Asianet News TeluguAsianet News Telugu

ఆంగ్లేయుల వెన్నులో వణుకు పుట్టించిన సంతాల్ తిరుగుబాటు

మొదటి భారత స్వాతంత్య్ర‌ యుద్ధానికి రెండు సంవత్సరాల ముందు అంటే 1855లో దేశంలోని ఆదివాసీలు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించిన చారిత్రాత్మక పోరాటం సంతాల్ తిరుగుబాటు.

First Published Jul 16, 2022, 12:27 PM IST | Last Updated Jul 16, 2022, 12:27 PM IST

మొదటి భారత స్వాతంత్య్ర‌ యుద్ధానికి రెండు సంవత్సరాల ముందు అంటే 1855లో దేశంలోని ఆదివాసీలు బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించిన చారిత్రాత్మక పోరాటం సంతాల్ తిరుగుబాటు. అడ‌వి బిడ్డ‌ల హ‌క్కులు, జీవ‌నోపాధి, మాతృభూమి కోసం.. బ్రిటిష్ అణ‌చివేత‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించి చ‌రిత్ర‌లో నిలిచారు.  విశాలమైన సంతాల్ అరణ్యాలు నేటి జార్ఖండ్‌, బీహీర్‌, ఒడిశా, బెంగాల్ మీదుగా  నాలుగు రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. నేటికీ తమ హక్కులను కాపాడుకునేందుకు ఆదివాసీలు చేస్తున్న పోరాటాలకు సాక్షిగా నిలిచే ఉద్య‌మ ప్రాంతాల‌వి. సంతాల్ లు అట‌వీ ప్రాంతాల‌పై ఆధారప‌డి జీవనం సాగిస్తుంటారు. అయితే, ఆంగ్లేయులు తీసుకువచ్చిన కొత్త శాశ్వత పరిష్కార చట్టం సంతాల్ తిరుగుబాటుకు దారితీసింది. గిరిజనులను వారి స్వంత అటవీ భూముల నుండి బలవంతంగా తొలగించడానికి అన్ని భూములను వేలం వేయడానికి ఈ చట్టం బ్రిటిష్ వారికి సహాయపడింది. సంతాల్ ల స్వంత అటవీ వనరులను ఉపయోగించుకోవడానికి అనుమతి నిరాకరించబడింది. అక్క‌డి అట‌వీ భూముల‌ను ఈస్టిండియా కంపెనీ స్వాధీనం చేసుకునేందుకు అడవులను రిజర్వ్‌గా ప్రకటించారు. మిగిలిన సంతాల్ భూమిని జమీందార్లకు వేలం వేశారు. జీవనోపాధిని, మాతృభూమిని కోల్పోయిన సంతలు ఒక్కటయ్యారు. సంతాల్ తిరుగుబాటును ప్రారంభించారు. దీనికి సిద్ధు, కన్హు, చంద్, భైరవ్ ల‌తో పాటు వారి సోదరీమణులు ఫూలో, ఝానోలు నాయ‌క‌త్వం వ‌హించి సంతాల్ పోరాటాన్ని ముందుకు న‌డిపారు. 7 జూలై 1855 భోగనాడిహ్ గ్రామంలో వేలాది మంది సంతలు సమావేశమయ్యారు. వారు తమను తాము స్వేచ్ఛగా ప్రకటించుకున్నారు. తమ అడవులను విడిపించుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ క్ర‌మంలోనే వారిని బెదిరించ‌డానికి వ‌చ్చిన ఓ పోలీసును హ‌త్య చేశారు. పెద్ద ఎత్తున చెల‌రేగిన ఘర్షణలు అడవిలో దావానంలా వ్యాపించాయి. బ్రిటిష్, జమీందార్లపై సంతాల్ తిరుగుబాట్లు ఉధృతమ‌య్యాయి. సంతలు జార్ఖండ్ నుండి బెంగాల్ వరకు అడవులను విముక్తి పొందినట్లు ప్రకటించారు. తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ సైన్యానికి ఏడాదికి పైడా ప‌ట్టింది. ఈ పోరాటంలో వందలాది మంది బ్రిటీష్ అధికారులు, జమీందార్లను సంతాల్ లు మ‌ట్టుబెట్టారు. 20000 కంటే ఎక్కువ మంది సంతాల్ యోధులు సిద్ధూ, కన్హూతో సహా తమ ప్రాణాలను త‌మ స్వేచ్ఛాస్వాతంత్య్రాల కోసం అర్పించారు. తిరుగుబాటు క్రూరంగా అణచివేయబడినప్పటికీ, ఆంగ్లేయులు అటవీ చట్టాలను సవరించుకునే స్థాయిలో సంతాల్ పోరాటం కొన‌సాగింది.