ఐటీ మంత్రి ఇలాకాలో హైటెక్ పద్దతిలో లంచాలు... రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వ్యవసాయాధికారి

సిరిసిల్ల: లాభమో నష్టమో వ్యవసాయం మాత్రమే వారికి తెలుసు...

First Published Jun 6, 2022, 10:22 AM IST | Last Updated Jun 6, 2022, 10:22 AM IST

సిరిసిల్ల: లాభమో నష్టమో వ్యవసాయం మాత్రమే వారికి తెలుసు... భూతల్లినే నమ్ముకుని రాత్రనక పగలనక కష్టపడుతుంటారు. తన నోట్లోకి నాలుగువేళ్లు వెల్లకపోయిన నలుగురికీ అన్నంపెట్టి అన్నదాతగా గొప్పపేరు సంపాదించుకున్నారు. ఇలాంటి రైతన్నలను కొందరు అవినీతి, లంచగొండి అధికారులు డబ్బుల కోసం వేధించిన ఘటనలు అనేకం వెలుగుచూసాయి. తాజాగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ సొంత జిల్లా రాజన్న సిరిసిల్లలో ఇలాగే ఓ ప్రభుత్వాధికారి రైతన్న నుండి లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయ్యాడు. తంగళ్లపల్లి మండల తాడూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారి అజిజ్ ఖాన్ ఒక్కోపనికి ఒక్కో రేటు పెట్టుకుని రైతుల నుండి లంచాలు తీసుకుంటున్నాడు. రైతులు పండించిన పంటను ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలంటే ఒక్కో పాస్ బుక్ కు రూ.500 లంచం ఇవ్వాల్సిందే. లేదంటే పనికాదని డైరెక్ట్ గా చెప్పేస్తాడు. ఇలా ఓ రైతు నుండి రూ.500వందలు హైటెక్ పద్దతిలో లంచంగా స్వీకరిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. లంచాన్ని గూగుల్ పే లేదా పోన్ పే చేయాలంటూ రైతును డిమాండ్ చేసిమరి అజీజ్ ఖాన్ లంచం స్వీకరించాడు. ఆయన మాటలు వింటే కొందరు ప్రభుత్వ అధికారులు లంచాలకు ఎంతలా మరిగారో అర్థమవుతుంది.