కొమ్ము కోయ కళాకారులతో కలిసి డ్యాన్సు చేసిన రాహుల్ గాంధీ

భారత్ జోడో యాత్ర లో భాగంగా, ఖమ్మం జిల్లా ఆదివాసీలు ప్రదర్శించిన కొమ్ము కోయ డ్యాన్స్ ను రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ పాదయాత్రలో ఆసక్తిగా తిలకించాడు. 

First Published Oct 29, 2022, 3:08 PM IST | Last Updated Oct 29, 2022, 3:08 PM IST

భారత్ జోడో యాత్ర లో భాగంగా, ఖమ్మం జిల్లా ఆదివాసీలు ప్రదర్శించిన కొమ్ము కోయ డ్యాన్స్ ను రాహుల్ గాంధీ మహబూబ్ నగర్ పాదయాత్రలో ఆసక్తిగా తిలకించాడు. స్త్రీ,  పురుషులు కలసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే కొమ్ము కోయ ప్రదర్శనలో కళాకారులతో కలిసి రాహుల్ కూడా అడుగులు వేస్తూ ఉత్సాహ పరిచాడు."ఖమ్మంతోపాటు ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండాకోనల్లో నివసించే ఆదివాసీలు తమదైన శైలిలో అనేకానేక కళారూపాలను సృష్టించారు. వాటిలో ‘కొమ్ము కోయ నృత్యం’ ప్రత్యేకమైంది, సృజనాత్మకమైంది.  అడవి దున్న కొమ్ములు, నెమలీకల కలబోతతో.. అసలైన అందానికి అద్దం పడుతుంది. తలమీద ఎద్దు/ అడవి దున్న కొమ్ములతో చేసిన కిరీటం, దాని పైన నెమలి పింఛాలు ధరించి, మెడలో పెద్ద డోలు వేసుకొని చేసే ఈ నృత్య రూపకాన్ని ‘కొమ్ము డోలు’ అని కూడా వ్యవహరిస్తారు. పురుషులు కలసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే ప్రదర్శన అయినప్పటికీ, పురుషుల నృత్య పద్ధతి, స్త్రీల నృత్య పద్ధతికి కొంత వ్యత్యాసం ఉంటుంది. పురుషులు ప్రత్యేకమైన వస్త్రధారణతో డోళ్లను లయబద్ధంగా వాయిస్తూ, అడుగులో అడుగులు వేసుకుంటూ నృత్యం చేస్తారు. ఈ ప్రదర్శనను ‘పెర్మికోర్‌’ అని పిలుస్తారు. మహిళలు ఆకుపచ్చ చీరలు ధరించి, కొప్పులో పూలు పెట్టుకొని ఒకరిచేతులు ఒకరు పట్టుకొని ‘రేల’ పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దీనిని ‘రేలా నృత్యం’'' అని వ్యవహరిస్తారు.