భరతమాత బానిస సంకెళ్లు తెంచేందుకు ఉరి కొయ్యలను ముద్దాడిన రాజ్ గురు

భారత దేశ స్వతంత్రం సంగ్రామంలో రెండు రకాల పోరాటాలు మనకు ముఖ్యంగా కనిపిస్తాయి. ఒక‌టి గాంధీజీ న‌మ్మిన శాంతియుత పోరాటం కాగా.. 

First Published Jul 13, 2022, 1:20 PM IST | Last Updated Jul 13, 2022, 1:20 PM IST

భారత దేశ స్వతంత్రం సంగ్రామంలో రెండు రకాల పోరాటాలు మనకు ముఖ్యంగా కనిపిస్తాయి. ఒక‌టి గాంధీజీ న‌మ్మిన శాంతియుత పోరాటం కాగా.. మ‌రొకటి అహింసాయుత పోరాటం. వీరినే అతివాదులు, మిత‌వాదులు అంటారు. ఈ రెండు వ‌ర్గాల అంత‌మ ల‌క్ష్యం ఒక్క‌టే. అదే దేశం నుంచి బ్రిటీష్ తెల్ల‌దొర‌ల‌ను పార‌దోల‌డం. దీని కోసం ఎవ‌రి మార్గంలో వారు ప్ర‌యాణించాడు. అతివాదుల్లో భ‌గ‌త్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల‌ను ముఖ్యులుగా చెప్పుకుంటారు. రాజ్ గురు మహారాష్ట్రలోని భీమా నది ఒడ్డున ఉన్న ఖేడ్ వద్ద ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. హరినారాయణ్ రాజగురువు, పార్వతి దేవి ఆయ‌న తల్లిదండ్రులు. చాలా మంది యువ జాతీయవాదుల మాదిరిగా రాజ్ గురు గాంధీజీ పాటించే అహింసాయుత పోరాటాన్ని విశ్వసించలేదు. బ్రిటీష్ వారిని త‌రిమికొట్టాలంటే సాయుధ తిరుగుబాటే స‌రైంద‌ని న‌మ్మారు. ఒకవేళ బ్రిటీషు సైన్యానికి దొరికిపోతే వారి చిత్రహింస‌ల‌ను త‌ట్టుకోవడానికి శ‌రీరాన్ని సిద్ధం చేసుకునేందుకు క‌ఠిన ప‌రీక్ష‌ల‌ను ఎదుర్కొన్నాడు. దీని కోసం మండుతున్న ఇనుప చువ్వ‌ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టుకునేవారు. అనేకమంది సాహసోపేత యువకుల్లాగే రాజ్ గురు కూడా భగత్ సింగ్ హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ లో చేరారు. ఆ సంస్థలో రాజ్ గురును రఘునాథ్ గా పిలిచేవారు. లాలా  లజపతిరాయ్ మ‌ర‌ణంతో భగత్ సింగ్, రాజ్ గురు వంటి రాడికల్ జాతీయవాదులు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీకి నాయకత్వం వహిస్తున్నప్పుడు రాయ్ పై పోలీసులు భారీగా దాడి చేశారు. వీటి వ‌ల్ల కొన్ని రోజుల‌కు ఆయ‌న మ‌ర‌ణించారు. ఆయ‌న మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి రాజ్ గురు భగత్ సింగ్, సుఖ్ దేవ్ లతో కలిసి జాన్ సాండర్స్ అనే పోలీసు అధికారిని హత్య చేశాడు. దీంతో భగత్ సింగ్ తో పాటు ఆయ‌న‌ సహచరులకు మరణశిక్ష విధించారు. అయితే వారి విచారణ దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. కాంగ్రెస్ పార్టీ కూడా వీరి ఉరి శిక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని తీర్మానించారు. గాంధీ, జిన్నా, అంబేడ్కర్ వంటి నాయకులు కూడా వ్యక్తిగతంగా వారి శిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కానీ బ్రిటీష్ అధికారులు దీనికి ఒప్పుకోలేదు. చివ‌రికి ఆ దేశ భ‌క్తుల‌ను 1931 మార్చి 23న లాహోర్ జైలులో ఉరితీశారు.