జగిత్యాలలో అమానుషం... కన్నకూతుర్నే కిడ్నాప్ చేసి గుండుగీయించి చిత్రహింసలు
జగిత్యాల : తమకు ఇష్టంలేకున్నా లవ్ మ్యారేజ్ చేసుకుందని కన్నకూతురిని తల్లిదండ్రులే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది.
జగిత్యాల : తమకు ఇష్టంలేకున్నా లవ్ మ్యారేజ్ చేసుకుందని కన్నకూతురిని తల్లిదండ్రులే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన జగిత్యాల జిల్లాలో వెలుగుచూసింది. అయితే పోలీసులు రంగంలోకి దిగడంతో ఈ కిడ్నాప్ కథ సుఖాంతమయ్యింది. యువతి ఆఛూకీ గుర్తించిన పోలీసులు ఆమెను సురక్షితంగా భర్త వద్దకు చేర్చారు.
వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా బాలపల్లికి చెందిన జక్కుల మధు (23), ఇటిక్యాలకు చెందిన అక్షిత (20) భార్యాభర్తలు. యువతి కుటుంబసభ్యులు వీరి ప్రేమకు అంగీకరించకపోవడంతో ఆర్నెళ్ల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. దీంతో కోపంతో రగిలిపోయిన యువతి తల్లిదండ్రులు గత ఆదివారం కన్న కూతురినే కిడ్నాప్ చేసారు. అత్తింటివారిని మారణాయుధాలతో బెదిరించి కూతుర్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని హైదరాబాద్ కు తరలించారు. అక్కడ ఆమెను బంధించి చిత్రహింసలకు గురిచేయడమే కాదు గుండుగీయించి దారుణంగా వ్యవహరించారు. తన భార్యను ఆమె తల్లిదండ్రులు కిడ్నాప్ చేసారంటూ భర్త మధు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు తమ స్టైల్లో దర్యాప్తు జరిపి ఆచూకీ కనుక్కున్నారు. దీంతో భార్యాభర్తలిద్దరూ తిరిగి ఒక్కటయ్యారు.