కోయంబత్తూరు కారు పేలుడు ఘటనలో ట్విస్ట్... మృతుడి ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు
తమిళనాడు కోయంబత్తూరులో కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి.
తమిళనాడు కోయంబత్తూరులో కారు పేలుడు ఘటనలో సంచలన విషయాలు బయటపడ్డాయి. తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డుపై వెళుతున్న కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించి జమేషా ముబీన్ మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు కీలక సమాచారాన్ని గుర్తించారు. శనివారం రాత్రి ముబీన్ తో పాటు మరో నలుగురు అనుమానాస్పద వస్తువులను కారులోంచి ఇంట్లోకి తరలించినట్లు సిసి కెమెరాలో రికార్డయ్యింది. దీంతో మృతుడు ముబీన్ ఇంట్లో తనిఖీ చేయగా భారీగా పేలుడు పదార్థాలు లభించినట్లు తమిళనాడు డిజిపి శైలేంద్ర బాబు వెల్లడించారు. ముబీన్ నివాసంలో పొటాషియం నెట్రేట్, అల్యూమీనియం పౌడర్, సల్పర్ మరియు చార్కోల్ వంటి పేలుడు పదార్థాలను గుర్తించినట్లు డిజిపి తెలిపారు. దీన్నిబట్టి చూస్తే బాంబుల తయారీకి ఈ పేలుడు పదార్థాలను సేకరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి సిసి కెమెరాలో కనిపించిన నలుగురిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.