చివరకు ఓటమి తప్పలేదు. నిన్న వెలువడిన మునుగోడు ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పదివేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఓటమిపాలై రెండో స్థానానికి పరిమితమైన కోమటిరెడ్డిని మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కలిసారు. మునుగోడు ఉపఎన్నిక పూర్తిఫలితం వెలువడిన తర్వాత ఈటలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితర బిజెపి నాయకులు కోమటిరెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఉపఎన్నికలో వచ్చిన ప్రతికూల ఫలితంపై చర్చించిన బిజెపి నాయకులు నైతిక విజయం తమదేనని పేర్కొన్నారు. ఈ ఉపఎన్నిక ఓటమిపై బిజెపి నాయకులమంతా భేటీ అయి సమీక్షించుకుంటామని ఈటల, కోమటిరెడ్డి తెలిపారు.